‘రాతి హృదయంలో ఇమడని కన్నీటి పువ్వులా జాతి గుండెల్లో రగిలే శోక దీపంలా ఎవరమ్మా నువ్వు?’ అని ప్రశ్నించాడు అలిశెట్టి ప్రభాకర్. ఆయన కవితా వాక్యాలు నేటికీ అక్షర సత్యాలై ఆవిష్కరింప పడుతుండటం విచాకరం. విషాదకరం. కన్నడనాట వెలుగు చూస్తున్న అత్యాచార కాండ యావత్ దేశాన్ని నివ్వెపరుస్తున్నది. జాతి నిర్ఘాంతపోతున్నది.
కర్ణాటకలోని ధర్మస్థలి, ప్రజ్వల్ రేవణ్ణ ఈ రెండు పేర్లకు ఇప్పుడు పరిచయం అక్కరలేదు. దేశానికి బాగా తెలిసిపోయన ఈ రెండు పేర్లు జనం నోళ్ళల్లో నానుతున్నాయి. ఆడవాళ్ళపై అత్యాచారాలకు, హత్యాచారాలకు సాక్షిగా ధర్మస్థలి నిలిస్తే, వాటిలో ప్రయేయం ఉన్న దోషిగా ప్రజ్వల్ రేవణ్ణ నిలిచాడు. ధ్మస్థలిలో అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపేస్తున్నారని, అదృశ్యం అయిన కేసుల్లో ఇప్పటికీ ఆచూకీ దక్కలేదని, సంబంధిత పోలీసు స్టేషన్ లో రికార్డులే గల్లతయ్యాయని గుర్తించారు. ఒకరిద్దరు ఫిర్యాదు చేసినా, వాటిపై చర్యలు తీసుకోలేదు. ధర్మస్థలి వ్యవహారంలో పెద్ద తలకాయల మాఫియా ఉందని అంటున్నారు. అందుకే అసలు నిజాలు బయటకు రావడం లేదని తెలుస్తోంది. అయితే ఈ అ(హ)త్యాచార కుంభస్థలం ఎప్పుడో ఒకప్పుడు బద్దలు కాక తప్పదు. మాజీ సానిటేషన్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో డొంక కదులుతోంది.
ప్రజ్వల్ రేవణ్ణ సాగించిన అత్యాచారకాండ అంతాఇంతా కాదు. ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక దాడి కేసులు నమోదైనప్పుడు కనీస మాత్రంగా కూడా నేతలు స్పందించలేదు. ప్రజల్వల్ తీర్పును స్వాగతించలేదు. న్యాయస్థానం శిక్ష విధించాక కూడా ఎవరూ స్పందించలేదు. మరిన్ని కేసులు విచారణలో ఉన్నాయి. రాజకీయ పలుకుబడి, డబ్బు ఉన్న ప్రజ్వల్ పైకోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.
ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారం జరిపిన కేసులో అభియోగాలు రుజువు కావడంతో ప్రజ్వల్‌కు బెంగళూరు ప్రజాప్రతినిధుల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. రూ.11.35 లక్షలు జరిమానా విధించి, దానిలో రూ.11 లక్షలు బాధితురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మహిళలను కట్టుబానిసలుగా, సెక్స్ వర్కర్లుగా చూస్తున్న ప్రస్తుత సమయంలో న్యాయస్థానం వెలువరించిన ఈ తీర్పు మహిళలకు ఆశాకిరణం. ఆత్మవిశ్వాసం పెంచేదే.
ప్రజ్వల్‌పై మూడు లైంగిక దాడి కేసులు, ఒక లైంగిక వేధింపుల కేసు నమోదుకాగా ఒక్క మొదటి కేసులోనే శిక్ష పడింది. మైసూర్ ఆర్‌కె నగర్‌కు చెందిన ఒక మహిళ తనపై ఫాంహౌస్‌లో ప్రజ్వల్ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంతో తొలికేసు నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రెండవసారి హసన్ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్ ఎంపీగా పోటీ చేశారు. పోలింగ్ ముగిశాక కేసు నమోదు కావడంతో జర్మనీకి పారిపోయాడు. ప్రత్యేక దర్యాప్తు బృందం అతన్ని స్వదేశానికి రప్పించి గతేడాది మే 31న అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా ప్రజ్వల్ జైలు ఊచలు లెక్కిస్తున్నాడు. అయితే, కేసు దర్యాప్తు సమయంలో సిట్ కనుగొన్న విషయాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. ప్రజ్వల్ రేవణ్ణ ప్రజాప్రతినిధిగా సమస్యలపై తన దగ్గరకొచ్చే మహిళలపై లైంగికదాడికి ఒడిగట్టాడు. బెదిరించి, బలవంతంగా, లోబరుచుకుని లైంగిక దాడులకు బరితెగించాడు. అత్యాచారం చేసిన ప్రతిసారీ తన ఐ-ఫోన్‌లో ఆ దృశ్యాలను తానే రికార్డు చేసుకున్నాడు. అటువంటి రెండు వేలకు పైచిలుకు వీడియోలను దర్యాప్తు సందర్భంగా ప్రజ్వల్ ఫోన్‌లో కనుగొన్నారు. అవి మార్ఫింగ్ వీడియోలుగా, రాజకీయ కుట్రగా ప్రజ్వల్ బుకాయించి, తప్పించుకోచూశాడు. కానీ, ఆ వీడియోలను విదేశాలకు పంపించి, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫోరెన్సిక్ పరీక్షలు చేయించి నిజమైనవేనని నిర్ధారించారు. కేవలం 14 నెలల్లోనే కేసు ఛేదించడం వెనుక దర్యాప్తు అధికారుల కృషి, కోర్టులో వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ కనబరిచిన చాకచక్యం అభినందించాల్సిందే.
అన్నింటికీ మించి న్యాయం కోసం, దోషికి శిక్ష పడాలని బాధితురాలు కనబర్చిన పట్టుదల మహిళాలోకానికి స్ఫూర్తినిస్తుంది. ప్రజ్వల్ రేవణ్ణ సాదాసీదా యువకుడు కాదు. కర్ణాటక రాజకీయాలను శాసిస్తున్న కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ. ఆయన తాత దేవెగౌడ మాజీ ప్రధాని, పినతండ్రి కుమార స్వామి కేంద్ర మంత్రి, తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్‌ఎ హెచ్‌డి రేవణ్ణ, తల్లి భవానీ గతంలో కార్పొరేటర్, సోదరుడు సూరజ్ ఎంఎల్‌ఎ. ఇంతమంది రాజకీయ కుటుంబంలో ఉన్న ప్రజల్వల్ తనకు తిరుగులేదని భావించాడు. అత్యాచార బాధితురాలిని అపహరించిన ప్రజ్వల్ తల్లి భవానీపైనా కేసు నమోదైంది. ప్రజ్వల్ తండ్రి హెచ్‌డి రేవణ్ణపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదయ్యాయంటే బాధితులను ప్రజ్వల్ కుటుంబం తమ రాజకీయ పలుకుబడితో ఏ స్థాయిలో భయబ్రాంతులకు గురి చేసిందో తెలుస్తుంది. పాపం పండింది. ప్రజ్వల్ ఎంతగా మొత్తుకున్నా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. అత్యాచారాలు చేసి పైశాచికానందం పొంది, వాటిని సెల్ ఫోన్లలో వీడియోలు తీసి మురిసి పోయిన ప్రజ్వల్ లాంటి వాళ్ళకి ఏ శిక్ష విధించినా తక్కువే.
అలాగే ధర్మస్థలిపైనా నిజాయితీగా విచారణ జరగాలి. అప్పుడే ప్రజల్లో భరోసా వస్తుంది. కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవడానికి ఇదో మంచి అవకాశం. ప్రతిపక్ష నేత రాహుల్ ఈ విషయంలో తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ధర్మస్థలి విషయంలోనూ నిగ్గు తేలేలా చేస్తే మంచిది. లేదంటే అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్లుగానే ‘నాగరిక ప్రపంచం అంటూ అనాగరికంగా స్త్రీల పట్ల ప్రవర్తిస్తున్న లోకంలో సోయితో మహిళలు కత్తులా మెరవాలి.

