యుద్ధాన్ని ఆదిలోనే ఎందుకు అపారు? ఎవరిని అడిగి కాల్పుల విరమణ చేశారు? ఎందుకు పాకిస్తాన్ పై పూర్తిస్థాయి దాడికి పూనుకోలేదు. పాక్ జుట్టు మన చేతికి అందే సమయంలో మోడీ ఎందుకు లొంగిపోయారు. మధ్యలో అమెరికా పెత్తనమేంటి? గత పాలకులు ఆ మాటకు వస్తే పాక్ పాలకుల మాదిరిగానే పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీకి, మోడీకి కూడా ఇష్టం లేదా? నేను దాడి చేసినట్లు చేస్తా? నీవు ధ్వంసం జరిగినట్లు గగ్గోలు పెట్టాలని ఏమైనా ముందే నిర్ణయించుకున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు భారత ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై దూసుకు వస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్, ఆనాడు ఇందిరా గాంధీ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదని, నాటి ఆమె ప్రసంగాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి మోడీ అమెరికా ఒత్తిడికి లేదా పాక్‌కు తలొగ్గారా? ఎందుకు? రాజకీయంగా అంతా అనుమానిస్తున్నట్లు మోడీకి కూడా కలిసి వస్తే మరిన్ని సార్లు అధికారంలో ఉంటే చాలన్న ఆలోచనలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నల పరంపర కొనసాగుతున్నది.
భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండే పాక్ కు భారత్ పట్ల వ్యతిరేకత ధోరణి వేళ్ళూనుకుని, విస్తరించి, వికటించి, విద్రోహంగా మారి ఉగ్రవాద రూపానికి చేరింది. అది పహల్గాం ఉగ్రదాడితో మరోసారి బయటపడింది. అత్యంత అమానవీయంగా, హేయంగా, దయనీయంగా కుటుంబ సభ్యుల ముందే మతం పేరుతో మారణహోమం స్రుష్టించారు. ఇది భారత ప్రజలను ఎంతగానే కలచివేసింది. పాక్ పని పట్టాలన్న కసి పెరిగింది. దీనికి తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వం పాక్ లోని ఉగ్రవాదులును మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. అయితే, పాకిస్తాన్, మన భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను తిప్పి కొడుతూనే, ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూనే, పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలతోపాటు, పాక్ ఎయిర్ బేస్ లను విధ్వంసం చేసింది. త్రివిధ దళాలు ముప్పేట పాక్ పై దాడులు జరిపారు. దీంతో రెండు రోజుల్లోనే పాక్ దిమ్మ తిరిగి, మైండ్ బ్లాక్ అయింది. అమెరికా జోక్యంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు దారి తీసింది. అయినప్పటికీ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉంది.
పాక్ పై ప్రతీకార దాడులు, మన మహిళల పసుపు కుంకుమలను కాలరాసిన ఉగ్రవాదులను అంతం చేయాలన్న పట్టుదల, దేశ భక్తి, దేశాభిమానం, జాతీయత, ఐక్యత, జరుగుతున్న దాడులు వంటి అనేక అంశాలు మరికొన్ని ప్రశ్నలను మరుగున పడేస్తున్నాయి. సందర్భం కాకపోవడంతోపాటు జాతి మొత్తం ఏకతాటిపై ఉండాల్సిన ఈ సమయంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవడమేంటి? మంచో చెడో మనమంతా మన దేశం కోసం నిలవాల్సిన తరుణం ఇది. ఈ దశలో మరుగున పడుతున్న కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం.
పహల్గాం ఘటన మన ఇంటలీజెన్స్ వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతంలో అంత స్వేచ్ఛాయుతంగా ఎందుకు వదిలేశారు? యధేచ్చగా ఉగ్రవాదులు దేశంలోకి జొరబడుతుంటే ఇంటలీజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ అధునాతన ఆయుధ, కమ్యూనికేషన్, సాంకేతిక వ్యవస్థ అప్పుడు ఎందుకు పని చేయలేదు? పహల్గాం ఘటనను ముందే పసిగట్టలేకపోవడం అటుంచితే, ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరిన మన భద్రతాదళాలు ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయాయి? అంతెందుకు ఆ ఉగ్రవాదులు దేశం విడిచిపోయే పరిస్థితి వరకు ఏం చేసినట్లు?
ఇక ఘటన జరిగిన తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల్లో జరిపిన దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని మనం చెప్పుకుంటున్నాం. సరే, ఆ చనిపోయిన 100 మంది ఉగ్రవాదుల్లో పహల్గాం దాడికి బాధ్యులైన నలుగురు ఉన్నట్లా? లేనట్లా? మన ప్రతీకారం మొదటగా పహల్గాం ఘటనకు బాధ్యులైన ఆ నలుగురు ఉగ్రవాదులపై, తర్వాత ఉగ్రవాదంపై లేదా ఉగ్రవాదులపై, ఆ తర్వాత ఆ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై. ఇప్పుడు జరిపిన దాడులు, తర్వాత పరిణామాలు మన మొదటి టార్గెట్ ని మిస్సైనట్లుగా అనిపిస్తున్నది. పోనీ, ఉగ్రవాదులు చనిపోయినప్పటికీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ను కట్టడి చేయడానికి చేసిన దాడుల్లో పాక్ ఏమైనా పరివర్తనను పొందిందా? అంటే అదీ లేదు. యుఎస్ జోక్యం కోసం కాళ్ళు పట్టుకున్న పాకిస్తాన్, కాల్పుల విరమణ ప్రకటించిన మరు క్షణం నుంచే తిరిగి భారత్ పై డ్రోన్ తదితర దాడులకు పాల్పడుతున్నది. అంటే ఇంత జరిగినా పాక్ లో మార్పులేదు. పాకిస్తాన్ మారలేదు. సరికదా, అదే తెగబాటు వ్యక్తమవుతున్నది. స్పష్టంగా కనిపిస్తున్నది.
అంతర్జాతీయ ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారిన పాక్ లో ఏ మార్పూ లేనప్పుడు, రానప్పుడు దానికి తగిన గుణపాఠం చెప్పితీరాలన్నదే ప్రస్తుతం సగటు భారతీయుడి ఆవేదన. కానీ, యుద్ధ రీతి, నీతి, అంతర్జాతీయ నిబంధనలు, నియమాలు, ఒత్తిడిలు, అవసరాలు, మర్యాదలు… ఇలా అనేక అంశాలపై ముడిపడి అంతర్జాతీయ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఆ రకమైన కాల్పుల విరమణపై సగటు భారతీయుడికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, భారత్ నుండి పాక్ విడి వడినప్పటి నుండీ ముడి వీడని పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్యకు పరిష్కారమే లేకపోవడంపై భారత పౌరుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పీఓకే కారణంగా అశాంతి, అల్లర్లు, ఉగ్రవాదం, మానవ హోమం కేవలం భారత్, పాక్ విభజన రేఖ వెంటే గాక, భారత దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు దారి తీస్తున్నది. ఇప్పటిలాగే, గతంలోనూ చేతికి అందివచ్చిన అవకాశాలు చే జారిపోతున్నాయి. తరతరాలుగా ఇది ఇంకెంత కాలం?
ఇది మన సైన్యానికి మద్దతుగా నిలవాల్సిన సమయం. ఆరోపణలు, విమర్శల సందర్భం కాదు కానీ, ఇటు భారత, అటు పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, అపనమ్మకాలకంటే కూడా అనుమానాలెక్కువగా ఉన్నాయి. ఈ రెండు దేశాల రాజకీయ వ్యవస్థలకు ఓట్లు కురిపించే కల్పతరువుగా పీఓకేకు ముద్ర పడింది. దేశభక్తి, జాతీయత, ఐక్యత, భావోధ్వేగాలతో కూడిన ఈ సున్నిత సమస్య కాస్త రెచ్చితే చాలు ఆ సాకుతో ప్రజల ఓట్లు అనుకూలంగా రాలుతాయని రాజకీయ పార్టీల, ప్రజలకు కూడా ఏర్పడిన నమ్మిక. అందుకని పీఓకే సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాల్లో రాజకీయపార్టీలకు అస్సలు ఇష్టం ఉండదని ప్రజల్లో బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. నిజానికి రాజకీయ పార్టీల, నాయకుల ఆరోపణలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు పట్టించుకోవాల్సింది పార్టీల ఆరోపణలను కాదు. ప్రజల అనుమానాలను. వాటిని నివృత్తి చేయడం ఎలా? అన్నదానిపై దృష్టి సారించాలి. ఆ విధంగా ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి.

