భారత్ లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాద గ్రూపులను రెచ్చగొట్టడం వంటి అంశాలను పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంగీకరించారు. ఒక ఇంటర్వ్యూలో ఇలా స్పందించారు.
“మీరు ఒప్పుకుంటారా, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడం వంటి చరిత్రను చాలా కాలంగా కలిగి ఉందని?”
“అవును, మేము మూడు దశాబ్దాలుగా యునైటెడ్ స్టేట్స్ కోసం ఈ నీచమైన పని చేస్తున్నాం. మీకు తెలుసా? పశ్చిమ దేశాలకు. బ్రిటన్ తో సహా.”
“సరే, అదేనా మీ వాదన?”
అతను వెంటనే తనను తాను సరిదిద్దుకుని, “అది పొరపాటు. మేము దాని కోసం బాధపడ్డాం. అందుకే మీరు నాతో ఇలా చెబుతున్నారు.” అని బుకాయించారు.
‘‘రంకునేర్చినమ్మ బొంక నేర్చింద’’ని, భారత్‌లో ఉగ్రదాడులు జరిగినప్పుడల్లా పాక్ ఇలా బుకాయిస్తూనే ఉంది. ముంబై ఉగ్రదాడుల సమయంలోనూ ఇదే చెప్పింది. అజ్మల్ కసబ్ గురించి చెప్పినా కసబ్ మా దేశస్థుడే కాదని బొంకింది. కసబ్ పుట్టు పూర్వోత్తరాలు బయటపడ్డాక కూడా నిస్సిగ్గుగా అదే పాట పాడింది. ఇప్పడు కూడా అదే తొండి కూత కూస్తోంది. మరి ఢిల్లీలోని పాక్ రాయబారి కార్యాలయంలో కేక్ సంబరాలపై మాత్రం తెల్లమొహం వేస్తోంది. టెర్రరిస్టులకి ‘పాక్’ మద్దతిస్తుందన్న దానికి ఈ ‘కేక్’ రుజువుగా మారి, ‘హాట్ కేక్’ అయిపోయింది. పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను పిలిపించి ‘పర్సోనా నాన్ గ్రాటా’ (అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే) అధికారిక నోటీసులు అందించింది. ఈ నోటీసుల ప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్‌ను వీడాల్సి ఉంటుంది. ఇదిలావుండగా బలూచిస్థాన్ ఘటనలను భారత్‌కు అంటగట్టే ప్రయత్నం చేసి తన లాలూచీని బయటపెట్టుకుంది. మనం టెర్రరిస్టుల జాబితాని సమర్పించినా, వారు పాక్‌లో వున్నారని అడ్రసులిచ్చినా అప్పగించడం లేదు. సరికదా, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాదులను దాచిపెడుతోంది. పైగా వారిని పాముల మాదిరి పాలుపోసి పెంచుతోంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ నేతల ప్రకటనలు ఉగ్రవాదులకు ఊతమిస్తున్నాయి. మనకు రోత పుట్టిస్తున్నాయి. పహల్గాం టెర్రరిస్ట్ దాడితో మాకు సంబంధం లేదని సుద్దపూసలా దాడిని ఖండించింది. కానీ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ వ్యాఖ్యలతో వారి నిజస్వరూపం బట్టబయలైంది. 28 మంది అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా ఊచకోత కోసిన నరరూప రాక్షసులను స్వాతంత్య సమరయోధులతో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలతో పాక్ డొల్లతనం ప్రపంచదేశాల ముందు మరోసారి తేటతెల్లమైంది. భారత్ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై కూడా తిక్కతిక్కగా మాట్లాడాడు. ‘పాకిస్తాన్‌లో 240 మిలియన్ల మందికి సింధు నది నీరు అవసరం. మీరు ఆ ఒప్పందాన్ని ఆపలేరు. ఒకవేళ ఇండస్ ట్రీటీ- రద్దు చేస్తే అది యుద్ధ చర్యకు సమాన’మని బీరాలు పలికాడు. ఆ దేశం కూడా అదే విధమైన ప్రతిచర్యను ఎదుర్కొంటుందని అంటే మనమీద యుద్ధం చేస్తామని హెచ్చరించాడు. ఇషాక్ దార్ మాటలపై భారత ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదే పాక్ నిజస్వరూపమని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనడానికి ఇంతకన్నా ఇదే నిదర్శనమని దుమ్మెత్తిపోస్తున్నారు. చివరకు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా దార్ మాటలని పిచ్చి ప్రేలాపనలుగా కొట్టి పారేశాడు. పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా ఒప్పుకున్నట్లయిందని, ఉగ్రవాదంతో పాక్ ప్రజలు బాధపడుతున్నారని అన్నాడు. పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశాడు.
కాశ్మీర్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఈ దాడి వెనక లష్కరే తయ్యబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. సయీద్‌తో పాటు అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రమూకలను అమాయకుల మీదకు ఊసిగొల్పారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఎల్‌ఈటీకి అనుబంధంగా ఉన్న కరుడుగట్టిక ఉగ్రవాదుల బృందం బైసరన్‌లో నిర్దాక్షిణ్యంగా 26మంది అమాయకులను మట్టుపెట్టింది. నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఈ బృందంలో ప్రధానంగా విదేశీ ఉగ్రవాదులు ఉంటారు. వీరికి స్థానిక మిలిటెంట్లతోపాటు కాశ్మీర్‌లో మరికొందరు సహకరించినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పాక్ ప్రభుత్వ మద్దతుతో హఫీజ్ సయీద్, అతడి ముఖ్య అనుచరులు ఈ ఉగ్రమూకలకు నేరుగా సహాయపడి ఉండొచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అయితే పహల్గాంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను జల్లెడ పడుతున్నాయి.
మరోవైపు పాక్ పై భారత్ ముప్పేట కట్టడి చేస్తున్నది. అంతర్గతంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. అయితే, పహల్గాంకు ప్రతీకారం తీర్చుకోవడంపైనే భారత ప్రజలు చర్చిస్తున్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడం, పాక్ తో వైరాన్ని శాశ్వతంగా పరిష్కరించడం, యుద్ధం వస్తే ఎలా? పాక్ ను పూర్తిగా నిలువరించడానికి వ్యూహాలేంటి? అన్న అంశాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.
పహల్గాం సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. అన్నింటికి అతీతంగా, దేశంలో మరోసారి దేశ భక్తిని రగిల్చింది. దేశం మొత్తం మరణించిన వారికి నివాళులర్పిస్తున్నది. ఐక్యంగా పాకిస్థాన్ ను ఎదుర్కోవడంపై చర్చిస్తున్నది. ప్రపంచ దేశాల ముందు క్రమేనా పాక్ రంగుతేలి ఒంటరి అవుతున్నది. ఇక భారత ప్రభుత్వంపైనే అంతా ఆధారపడి ఉంది.

