ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యంత కీలకం. ప్రజల తరఫున చట్టాలు రూపొందించే పవిత్ర స్థానం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సిసలైన వేదిక. కానీ, ఇటీవలి కాలంలో పార్లమెంట్ సమావేశాల్లో పస లేకుండా పోయింది. రాజకీయ పార్టీల ఎజెండాగా మారింది. పరస్పర దూషణల పర్వంగా జరుగుతోంది. అత్యంత నిరర్ధకంగా మారి, ప్రజాధనం ఫలితం లేకుండా వ్రుథాగా పోతోంది.
జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ‘ఆపరేషన్ సిందూర్’పై మాత్రమే చర్చ జరిగింది. ఈ అంశంపై ఓ స్పష్టత వస్తుందని ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఆశించారు. రెండు రోజుల సుదీర్ఘ చర్చ, ప్రధాని మోదీ సుదీర్ఘ ప్రసంగం తర్వాత కూడా జవాబులేని ప్రశ్నలు అనేకం మిగిలిపోలాయి. పహల్గామ్ సంఘటనలో భద్రతా వైఫల్యం, ఉగ్రవాదుల ఆచూకీ, నుంచి కేవలం 88 గంటల్లోనే యుద్ధ విరమణ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి.
బీహార్‌లో ఎస్‌ఐఆర్ పేరిట జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ గురించి విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే సమయంలో దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని ఒక్క రాయపుర అసెంబ్లీ నియోజకవర్గంలోనే లక్షకు పైగా బోగస్ ఓట్ల పోలింగ్ జరిగిందని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. దీనిపై చర్చించి ఏకాభిప్రాయంతో ఎన్నికల సంస్కరణలను తెచ్చి ఉంటే అధికార పార్టీకి గౌరవం దక్కేది. దేశానికి ప్రయోజనం కలిగేది. పర్మినెంట్ ఓటర్ల ముసాయిదా ఉండేలా చేయించుకునే అవకాశం ఉండేది.
పార్లమెంటు సమావేశాలు ఒకప్పుడు అర్థవంతమైన చర్చలు, వాదోపవాదాలతో ఎంతో ఆసక్తిగా ఉండేవి. సమస్యలపై చర్చకు ప్రభుత్వాలు కూడా అనుమతించేవి. చర్చలు హుందాగా జరిగేవి. ఈ రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు అనేక కారణాల వల్ల నిరర్థకంగా మారుతున్నాయి. సమావేశాలు జరుగుతున్న రోజుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. భారత రాజ్యాంగం ప్రకారం, పార్లమెంటు ఏడాదికి కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ ఈ రాజ్యాంగ అవసరం మొక్కుబడిగ మారింది. 1960లలో పార్లమెంట్ సమావేశాలు ఏడాదికి సగటున 120 రోజులపాటు సాగేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 60-70 రోజులకు మించడం లేదు.
సమావేశాలలో వాదనలు, చర్చల కంటే వాదోపవాదనలు, వివాదాలు, కేకలు, గుంపులుగా నినాదాలు, సభలోంచి వాకౌట్ చేయడం లాంటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు నామమాత్రంగాగా సభను అడ్డుకుంటున్నాయి. అధికార పక్షం కూడా చర్చలకు తావీయకుండా, తమ పనిని ఒడ్డెక్కించుకుంటున్నది. ఫలితంగా ప్రజల డబ్బులతో నడిచే ఈ సభలు ప్రజలకు ఉపయోగపడకుండా, కేవలం రాజకీయ స్టంట్‌గా మారిపోతున్నాయి.
వాయిదా తీర్మాణాలు అత్యంత ఆందోళనకరమైన అంశం. ఓ రోజుకి సగటున లక్షలాది రూపాయలు ఖర్చవుతున్నా, సభ వాయిదాలతో అవన్నీ వృథా అవుతున్నాయి. ఇలా పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుతో నిర్వీర్యంగా సభలు నడవడం చాలా విచారకరం. దేశానికి కీలకమైన బిల్లులు, చట్టాలు పార్లమెంటులో సరైన చర్చ లేకుండానే ఆమోదం పొందుతుండటం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతోంది. అంతేకాకుండా, మీడియా, సోషల్ మీడియా ప్రభావంతో నాయకులు సభల్లో మాట్లాడే విషయంలోనూ హంగులు చూపించడం ప్రారంభించారు. ప్రజల ఆకర్షణ పొందడానికి ఎమోషనల్ స్పీచ్‌లు, నినాదాలు, నిరసనలే ఎక్కువగా చేస్తున్నారు గానీ, శాస్త్రీయంగా విశ్లేషించి సమస్యలపై పరిష్కారాలు చర్చించేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇటీవలి కాలంలో అధికార పార్టీలు ప్రతిపక్షాల విమర్శలను సహించలేకపోతున్నాయి. అలాగే ప్రతిపక్షాలు కూడా సమస్యలపై సభా నిబంధనలు, సమాచారంతో కాకుండా కేవలం అడ్డంకులు సృష్టించే దిశగానే స్పందిస్తునాయి. ఒకవేళ ఎవరైనా అలా మాట్లాడే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకోవడం, మైకులు కట్ చేయడం, బుల్డోజింగ్ చేస్తున్నది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల దుర్వినియోగమే.
ఇలాంటి పరిస్థితుల్లో దీనికి పరిష్కారం ఏంటి? పార్లమెంటు సమావేశాల రోజులను నిర్ధారిత పరిమితిలో ఉండేలా నిబంధనలు పెట్టాలి. సభల నిర్వహణ ఖర్చుపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. సభల సమయంలో ప్రవర్తించే తీరు, నిబంధనల ఉల్లంఘనలకు ఖచ్చితమైన శిక్షలు విధించాలి. సభ్యులు తమ ప్రసంగాలను నిర్మాణాత్మకంగా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందించాలి. ముఖ్యంగా, స్పీకర్‌కు మరింత అధికారాలు ఇవ్వడం ద్వారా సభలో క్రమశిక్షణను పాటించేలా చర్యలు తీసుకోవాలి.
తద్వారా పార్లమెంటు నిజంగా ప్రజల సమస్యలపై చర్చించే వేదికగా మారుతుంది. ప్రభుత్వం తీసుకురాబోయే బిల్లులు సరైన విచారణకు లోనవుతాయి. ప్రతిపక్షాల వాణి ప్రభుత్వానికి వినిపించే అవకాశాలు కలుగుతాయి. ప్రజలు తమ ప్రతినిధుల పనితీరును సమీక్షించే అవకాశం పొందుతారు.
పార్లమెంట్ ఒక చట్టసభ మాత్రమే కాదు, అది ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అలాంటి పార్లమెంటు సమావేశాలు ఈ విధంగా నిరర్థకంగా మారిపోవడం సిగ్గుచేటు. ప్రజల ఆశలతో ఏర్పాటు చేసిన ఈ పవిత్ర వేదికను రాజకీయ నాయకులు తమ ప్రయోజనాలకే వాడుకుంటే, ప్రజలకే గాక, ప్రజాస్వామ్యానికి కూడా నష్టమే. కాబట్టి, పార్లమెంట్ సమావేశాల ప్రభావాన్ని పెంచేలా, వాటిని ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా మలుచుకోవాల్సిన అవసరం మనం గుర్తించాలి. లేదంటే ‘పార్లమెంట్’ అనేది కేవలం నిరర్ధక వేదికగా మిగిలిపోతుంది.
ప్రజాస్వామ్య భవితవ్యాన్ని పరిరక్షించాలంటే, పార్లమెంటు సమావేశాలు ప్రజా ప్రయోజనాలపైనే దృష్టి కేంద్రీకరించాలి. అదే సమకాలీన భారతావనికి అత్యవసరమైన మార్గం.

