ఆపరేషన్ సింధూర్‌పై విదేశాంగ శాఖ అధికారుల తీవ్ర వ్యాఖ్యలు
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ నిర్వహించిన దాడులు, అంతర్జాతీయ సరిహద్దును ఉల్లంఘించిన తీరుపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో ప్రత్యేక మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధులు, సైనికాధికారులు కీలక వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పాల్గొన్నారు.
కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ, పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం నుంచి హైస్పీడ్ క్షిపణిని ప్రయోగించడం అత్యంత బాధాకరం. పాక్, భారత రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తోంది. ఇది పూర్తిగా ఉగ్రవాద మద్దతుదారులకు అండగా నిలిచిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మాట్లాడుతూ, పాకిస్తాన్ మొత్తం 26 ప్రదేశాలను టార్గెట్ చేసింది. శ్రీనగర్, అవంతిపుర, ఉధంపూర్‌లోని ఆసుపత్రులు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాలపై దాడులు జరిపింది. ఇది అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘన. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా పాక్ అసలు మానవతా విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తోంది అని తీవ్రంగా విమర్శించారు.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మాట్లాడుతూ, పాకిస్తాన్ చేస్తున్న చర్యలు పూర్తిగా రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఉద్రిక్తతలను మరింత పెంచే విధంగా సాగుతున్నాయి. భారత పైన దాడులు చేసిన తరువాత పాక్ వాదనలు అబద్ధాలతో నిండి ఉన్నాయి. అంతేగాక, భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకుందని పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌పై ఎలాంటి క్షిపణి దాడులు జరగలేదు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు చాలా స్పష్టంగా తెలుసుకున్నారు – తాము ఎవరికి లక్ష్యంగా మారారో. ఇది పాక్ తప్పుడు ప్రచారాన్ని బట్టబయలు చేస్తోంది అని తెలిపారు.
ఆపరేషన్ సింధూర్ భారత భద్రతా వ్యవస్థ చాకచక్యానికి నిదర్శనంగా నిలిచిందని అధికారులు స్పష్టం చేశారు. పాక్ ఉగ్ర మౌలిక సదుపాయాలపై సమన్విత దాడులు చేసి వాటిని ధ్వంసం చేయడం ద్వారా దేశాన్ని రక్షించడంలో కీలక ముందడుగు వేసిందని తెలిపారు. భవిష్యత్తులో భారత్‌కు హాని కలిగించే ఎలాంటి ప్రయత్నానికీ గట్టి బుద్ధి చెప్తామని అధికారులు హెచ్చరించారు.
ఈ సంఘటనలు దక్షిణాసియా భద్రత పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉన్నాయి. భారత్ తలెత్తిన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ శాంతిని, భద్రతను సరిదిద్దుతున్నారు.

