‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.
మరి ట్రంప్ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
‘ పేనుకు పెత్తనమిస్తే తల అంతా కొరికిందట!’ ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సరిగ్గా సరిపోతుంది. ఆయనకు ఆ పదవి కట్టబెట్టినందుకు ఆ దేశ పౌరులే తలలు పట్టుకుంటున్నారు. ఇక ప్రపంచ దేశాలైతే, ట్రంపు టెంపరితనానికి ఠారెత్తిపోతున్నాయి. ఆయన చపల చిత్తం, నోటి దూల, అధికార దాహం, అహంకారం, అంధకారం, మథాంధకారం, శాడిజం, వక్రబుద్ధి, ఆత్మస్తుతి, పరనింద, కోపం అత్యాశ, అసూయ, ద్వేషం, మోసం, దగా, యుద్ధ కాంక్ష, శాంతి జపం వంటి మానవ అవలక్షణాలన్నీ కలిస్తే బహుషా ట్రంపు అవుతాడేమో?! ఎవరినైనా తిట్టాలంటే, ఇక ‘నువ్వు ట్రంపువా? మనిషివా?’ అనే నానుడి స్థిరపడిపోతుందేమో! ఈ పదవులు, అధికారం శాశ్వతం కాదు. చివరకు మనిషే శాశ్వతం కానీ ఈ లోకంలో.. ట్రెంపరితనపు పోకడలు మొత్తం భూగోళాన్నే గందరగోళం చేసి, నిజంగానే చికాకు పెడుతున్నాయి.
హద్దు పద్దు లేకుండా ప్రవర్తిస్తున్న ట్రంప్ తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఏ దేశం ఎవరితో స్నేహ హస్తం చాచాలో కూడా ట్రంపే చెబుతాడట! ఏ దేశం మరేదేశంతో వాణిజ్యం చేయాలో కూడా ట్రంపే నిర్దేశిస్తాడట. అదే అమెరికా దేశాన్ని ట్రంప్ లా ఎవరైనా ప్రశ్నిస్తే సహిస్తాడా? మరి పర దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నంచే హక్కు ట్రంప్ కు ఎక్కడిది. ఎవరిచ్చారు? ట్రంప్ ఆంక్షలను ఎవరైనా ఎందుకు అంగీకరించాలి? చర్చలు జరిపేది లేదంటున్న ట్రంప్‌తో మనం కూడా ఎందుకు చర్చలు జరపాలి? చర్చలు జరిపినా, జరపకపోయినా,140 కోట్ల జనాభా ఉన్న భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో ట్రంపకు అర్థం చేయాలి. మనపై వాణిజ్య ఆంక్షలు విధిస్తూ, పాక్‌ను దువ్వుతున్న తీరు అమెరికా ద్వంద్వ నీతిని తెలియ చేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలు ఒక్క భారత్‌కే కాదు యావత్ ప్రపంచ దేశాలకు పరీక్షగా మారాయి. ముందుగా చైనా అదే స్థాయిలో తిరిగి అమెరికాపై సుంకాలు విధించి అమెరికా దిమ్మ తిరిగేలా చేసింది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను తమపై విధించడంతో భారత్ కూడా చైనా తరహాలోనే దీటుగా స్పందించింది. తమ దేశంలోని రైతులు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేసింది. గురువారం నుంచే అమలులోకి వచ్చిన 25 శాతం సుంకాలతోపాటు, ఆగస్టు 27 నుంచి 50శాతానికి చేరే సుంకాలకు తోడుగా భారత్‌పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఆయన విధించిన సుంకాలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అమెరికాలోనూ కొన్ని వస్తువుల ధరలు పెరగనున్నాయి. పెంచిన సుంకాల వల్ల బిలియన్ల కొద్దీ డాలర్లు అమెరికాకు వస్తాయని ట్రంప్ నమ్మబలుకుతున్నారు.
అమెరికా అదనపు సుంకాల వల్ల ఇరు దేశాల మధ్య తలెత్తిన వివాదం తాత్కాలికమేనని, త్వరలోనే సమసిపోతుందని ప్రవాస భారతీయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. చర్చలు ఫలించి త్వరలో ఒప్పందం కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. 50 లక్షల మంది ప్రవాస భారతీయులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నారు. భారతీయ ఉత్పత్తులపై 50శాతం సుంకాలను వేయడాన్ని ఇండియన్-అమెరికన్ల నేత, బైడెన్ మాజీ సలహాదారు అజయ్ భుటోరియా ఖండించారు. ’అమెరికాలో తక్కువ ధరలకు లభించే 50శాతం జనరిక్ మందులను భారత్ సరఫరా చేస్తోంది. ఈ సుంకాలు వాటి ధరలను కూడా పెంచుతాయి. దీనివల్ల అమెరికాలోని కుటుంబాలు, సీనియర్ సిటిజన్లు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడతారు. మసాలా దినుసులు, పప్పులు, దుస్తుల ధరలు పెరుగుతాయని పేర్కొన్నారు. దుస్తులు, పాదరక్షల ధరలు 37శాతం దాకా పెరగవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇదే విషయాన్ని గుర్తుచేశారు. అయితే, ట్రంప్ విధించిన అదనపు సుంకాలపై ప్రధాని మోదీ గట్టిగానే సమాధానమిచ్చారు. ఎంత మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వారిని కాపాడటం కోసం సుంకాల భారాన్ని సొంతగా భరించడానికీ సిద్ధం అని ప్రధాని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, శ్వేత సౌధంలోని ఓవల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘భారత్‌పై మేం 50శాతం సుంకాలను విధించిన విషయం మీకు తెలుసు. ఆ దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉంది. తొలిస్థానంలోని చైనాకు అతి దగ్గరగా ఉంది. అందుకే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలను చూడబోతున్నార’ని పేర్కొన్నారు. ట్రంప్ తీరు తన అధికారాన్ని పిచ్చోడి చేతిలో రాయిలా వాడుకుంటున్నట్లుగా ఉంది. ఎలాన్ మస్క్ లాంటి మిత్రుడినే దూరం పెట్టిన ట్రంప్‌కు భారత్ ప్రయోజనాలు అంత ముఖ్యం కాదు. లెక్కలోకీ రావు.
ఆపరేషన్ సింధూర్ భారత్ సైనిక పాఠవాన్ని ప్రపంచానికి చాటింది. అలాగే అమెరికా ప్రపంచ దేశాలను బెదిరించి ఎక్కువ ధరలకు అమ్ముతున్న పాక్ ఆయుధాలు తుస్ మనడమూ అన్ని దేశాలూ చూశాయి. అందుకే పాక్ ను బెదిరించి మరీ, భారత్ కాళ్ళ బేరానికి పంపాడు. భారత్ భద్రతా వలయాన్ని చూసి ట్రంప్ తట్టుకోలేక పోతున్నాడు. సైనిక పరంగా మనల్ని ఎదుర్కోలేక సుంకాలతో కొడుతున్నాడు.
అయోధ్య, కాశ్మీర్, ట్రిపుల్ తలాక్ విషాయల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మోదీ, ఆపరేషన్ సిందూర్ తో పాక్ పీచమణిచారు. గట్టిగా బుద్ది చెప్పాం. ప్రపంచం ముంగిట పాక్ ని దోషిగా నిలబెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా భారత్ చర్యలకు గట్టి మద్దతు లభించింది. మరి ట్రంప్ విషయంలో మోదీ తీసుకునే నిర్ణయం ఏంటి? అమెరికాకు, ట్రంప్ టెంపరితనానికి తగిన గుణపాఠం చెబుతారా? ప్రపంచ మద్దతు కూడ గట్టి బుద్ధి చెప్పగలరా? నెత్తి కొరికిన పేనుని చివరకు ఏం చేస్తాం? యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మోదీజీ వినబడుతోందా!?

