సగం ప్రపంచం నిద్రపోతున్నది. మిగా సగం తమ పనుల్లో నిమగ్నమై ఉంది. నిద్రలో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో తెలవదు. పనిలో ఉన్న మిగతా ప్రపంచం గుర్తించలేదు. సరిగ్గా పహల్గామ్ దాడి జరిగిన 15 రోజులకు అర్ధరాత్రి వేళ – భారత ప్రతీకారాగ్నికి ప్రత్యర్థి పాక్ గగన తలం “సింధూర” కాంతులతో ఎరుపెక్కింది. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్టులు దాక్కున్న తొమ్మిది కలుగుల్లోకి దూరి భారతీయ విస్ఫోటక అస్త్రాల్రు నేలమట్టం చేశాయి. అర్ధరాత్రి చిమ్మచీకట్లో శత్రుభూమిలో కనీసం కాలు పెట్టకుండా, నిప్పులు కురిపిస్తూ భారత్ జరిపిన ఈ దాడి తెల్లారేసరికల్లా తెలిసి, యావత్తు ప్రపంచం ఉలిక్కి పడింది. పాక్ వెన్నులో వణుకే పుట్టింది. ఉన్మాదుల కాల్పుల్లో తమ భర్తల్ని కోల్పోయిన భారత స్త్రీలు- భారత అస్త్రాలు రగిల్చిన సింధూర కాంతుల్న చూసి గర్వంతో ఉప్పొంగే వుంటారు.
చరిత్రాత్మక ఈ భారత ప్రతీకార దాడికి ప్రపంచదేశాలన్నీ దన్నుగా నిలిచాయి. భారత్ ను దోషిగా నిలబెట్టాలని చివరి క్షణంలో పాకిస్తాన్ భద్రతాసమితిలో చేసిన దింపుడుకల్లం ప్రయత్నం బెడిసికొట్టింది. ఒక్కదేశం కూడా పాక్ తో కలిసి రాలేదు. రెండువారాల పాటు అందరి మద్దతు కూడగట్టి, పటిష్టమైన నిఘా, యుద్ధ వ్యూహం పన్ని, నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. మిగతా కార్యాన్ని మన త్రివిధ దళ సేన అత్యంత పకడ్బందీగా నిర్వహించిన తీరు అభినందనయం. ఈ దాడితో, మతం పేరిట జరిపిన మారణహోమంలో నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందూ పర్యాటకుల ఆత్మలు శాంతించాయనే భావిద్దాం.
ఇంతటితో ఆగక ఇంకా దుస్సాహసానికి దిగితే సర్వనాశనం తప్పదని అమెరికా చేసిన హెచ్చరికతో కూడిన హితవుకి పాక్ తల ఒగ్గిందా సరే. లేదంటే మళ్ళీ కల్లో కూడా వూహించడానికి భయంతో చచ్చేలా గుణపాఠం చెప్పడానికి భారతీయ సేనలు సరిహద్దుల్లో మోహరించి సిద్ధంగా ఉన్నాయి. మతోన్మాదుల రక్తంతో బాధిత మహిళల నుదుట తిలకం దిద్దిన సైన్యం సాహసానికి వందనం.
మొత్తంగా కొందరు అనుకున్నట్లుగా ఆలస్యం లేకుండానే.. భారత్ గర్జించింది. తన సత్తా ఏమిటో లోకానికి చాటింది. మనమేంటో మరోమారు పాక్‌కు రుచి చూపింది. పాక్ పెంచుతున్న ఉగ్రమూకల పుట్టలను పటపటా పగులగొట్టింది. ఉగ్రస్థావరాలు లక్ష్యంగా చేసిన మెరుపుదాడితో పాక్ ఉక్కిరిబిక్కిరి అయింది. 9చోట్ల జరిపిన దాడులతో వందకు పైగానే ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. గత పాలకులు దూరదృష్టి లోపం వల్ల పాక్‌తో నిరంతరంగా ఉగ్రవాదాన్ని భారత్ పైకి ఎగదోస్తోంది. నాకేం తెలియదని నంగనాచి కబుర్లు చెబుతోంది. అప్పట్లో జరిగిన యుద్దాల్లో పాక్‌ను దయతలచి వదిలి పెట్టడం జరిగింది. ఏకుమేకు అయినట్లు పాక్ పక్కలో బల్లెంగా మారింది. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాం. ఆనాడే 90వేల మది సైన్యం భారత్ చేతికి చిక్కినా.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించి పట్టుబట్టలేదు. అనేక విషయాలను అలాగే వదిలేశాం. ఇలా చేయడంతో ఇంతకాలం మనం ఎన్నో ఉగ్రదాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరోపక్క భారత్‌ను చీల్చుకుని పుట్టుకొచ్చిన పాక్, బంగ్లాలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన వ్యవహరిస్తున్నాయి. వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సిన సమయంలో ఇప్పుడు భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుని ‘ఆపరేషన్ సింధూర్’ను అమలు చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు, పాక్ భూభాగంలోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై విరుచుకుపడి దాడులు చేసింది. నిమిషాల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అందరూ నిద్రపోతున్న వేళ..ఎలాంటి అలజడి లేకుండా భారత సైన్యం పని పూర్తి చేసింది. కానీ, ఇది ఇంతటితోనే ఆగుతుందని అనడానికి లేదు. పాక్ నుంచి వచ్చే ప్రతిస్పందన ఆధారంగా మన దాడులు మరింతగా ఉండే అవకాశం లేకపోలేదు.
370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ లో ప్రశాంత వాతావణం ఏర్పడి, పర్యాటకం మళ్లీ పురివిప్పింది. దీనిని చెడగొట్టే లక్ష్యంతో పాక్ కుట్రలు పన్నుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతోంది. ఉగ్రవాదాన్ని ఉసి గోల్పుతోంది. ఈ వరసలో జరిగిన దాడే పహల్గామ్ ఊచకోత. ఈ దాడులను ఇక ఎంతమాత్రం ఉపేక్షించబోమని భారత్ జరిపిన ప్రతిదాడుల హెచ్చరికతో పాక్ దారికి రావాలి. లేకుంటే ప్రపంచ పటంలో పాక్ ఆనవాళ్లు కూడా ఉండవని గుర్తించాలి.

