పాక్ స్థావరాలపై భారత్ మెరుపు దాడులు!
పాక్ లో దాడులు 1971 తర్వాత ఇదే తొలిసారి
పాక్ ప్రతి స్పందనపై సర్వత్రా ఆసక్తి
భారత భద్రతాదళాలను అభినందిస్తూ పలువురి ట్వీట్లు
అంతా అనుకున్నట్లే అయింది. టెర్రరిజంపై యుద్ధం మొదలైంది. తూరుపు సింధూరపు కిరణాలు పాక్ భూభాగంపై పడక ముందే ‘ఆపరేషన్ సింధూర్!’ మొదలైంది. తెలతెల వారుతుండగానే భారత్ భద్రతాదళాలు పాక్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. మెరుపు దాడులు చేశాయి. 9 స్థావరాలను ఉగ్రమూకల నుండి విముక్తి చేశాయి. ఈ దాడులు పాక్ ను గడగడలాడించాయి. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ దేశ సమగ్రతను, పౌరుల భద్రతను కాపాడటానికి సిద్ధంగా ఉన్నదని ప్రపంచానికి చాటి చెప్పినట్లైంది. పాక్ లో దాడులు 1971 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే లేస్తే మనిషిని కాదంటున్న పాక్ ప్రతి స్పందన ఏ విధంగా ఉండనుందన్నదే ఆసక్తిగా మారింది. అయితే భారత భద్రతా దళాల చర్యలను అభినందిస్తూ రాష్ట్రపతి, ప్రధాని తదితరులు ట్వీట్లు చేశారు.
జమ్మూకశ్మీర్‌లో రుధిర క్రీడకు తెగబడి పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రమూకలకు భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది. పాక్ బంకర్ల కలుగుల్లో దాక్కున్న ఉగ్ర ఎలకలను ఏకోన్ముఖంగా మూకుమ్మడిగా తగలబెట్టేసింది. 9 కీలక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ దాడులు పాక్ ను గడగడలాడించాయి. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ సాయుధ దళాలు సమష్టిగా దేశం సమగ్రతను, పౌరుల భద్రతను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ కోడ్ నేమ్ పెట్టారు. ‘ఆపరేషన్ సింధూర్’ అనేది కేవలం యాథృచ్చికంగా పెట్టింది కాదు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిగా భారత్ దేశంలో ఉన్న మహిళలకు భరోసాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాక్ నుంచి విముక్తి పొందిన 9 స్థావరాలు
పాకిస్తాన్ సహా, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు విముక్తి చేశాయి. వాటిలో 1. మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ – జేఎం, 2. మర్కజ్ తైబా, మురిద్కే – ఎల్ఇటి, 3. సర్జల్, తెహ్రా కలాన్ – జెఎం, 4. మెహమూనా జోయా, సియాల్‌కోట్ – హెచ్ఎం, 5. మర్కజ్ అహ్లే హదీస్, బర్నాలా – ఎల్ఇటి, 6. మర్కజ్ అబ్బాస్, కోట్లి – జెఇఎం, 7. మస్కర్ రహీల్ షాహిద్, కోట్లి – హెచ్ఎం, 8. షావాయి నల్లా క్యాంప్, ముజఫరాబాద్ – ఎల్ఇటి, 9. సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ – జే
భారత రక్షణ శాఖ విడుదల చేసిన లేఖ సారాంశం ‘కొద్దిసేపటి క్రితం, భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించాయి, భారతదేశంపై ఉగ్రవాద దాడులకు ప్లాన్ చేసిన పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ, కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. తొమ్మిది స్థావరాలలు లక్ష్యంగా దాడులు జరగాయి. కానీ, పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలపై మాత్రమే దాడులు చేశాం. నిర్ణీత లక్ష్యాన్ని గురి చూసి కొట్టాం. లక్ష్య అమలు పద్ధతిలోనూ భారతదేశం గణనీయమైన సంయమనాన్ని ప్రదర్శించింది. 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడిని హత్య చేసిన అనాగరిక, పాశవిక పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ చర్యలు జరిగాయి. ఈ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచాలనే నిబద్ధతకు మేము కట్టుబడి ఉన్నాం. కాగా, ఈ రోజు ఉదయం 10 గంటలకు ‘ఆపరేషన్ సింధూర్’ గురించి వివరణాత్మక బ్రీఫింగ్ ఉంటుంది.’ అని అందులో తెలిపింది.

భారత్, పాక్ ల అలెర్ట్
ఇదిలావుండగా, యుద్ధం నేపథ్యంలో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్‌కోట ఎయిర్‌పోర్ట్‌లు మూసివేసింది. ఇస్లామాబాద్, రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. పంజాబ్‌లో విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు భారత దేశంలోని ధర్మశాల, లే, జమ్మూ, శ్రీనగర్, అమృతసర్‌తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానల రాకపోకలు రద్దు చేసింది. 9 నగరాలకు విమానాల రాకపోకలను ఎయిరిండియా రద్దు చేసింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దు అయ్యాయి.
భారత్ దాడులను తిప్పి కొడతామని బీరాలు పలుకుతూ, బింకాలు పోతున్న పాక్ సమాధానం ఏ విధంగా ఉండనుంది? అన్నదే ఆసక్తిగా మారింది.

