ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. కోట్లాది ఓటర్లు, లక్షలాది పోలింగ్ కేంద్రాలు, వేలాది అభ్యర్థులు – ఎన్నికల ప్రక్రియ ఒక విశాలమైన మహోత్సవంలా జరుగుతుంది. అయితే, ఈ ఓటింగ్ ప్రక్రియ నిజంగా స్వచ్ఛంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగాలంటే ఎన్నికల వ్యవస్థలో పలు మార్పులు, సంస్కరణలు అనివార్యం. కాలక్రమేణా మన ఎన్నికల పద్ధతిలో కొన్ని లోపాలు, అవకతవకలు, బలహీనతలు పెరిగాయి. ఇవి ప్రజాస్వామ్యానికి హానికరమవుతూ, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే పరిస్థితిని ఏర్పరిచాయి. అందుకే, ఎన్నికల ప్రక్రియ మీద అనేక అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈవీఎంల పనితీరు మీదా, అధికార పార్టీల వ్యవహారం మీదా తరచూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేస్తున్న దొంగ ఓట్ల ఆరోపణలూ ఎన్నికల కమిషన్ మీద మాత్రమే కాదు మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద విశ్వాసాన్ని సైతం ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో ఎన్నికల సంస్కరణలు ఆవశ్యం. ఇదే సరైన సమయంగా ప్రజాస్వామికవాదులు భాస్తున్నారు.
మొదటగా, మన ఎన్నికలలో డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలు ప్రధాన సమస్యలుగా మారాయి. ఓటర్లను కొనుగోలు చేయడం, సమాజంలో విభేదాలతో విభజన సృష్టించడం, కుల-మతాల ఆధారంగా ఓట్లు వేయించడం వంటి అడ్డదారి పద్ధతులు ప్రజాస్వామ్య విలువలను బలహీనపరుస్తున్నాయి. దీనిని నివారించాలంటే, ఎన్నికల ఖర్చుపై కఠిన నియంత్రణ ఉండాలి. ప్రస్తుత ఎన్నికల ఖర్చు పరిమితులు కాగితంపై ఉన్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. ఖర్చును పర్యవేక్షించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పారదర్శక ఆడిట్ విధానం అమలు చేయాలి. ప్రతి అభ్యర్థి ఖర్చు వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి, ప్రభావానికి అడ్డుకట్ట వేయాలి. నిధుల ఖర్చును కట్టడి చేసే చట్టాలేవీ పని చేయడం లేదు. డబ్బుల పంపిణీని అడ్డుకునే చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. ఓటర్లు డబ్బు అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నామని పార్టీలు, నేతలు… పార్టీలు, నేతలు ఇస్తున్నారు కాబట్టే తీసుకుంటున్నామని ఓటర్లు. గుడ్డు ముందా, పిల్ల ముందా అన్నట్లుగా ఇదొక వితండవాదం. అయితే ఎక్కడో అక్కడ ముందుగా సంస్కరణ ప్రారంభం కావాలి.
నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల ఎన్నికల పోటీపై కఠిన నిబంధనలు అవసరం. ప్రస్తుతం తీవ్రమైన నేరాలపై అభియోగాలు ఉన్న వారూ సులభంగా పోటీ చేస్తున్నారు. కొందరు జైల్లోనే ఉంటూ పోటీ చేస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు పోటీ చేయడానికి అడ్డంకి ఉండకపోవడం వల్ల, రాజకీయాల్లో క్రిమినల్స్ ఎంట్రీ పెరిగింది. కనీసం, నేరాలపై కోర్టు చార్జ్ షీట్ దాఖలు అయిన వెంటనే, పోటీకి తాత్కాలిక నిషేధం విధించడం వంటి చట్ట సవరణలు అవసరం.
ఈవీఎంల వినియోగంపై ఉన్న సందేహాలను పారదర్శకంగా పరిష్కరించడం అవసరం. కొందరు ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుందని ఆరోపిస్తుండగా, మరికొందరు వీటిని పూర్తిగా నమ్మదగినవని, మరికొందరు నమ్మ కూడదని అంటున్నారు. ఇది ఓటర్లలో గందరగోళానికి దారి తీస్తోంది. తామెవరికి ఓటు వేశాం? తమని పాలిస్తున్నది తాము ఎన్నుకున్న వారేనా? ఇప్పటికే తమ ప్రమేయం లేకుండానే జరుగుతున్న పాలనను చూస్తున్న ప్రజలు, పాలకులను కూడా చూస్తున్నారా? అటువంటప్పుడు మనది ప్రజాస్వామిక వ్యవస్థేనా? ప్రజాస్వామ్యానికి విలువేది? ప్రజల్లో విశ్వాసం పెంచాలంటే, ప్రతి ఓటు వేసిన వెంటనే వీవీప్యాట్ ద్వారా ధృవీకరణ పత్రం అందించే విధానాన్ని బలోపేతం చేయాలి. అవసరమైతే, పోలింగ్ తర్వాత 100శాతం వీవీప్యాట్ లెక్కింపును నిర్వహించి, ఫలితాలను పోల్చాలి. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్ పద్ధతే కొనసాగుతోంది. మరి మన దేశానికి ఈ ఈవీఎంల పద్ధతి అవసరమా? అన్నది కూడా సమీక్షించాల్సిన తరుణం ఆసన్నమైంది.
ఎన్నికల సమయంలో పరిపాలనా యంత్రాంగంపై ఒత్తిడులు, రాజకీయ ప్రభావం తగ్గించాలి. ఎన్నికల కమిషన్‌కు సంపూర్ణ స్వతంత్రత, ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడం కీలకం. ఎన్నికల షెడ్యూల్, అమలు, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదు. ఎన్నికల నిర్వహణలో నిబద్ధతతో ఉన్న అధికారులను మాత్రమే నియమించాలి.
ఓటర్ల జాబితాల ఖచ్చితత్వం పెంచడం అవసరం. నకిలీ ఓటర్లు, ఒకే వ్యక్తికి ఒకటికి మించి ఓట్లు ఉండటం, మరణించినవారి పేర్లు జాబితాలో ఉండటం వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు, అడిషన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుత బీహార్ సమస్య ఇదే! మహారాష్ట్ర, కర్ణాటకలోనూ ఇదే జరిగిందని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆధార్ లింకింగ్, బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఓటర్ల జాబితా పాదర్శకంగా తీర్చిదిద్దాలి. ప్రతి ఎన్నికకు ముందు తక్షణం సవరణలు చేయడం, తర్వాత వదిలేయడం కాకుండా, నిరంతర పరిశీలన జరుగుతూ ఉండాలి.
రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి. నాయకత్వం, అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత లేకపోవడం వల్ల పార్టీలలో అవినీతి, వర్గపోరు పెరుగుతోంది. పార్టీ ఫండింగ్ పబ్లిక్‌గా వెల్లడించడం, దాతల వివరాలు అందించడం తప్పనిసరి చేయాలి. పార్టీల ఆస్తులకు, నిధులకు కూడా ఆడిటింగ్ ఐటీ వర్తింప చేయాలి.
ఓటర్ల అవగాహన పెంచడం అత్యవసరం. ఎన్నికలు కేవలం ఓట్లు వేయడం మాత్రమే కాకుండా, మంచి నాయకత్వాన్ని ఎంచుకునే బాధ్యత అని ప్రజలు గుర్తించాలి. మీడియా, పౌరసంఘాలు, విద్యాసంస్థలు ఎన్నికల అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ల ద్వారా యువతలో చైతన్యం కలిగించాలి.
ప్రస్తుత “ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్” విధానాన్ని సమీక్షించడం అవసరం. ఈ పద్ధతిలో తక్కువ శాతం ఓట్లు పొందినప్పటికీ అభ్యర్థి గెలవవచ్చు. ప్రత్యామ్నాయంగా, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ (దామాషా ప్రతినిధ్యం) లేదా ర్యాంక్డ్ ఓటింగ్ పద్ధతులను పరిగణలోకి తీసుకోవాలి. ఇది ప్రజా అభిప్రాయాన్ని సమగ్రంగా ప్రతిబింబిస్తుంది.
ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కచ్చితంగా అమలు చేయాలి. బూతు భాష, రెచ్చగొటే, ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు ప్రచారం, మత-కుల విభజనకు ప్రోత్సాహం ఇచ్చే వ్యాఖ్యలకు కఠిన శిక్షలు ఉండాలి. సోషల్ మీడియా దుర్వినియోగం, ఫేక్ న్యూస్ వ్యాప్తి వంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రత్యేక చట్టాలు అవసరం.
ఎన్నికల సంస్కరణలు కేవలం చట్టాల రూపంలో కాకుండా, రాజకీయ చైతన్యం, ప్రజల భాగస్వామ్యం ద్వారా సాధ్యం. పాలకులు నిష్పక్షపాత నిబద్ధతతో, ఓటర్లు అవగాహనతో ముందుకు వస్తేనే నిజమైన ప్రజాస్వామ్యం సాకారమవుతుంది. ఎన్నికలు కేవలం గెలుపు-ఓటమి కోసం కాకుండా, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్నాయనే భావన అందరిలో ఉండాలి.
అందువల్ల, ఎన్నికల సంస్కరణలు మన ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని అందించి, ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరుస్తాయి. పారదర్శకత, నిష్పక్షపాత, సమాన అవకాశాలు – ఇవే ప్రజాస్వామ్యానికి పునాది. వాటిని కాపాడటం మన అందరి బాధ్యత.

