దేశ అత్యున్నత న్యాస్థానం అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల అనేక చారిత్రక తీర్పులను వెలువరిస్తోంది. న్యాయ మార్గనిర్దేశనం చేస్తోంది. పార్టీల ఫిరాయింపులు, రాజకీయ నాయకులపై కేసులు, వారి ఆస్తులు, వర్సిటీ భూములు వంటి ఎన్నో కీలక తీర్పులను సుప్రీం కోర్టు ఇస్తున్నది. తాజాగా గవర్నర్ వ్యవస్థపై ఇచ్చిన ‘సుప్రీం’ సర్వోన్నత తీర్పు సర్వోత్తమమైంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు గవర్నర్ వ్యవస్థ ‘కీ’లకంగా మారింది. గవర్నర్ వ్యవస్థ ఆరోవేలు లాంటిదంటారు. ఆ వేలు ఉన్నా, లేకున్నా ఒకటే అని దాని అర్థం. కానీ ఆ వేలునే వాడుకోవడం, ఆ వేలుతోనే ఆడుకోవడం రాజకీయ నాయకులకు అలవాటైంది. రాను రాను గవర్నర్ వ్యవస్థ రాజకీయ పదవుల పునరావాస కేంద్రంగా మారిపోయింది. అందుకే గవర్నర్ వ్యవస్థను ఎత్తేయడానికి పాలకులు ఇష్టపడటం లేదు. దేశంలో ఈ వ్యవస్థ వల్ల ఏటా వేల కోట్లు దుర్వినియోగం అవుతున్నాయి. పైగా ప్రజలకు ప్రత్యక్షంగా ఎలాంటి ఉపయోగం లేదు. అంతేకుండా రాష్ట్రాల్లో అనవసర అధికార కేంద్రంగా మారింది. గతంలోనే గవర్నర్ వ్యవస్థని ఎత్తేయాలని ఎన్టీఆర్ సహా అనేకులు డిమాండ్ చేసినవారే. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఈ వ్యవస్థ వల్ల ఒరిగిందేవిూ లేదు. అందుకే కమ్యూనిస్టులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీలు మాత్రం నోరు మెదపడం లేదు.
గతంలో 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఆగస్టు సంక్షోభం గుర్తుండే ఉంటుంది. ఇటీవల తమిళనాడులో జరిగిన రచ్చను చూశాం. గతంలో బెంగాల్లోనూ, కేరళలోనూ గవర్నర్ వ్యవస్థ వల్ల రచ్చ రచ్చే. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కళ్ళకు కట్టింది. రాష్ట్రాల గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కొత్తేమీ కాదు. గవర్నర్ల వైఖరిని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది. కేరళ ప్రభుత్వం లేవనెత్తిన అంశాల ప్రాధాన్యతను, ఔచిత్యాన్ని ‘సుప్రీం’ తీర్పు నొక్కిచెప్పింది. కేరళ మాజీ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన పలు బిల్లులను తొక్కి పెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి ఇటీవల ‘సుప్రీం’తో చివాట్లు తిన్నారు. అసలు ట్విస్టేంటంటే, గవర్నర్ ప్రమేయం లేకుండానే పెండింగ్ బిల్లులను పాస్ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. గవర్నర్ల మితివిూరిన నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు…రాజకీయ పార్టీలకు కనువిప్పు కావాలి. కాంగ్రెస్ కాలం నుంచే గవర్నర్ వ్యవస్థను ఆ పార్టీ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకుంది. బీజేపీ కూడా దానిని కొనసాగిస్తోంది.
నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఫెడరలిజం బలోపేతానికి జరుగుతున్న పోరాటానికి ‘సుప్రీం’ తీర్పు ఒక ఊతం. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులకో రక్షణ కవచం. ఈ తీర్పు ఒక్క తమిళనాడుకు మాత్రమే పరిమితమైనది కాదు. మొత్తం భారతదేశంలోని రాష్టాల్రన్నింటికీ సంబంధించినది. జస్టిస్ జె.బి. పార్ధివాలా, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు సూటిగా ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అంతేకాదు గవర్నర్లు ఎంతలో ఉండాలో నిర్దేశించింది. నెలలోగా బిల్లులను ఆమోదించాలని చెప్పింది. లేకుంటే ఆ బిల్లులు విధానాలుగా మారుతాయని తేల్చింది. గవర్నర్లంటే… కేంద్ర ప్రభుత్వానికి ఊడిగం చేసే దుస్సంప్రదాయానికి ఈ తీర్పు చెల్లుచీటీ రాసింది. అయితే, బీజేపీ ఎక్కడా ఈ తీర్పుపై మాట్లాడ లేదు. రాజ్యాంగానికి నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పలేదు. గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలగవలసిన వ్యక్తి కాదని, ఆ పదవి రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని గతంలో ’ఎస్.ఆర్ బొమ్మై వర్సెస్ భారత ప్రభుత్వం’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. తాజాగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా తనవద్దే తొక్కిపెట్టిన గవర్నర్ వైఖరిని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. కీలకమైన 10 బిల్లులను ఆమోదించకుండా తన వద్దనే తొక్కిపెట్టి , ఆయన తీసుకున్న నిర్ణయం, వ్యవహరించిన తీరు చట్టవిరుద్ధం, ఏకపక్షం’ అని అభివర్ణించింది. ఒకసారి శాసనసభ బిల్లులను ఆమోదించిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకోవడానికి న్యాయస్థానం కాలపరిమితిని కూడా నిర్దేశించింది. ఈ బిల్లులకు సంబంధించి గవర్నర్ తీసుకున్న చర్యలన్నీ రద్దవుతాయని, అసెంబ్లీ… గవర్నర్‌కు తిరిగి పంపిన తేదీ నుంచి ఈ బిల్లులన్నీ ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని ‘సుప్రీం’ స్పష్టం చేసింది. ప్రజలచే ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల సలహా మేరకు గవర్నర్ వ్యవహరించాలని, రాష్ట్రాలను వీటో చేసే అధికారం రాజ్యాంగం వీరికి ఇవ్వలేదని కోర్టు పునరుద్ఘాటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావసరాలు, సంక్షేమం కోసం చట్టాలను రూపొందిస్తాయి. వాటిని నిరోధించే వైఖరి రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుపడటం గవర్నర్ పని కాదని ఎత్తిచూపుతూ…గవర్నర్ రవి అడ్డుకున్న పది బిల్లులను సుప్రీం ఆమోదించింది.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని సమర్థించే ఈ తీర్పు…అసెంబ్లీ హక్కులను హరించే గవర్నర్ల వైఖరికి ఒక హెచ్చరిక. బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు చెంపపెట్టు లాంటిదని కూడా చెప్పకతప్పదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతికి ముందు వచ్చిన ఈ తీర్పు రాజ్యాంగాన్ని కాలరాస్తున్న వారికి కనువిప్పుకావాలి. ఈ తీర్పుతో అయినా గవర్నర్ వ్యవస్థతో పనిలేదని గుర్తించాలి. దీనిని రద్దు చేసేందుకు అంతా ఉద్యమించాలి.

