1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యాన్ని సాధించిన భారత్, 2025లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. దాదాపు ఎనిమిది దశాబ్దాల కాలంలో దేశం అనేక రంగాలలో అభివృద్ధి చెందినప్పటికీ, అనేక అంశాల్లో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ఈ సందర్భంలో గత అనుభవాల గుణపాఠాల నుంచి ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధిని సాధిస్తూనే, భవిష్యత్ పురోగతిపై ఓ అంచనాకు రావడం అవసరం.
ప్రస్తుత భారత రాజకీయాలు అత్యంత దారుణంగా ఉన్నాయి. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పట్ల విధేయంగా ఉన్నట్లుగా కనిపిస్తున్న పార్టీలకు, నాయకులకు వాటి పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నట్లుగా అనిపించదు. ప్రజాస్వామ్యానికి, మౌలిక హక్కులకు, ధర్మనిరపేక్షతకు ప్రతిరూపంగా నిలిచే రాజ్యాంగానికి అనుగుణంగా నడవాల్సిన పాలన, ప్రభుత్వాలు, రాజకీయాలు అన్నీ రాజ్యాంగాన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ప్రజలు, అభివృద్ధి కేంద్రంగా పని చేయాల్సిన ప్రభుత్వాలు పెడదారి పట్టాయి. ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతాం. మరెంతకైనా తెగిస్తామన్నట్లుగా పని చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ విలువలు మరీ దిగజారుతున్నాయి. దేశ సగటు పౌరుడు వర్తమాన రాజకీయాలను అసహ్యించుకుంటున్నాడు. పార్టీలను ఏవగించుకుంటున్నాడు. వాటి కార్యకలాపాలను ఈసడించుకుంటున్నాడు. పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం తగ్గిపోతుండగా, అధికార పక్షం తరచూ ప్రతిపక్షాన్ని అణచివేయడానికి మాత్రమే అధికారాన్ని ప్రయోగిస్తోంది. ప్రజల పక్షాన నిలిచి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలకు అధికారం మీద ఉన్న యావ ప్రజల మీద ఉండటం లేదు. దీంతో భారత రాజకీయ వ్యవస్థ మీద ప్రజల నమ్మకాలు నశించిపోయి, వారి ఆశలు, ఆశయాలు, అభివృద్ధి, స్థితిగతులు, జీవన ప్రమాణాలు రోజురోజుకు క్షీణిస్తూ వమ్మవుతున్నాయి. ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాలు పేదలను నిరుపేదలుగా మార్చి, ధనవంతులను ఆగర్భ శ్రీమంతులను చేసే విధంగానే ఉంటున్నాయి. మన రాజ్యాంగాన్ని వందకు పైగా మార్లు మార్చిన మనకు, స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్ళు కావస్తున్నా, 200 ఏళ్ళనాటి చట్టాలే అమలవుతున్నాయి. ఇది మన పాలకుల చేతగాని తనానికి నిదర్శనం. ఇదే సమయంలో కొన్ని ముఖ్యమైన చట్టాలు చర్చలకే తావులేకుండా ఆమోదించడం, న్యాయవ్యవస్థలోనే అవినీతి మితిమీరడం, మీడియా స్వేచ్ఛపై అదుపాజ్ఞలు, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ నిఘా, దర్యాప్తు సంస్థలను రాజకీయ లక్ష్యాలకు ఉపయోగించడం, ప్రభుత్వాల్లో నియంతృత్వం పెచ్చరిల్లడం, చట్టాలు చట్టుబండలవడం వంటివి ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈవీఎంలపై అనుమానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలుగా ఉన్న శాసన వ్యవస్థ, బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, మీడియాల్లో అన్నింటిలోనూ అవినీతి, అక్రమాలు తాండవిస్తుండటం నేటి ప్రజాస్వామ్య తిరోగమనానికి నిదర్శనం.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలలో భారత్ ఒకటి. త్వరలోనే వాల్డ్ త్రీ ఎకానమీ కంట్రీగా నిలుస్తున్నామని ప్రధాని అంటున్నారు. కానీ, ఈ అభివృద్ధి అన్ని వర్గాలకు అందుబాటులోకి రాలేదు. 2025 నాటికి దేశ జీడీపీ వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉన్నా, ఉపాధి రాహిత్యం, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు తీవ్రమవుతున్నాయి. అక్షరాస్యత పెరిగి, విద్యావంతులలో నిరుద్యోగిత పెరుగుతూ ఉండడం, అప్పుల్లో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్యలు, కనీస మద్దతు ధర కోసం కొట్లాట ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ వ్యవసాయం లాభసాటిగా లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆనందంగా లేడు.
దేశం అనేక జాతులు, మతాలు, భాషల సమ్మిళితం. కానీ సామాజిక సమస్యలు గణనీయంగా పెరిగాయి. మత రాజకీయాలు, మత విద్వేష చర్యలు మత సామరస్యాన్ని దెబ్బతీసి, దేశ ఐక్యతపై ప్రభావం చూపుతున్నాయి. నిర్బంధ వివాహాలు, కుల ఆధారిత దాడులు, దళితులపై దాడులు, మహిళలపై అ(హ)త్యాచారాలు, వేధింపులు పెరుగుతున్నాయి. మహిళలకు సమాన రాజకీయ, ఆర్థిక అవకాశాలు లేవు.
భారత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ద్వారా సంస్కరణలు చేయాలని ప్రయత్నిస్తోంది. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ప్రమాణాలు దారుణంగా ఉన్నాయి. విద్యాభ్యాసం కుంటుపడింది. ఉన్నత విద్య ప్రైవేట్ రంగం ఆధీనంలోకి వెళ్లింది. ప్రభుత్వ ఆరోగ్య సేవలపై వ్యయం పెరిగినా, ప్రభుత్వ వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల లోపం, వైద్యుల కొరత, ప్రైవేట్ హాస్పిటల్స్ లో అధిక ఖర్చుల వల్ల సామాన్యులు తీవ్రంగా సతమతమవుతున్నారు. ఆయష్మాన్ భారత్ వంటి పథకాలు సమగ్రతగా నడుస్తున్నాయా? సందేహామే.
ప్రగతి పేరిట ప్రకృతిని నాశనం చేసే ధోరణి పెచ్చరిల్లింది. అడవులు అంతరించే విధంగా పారిశ్రామిక విధానం, గాలి. నీటి కాలుష్యం పెరగడం, నీటి కరువు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.
సాంకేతికంగా డిజిటలైజేషన్‌లో దేశం ముందుంది. కానీ, లింగ భేదం, నగర, పట్టణ, గ్రామీణ వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది. డేటా గోప్యతపై సరైన చట్టాలే లేవు. సైనిక, ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ గుర్తింపు, సిసి కెమెరాల నిఘా వంటివి వ్యక్తిగత స్వేచ్ఛలపై ప్రభావం చూపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో రైతుల, నిరుద్యోగుల, పెన్షన్ దారుల ఆందోళనలు, రాష్ట్రాల మధ్య విభేదాలు దేశ ఐక్యతకు, ఆత్మవిశ్వాసానికి సవాల్ గా మారుతున్నాయి. ప్రజా చైతన్యం పెరిగినా, ప్రభుత్వ స్పందన క్రమంగా తగ్గిపోతుండటం ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నిస్తోంది.
దేశం ఈ 79 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. అయితే ఆ ప్రయాణం అంతులేని ఆశలు, ఆశయాలతో నిండి ఉంది. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు, అందరికీ సమానంగా అందాలి. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలి. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించాలి.
79 ఏళ్ళ స్వాతంత్ర్యం-సాధించిన ప్రగతి, సవాళ్ళు!|EDITORIAL

