భారత్‌తో పోరాడే శక్తి లేకపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ అబద్ధాల ప్రచారానికి దిగజారింది. యుద్ధంలో తామేదో పొడిచేసినట్లు, భారత్‌పై పైచేయి సాధించామని ప్రపంచానికి చాటి చెప్పే పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది. పాక్ అబద్ధాలు, కుయుక్తులు తెలిసిన ప్రపంచ దేశాలు వీటిని నమ్మకున్నా… ఫేక్ వార్తలను ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ నియంత వెంట ఉన్న గోబెల్స్ ను మించి ప్రచారం చేస్తోంది. ఆనాడు హిట్లర్‌ను ముంచినట్లే ఇప్పుడు పాక్‌ను కూడా ఈ అబద్ధపు ప్రచారాలు ముంచడం ఖాయం.
ప్రస్తుత తరుణంలో పాక్‌కు మద్దతుగా ఏ ఒక్క దేశం ముందుకు రావడం లేదు. టర్కీ వచ్చినా దాని పాత్ర నామ మాత్రమే. రెండు రోజుల దాడులకే పాక్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. భారత్ ప్రతి దాడులతో పాక్ కకావికలం అవుతోంది. ఇప్పుడు జరుగుతున్నవి దాడులే. అసలు యుద్ధం మిగిలే ఉంది. గతంలో కాకుండా, భారత్ ఈసారి పాక్‌కు దిమ్మతిరిగేలా జవాబిస్తోంది. ఇవన్నీ ఇప్పుడు పాక్ పాలకులకు, సైన్యానికి మింగుడు పడటంలేదు. అయితే ఇంతకాలంగా మోసం చేస్తున్న ప్రజలను మరోసారి నమ్మించాలి. లేకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. క్రికెట్‌లో ఓడిపోతేనే అక్కడి ప్రజలు రాళ్లతో కొడతారు. అలాంటిది యుద్ధమంటే మాటలా? ఆషామాషీ కాదు. అందుకే భారత్ బలగాలను దెబ్బ తీసామని, విమానాశ్రయాలను ధ్వంసం చేశామని, భారత్ యుద్ధ విమానాలను కూల్చేశామని అబద్ధాలు ప్రచారం చేస్తోంది. అయితే వీటిని భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. వాస్తవాలను ప్రపంచానికి తెలియచేస్తోంది. భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో ఇలా తన వక్రబుద్ధిని చాటుకుంటున్నది. దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడు తున్నది. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తల్లో నిజానిజాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేటతెల్లం చేస్తున్నది. శుక్రవారం మీడియాలో పలు అంశాలు ప్రచారం కాగా, వాటిపై పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ చేసి, దేశప్రజలకు వాస్తవాలకు నివేదించింది. పాకిస్తాన్‌తోపాటు పలు మీడియా సంస్థలు కూడా పాత ఫొటోలు, వీడియోలను ప్రస్తుత యుద్ధానికి సంబంధించినవిగా అసత్య ప్రచారానికి పూనుకుంటున్నది. దీనిపై భారత్ ముందస్తుగా స్పందిస్తూ వాస్తవాలు, పారదర్శకతతో తప్పుడు సమాచారానికి చెక్ పెడుతూనే ఉన్నది.
నిజానికి భారత్ ప్రతిదాడితో పాక్‌లో అనేక స్థావరాలు దెబ్బ తిన్నాయి. నాలుగు ఫైట్ జెట్లను భారత దళాలు కూల్చేశాయి. లాహోర్ విమాన వ్యవస్థను కుప్పకూల్చింది. ఇవన్నీ బయటకు రాకుండా పాక్ నానా తంటాలు పడుతోంది. ఇందుకోసం అబద్ధాలను, అర్థసత్యాలను ప్రచారం చేస్తోంది. వీటిని భారత రక్షణ శాఖ ఫోటోలతో సహా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తోంది. అలాగే భారతదేశ ప్రజలు ఆందోళనకు, భావోద్వేగాలకు గురికాకుండా చూస్తున్నది. సందేహాలకు తావులేకుండా చేస్తున్నది. నకిలీ వార్తలను ఎలా గుర్తించాలో అవగాహన కల్పిస్తున్నది.
పాకిస్తాన్ వైమానికదళం శ్రీనగర్ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందని, పలు జెట్ విమానాలను కూల్చడంతోపాటు భారత సైనికులను పట్టుకుందని, ఈ దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని పాకిస్తాన్ మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. పాక్ మంత్రులు సహా ఉన్నతాధికారులు ఆ కంటెంట్‌ను ప్రచారం చేశారు. భారత్ దీనిపై వెంటనే స్పందించింది. రియల్ టైమ్ ఫ్యాక్ట్ చెకింగ్ ద్వారా ఆ వీడియో మూలాలను గుర్తించింది. పాక్ అసత్య ప్రచారానికి చెక్ పెట్టింది. వాస్తవానికి ఆ దృశ్యాలు 2024 ప్రారంభంలో పాకిస్తాన్‌లోని ఖైబర్‌లో జరిగిన మత ఘర్షణలకు సంబంధించినవిగా తేటతెల్లం చేసింది. తమదేశంలోనే జరిగిన దాడిని భారత్‌లో జరిగిన దాడిగా నమ్మించే ప్రయత్నం పాక్ చేసింది. భారత బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్టు పాక్ మరో పుకారును సృష్టించింది. సెప్టెంబర్ 2024లో రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఎంఐజీ 29 జెట్ క్రాష్ అయింది. ఆ పాత చిత్రాన్నే వక్రీకరించి అసత్య ప్రచారం చేసింది. కశ్మీర్‌లో కనీసం మూడు భారతీయ జెట్‌లు కూలిపోయాయని చైనా డైలీ ప్రచారం చేసిన చిత్రం 2019 నాటి ఒక సంఘటనకు సంబంధించిందని ఆధారాలతో బయటపెట్టింది. చివరకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేరిట ఫేస్‌బుక్‌లో దుండగులు ఒక ఫేక్ అకౌంట్‌ను సైతం సృష్టించారు. పాక్ రహస్యంగా సైబర్ అటాక్స్ చేస్తున్నదని, పౌరులు మెస్‌జ్‌లను క్లిక్ చేయవద్దని ఆ అకౌంట్‌లో ఒక పోస్టును పెట్టారు. ధోవల్‌కు ఫేస్‌బుక్ అకౌంటే లేదని భారత్ తేల్చిచెప్పింది. సైనిక సిబ్బంది (సీవోఏఎస్) చీఫ్ జనరల్ వీకే నారాయణ్, నార్తర్న్ కమాండ్ ఆర్మీ అధికారికి సైనిక సంసిద్ధతకు సంబంధించి ఒక రహస్య లేఖను పంపారనేదిని అబద్ధమని, జనరల్ వీకే నారాయణ్ సీవోఏఎస్ కాదని, ఆ లేఖ పూర్తిగా నకిలీదని పీఐబీ స్పష్టం చేసింది.
ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో తప్పుడు వీడియోలు, ఫోటోలతో దుష్ప్రచారానికి పాక్ దిగింది. ఇలాంటి ప్రచారాలతో సొంత ప్రజలను ఎంతకాలం నమ్మిస్తారన్నది చూడాలి. యుద్ధంలో తెగువ చూపే ధైర్యం లేక జనావాసాల్లో దాడులకు తెగబడుతున్న పాక్‌ను భారత సైన్యం తిప్పికొడుతోంది. వీటిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని పాక్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను భారత ప్రజలు నమ్మవద్దని, ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నది. మరి మనం అందుకనుగుణంగా నడుచుకుందాం.

