64వ జాతీయ ఫార్మసీ సప్తాహం : 16-22 నవంబర్ 2025
వ్యాక్సిన్ లు అంటు వ్యాధులను తక్కువ ఖర్చుతో నివారించే సాధనాలు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు ఎచ్ ఓ) ప్రకారం ప్రస్తుతం 26 పైచిలుకు అంటువ్యాధులకు వ్యాక్సిన్ లు లభ్యమైతున్నయి. వ్యాక్సిన్ లు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 25 లక్షల మరణాలను నివారిస్తున్నట్లు అంచనా. సంప్రదాయంగా ఫార్మసిస్ట్ లు వ్యాక్సిన్ ఉత్పత్తి, శీత శృంఖల నిర్వహణ, సరఫరా, పంపిణీకి పరిమితం కాగా, మెడికల్ ప్రాక్టీషనర్ లు, నర్స్ లు వ్యాక్సినేషన్ చేస్తున్నరు. వ్యాక్సిన్ ల ప్రభావశీలత, కావలసిన లభ్యత ఉన్నప్పటికీ ప్రజల స్వీకరణ ఇంకా చేరవలసిన స్థాయి కంటే తక్కువగానే ఉంది. వ్యాక్సినేషన్ స్థాయిని పెంచటానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ “ఇమ్యూనైజేషన్ ఎజెండా 2030” ని ప్రకటించింది. వ్యాక్సినేషన్ చేసే లేదా టీకాలు ఇచ్చే వ్యక్తులుగా ఫార్మసిస్ట్ లను తక్కువ వినియోగించు కొంటున్న తీరు గమనించిన డబ్ల్యు ఎచ్ ఓ వారిని కీలక భాగస్వాములను చేయాలని గుర్తించింది. నిజానికి వ్యాక్సినేషన్ చేయటం ఫార్మసిస్ట్ లకు కొత్త కాదు. 1800 సంవత్సరం నాటికే వ్యాక్సినేటర్ లుగా ఫార్మసిస్ట్ ల పాత్ర కొనసాగుతున్నది. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ప్రధానంగా ఆధార పడేది ఫార్మసిస్ట్ ల పైనే.

వ్యాక్సినేషన్ లో ఫార్మసిస్ట్ ల పాత్ర విస్తరించాలనే డబ్ల్యూ ఎచ్ ఓ నిర్ణయం వ్యాక్సినేషన్ స్థాయిని పెంచటంతో పాటు, ప్రజా ఆరోగ్య అవసరాలు తీర్చడానికి ప్రత్యేకించి దిగువ, మధ్య తరగతి ఆదాయ వర్గాలు ఉన్న దేశాలలో బాగా ఉపయోగ పడ గలదు. ఫార్మసిస్ట్ ల వద్ద వాక్సిన్ తీసుకోవటం ప్రజలకు నమ్మకంతో పాటు చాలా సౌకర్యంగా, సౌలభ్యంగా ఉండగలదు.
ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్, కామన్ వెల్త్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ కూడా

ఈ మేరకు ఫార్మసిస్ట్ లను వ్యాక్సినేటర్ లు పరిణమించటానికి ప్రేరణ కలిగిస్తూ, శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నయి. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ విజ్ఞప్తి ననుసరించి భారత ప్రభుత్వం 2020 నవంబర్ 23 నాడు ఫార్మ సిస్ట్ లను వ్యాక్సినేషన్ చేసే ఆరోగ్య నిపుణుల జాబితాలో చేర్చింది. నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో ఉన్న వ్యాక్సిన్ లతో పాటు ఫార్మసిస్ట్ లు ధనుర్వాతం, కంచుక (షింజిల్స్), టైఫాయిడ్, న్యుమోనియా, హెపటైటిస్, మెదడు వాపు, అమ్మ తల్లి (ఆటలమ్మ), కుక్క కాటు, హ్యూమన్ పాపిలోమ వైరస్, కోవిడ్ 19 వంటి చాలా వ్యాక్సిన్ లను పిల్లలకు, పెద్దలకు ఇచ్చే వెసులుబాటు లభిస్తుంది. ఈ విషయమై ప్రజలను చైతన్య పరచటానికి ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ (ఐ పి ఎ) 64వ జాతీయ ఫార్మసీ సప్తాహం కోసం “ఫార్మసిస్ట్స్ యాస్ అడ్వకేట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్” అనే నినాదాన్ని ఎంపిక చేసింది. మన దేశంలో 17 లక్షల ఫార్మసిస్ట్ లు ఉన్నరు. వారు అందించే వ్యాక్సినేషన్ సేవలతో అంటు వ్యాధుల నివారణలో భారతదేశం అగ్రగామిగా నిలువగలదు.


