వారం రోజులుగా పార్లమెంటులో అదే తంతు. చర్చ లేకుండానే రచ్చ రచ్చై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. సమస్యలపై చర్చించాలన్న ఆసక్తి అటు అధికార పార్టీకి, ఇటు ప్రతిపక్ష పార్టీలకు లేకుండా పోయింది. సభ ప్రారంభం కాగానే చర్చకు పట్టుబట్టి గొడవ చేయడం విపక్షాల వంతైతే, చర్చకు అవకాశమే లేకుండా చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారింది. వాయిదా వేయడం స్పీకర్ విధిగా మారింది. సోమవారం కూడా ఇదే తరహాలో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు జవాబుదారులమన్న సంగతిని మరిచిన సభ్యులు, పార్లమెంటును అధికార ప్రతిపక్షాల పట్టువిడుపులు లేని యుద్ధ వేదికగా చూస్తున్నట్లుగా ఉంది. పార్లమెంటులో అధికార, విపక్షాలు కాదు ప్రజలను గెలిపించాలి. ప్రజల మనసులు గెలిచే విధంగా ప్రవర్తించాలి. సమస్యలను చర్చించి పరిష్కరించాలి. ప్రజా సమస్యలను చర్చించి, పరిష్కరించే పవిత్ర వేదిక పార్లమెంటు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ పార్లమెంటు. కానీ ప్రతిష్టంభనల వేదికగా మారుతోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్కటంటే ఒక్క సమస్యపై కూడా చర్చ జరగని దుస్థితి నెలకొంది.
ఈ నెల 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమ య్యాయి. ఎలాంటి అంశమైనా సరే, చర్చించడానికి సిద్దమని అధికార పక్షం చెబుతున్నా, విపక్షాలకు మాత్రం ఆ అవకాశమే ఇవ్వడం లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పార్లమెంట్ సమావేశాలు అధికారంలో ఉన్న ఒకరిద్దరు నేతల కనుసన్నల్లో సాగుతున్నాయి. ఇదేదో అధికార, విపక్షాల సమస్యగా చూస్తున్నారు. 140 కోట్ల భారత ప్రజలంతా ఆందోళనలతో ఉన్నా పట్టించుకోవం లేదు. వరదలతో దేశం అతలాకుతలం అవుతోంది. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మేడిపండు చందంగా మారింది. భారత ప్రజాస్వామిక రాజకీయాల్లో వ్యక్తి స్వామ్యం, నిరంకుశత్వం రోజురోజుకు ప్రబలిపోతోంది. పార్లమెంట్, అసెంబ్లీల్లో ప్రజల సమస్యల పై చర్చ జరగడం లేదు. అధికార విపక్షాలు ఇదేదో తమ సొంత జాగీరుగా భావించి.. సమావేశాలను నడుపుకుంటున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఇదే తంతు సాగుతోంది. బీజేపీ అధికారం చేపట్టిన తరవాత ఈ వ్యవహారం బాగా ముదిరింది. సమస్య ఏదైనా పార్లమెంటులో చర్చకు రావడం లేదు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ఇదే పద్ధతి సాగుతోంది.
అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎజెండాతో పనిచేయడం వల్లనే ఇలా జరుగుతోంది. పార్లమెంటు ప్రజలు ఎజెండాగా పని చేయాల్సిన వేదిక. అయితే అది రాజకీయ పార్టీల జెండాల ఎజెండాగా మారిపోతోంది. దేశంలో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ పెంపు, వరదలు, నిరుద్యోగం లాంటి అంశాలపై చర్చించి జవాబివ్వాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రవేశ పెడుతున్న వాయిదా తీర్మానాలను సభాపతులు బుట్టదాఖలు చేస్తున్నారు. కనీసం సభా వ్యవహారాల కమిటీ సమావేశాల్లో కూడా కీలక అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం మనస్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించడం ఆనవాయితీగా మారింది. తొలి రోజు నుంచీ ప్రధాని మోడీ కూడా సభ సజావుగా సాగాలని, ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఉందని అంటున్నారు. అయితే పార్లమెంట్ సమావేశమైన తర్వాత అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం కనపడడం లేదు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎక్కడుందన్న అనుమానం కలుగుతుంది.
నిజానికి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పుకునే వీలున్న అద్భుతమైన ప్రచార, ప్రసార వేదిక పార్లమెంటు. అదే పార్లమెంటు వేదికగా ప్రజల సమస్యలను లేవనెత్తి, వాటికి సమాధానాలు రాబట్టి, పరిపాలనను సరైన గాడిలో పెట్టేందుకు ప్రతిపక్షాలకు అరుదైన వేదిక కూడా. ప్రజల తరపున ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపి, ప్రజాకోర్టులో నిలిపే వేదిక. కానీ భారత ప్రజాస్వామ్యంలో అధికారు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటును తమ సొంత అభిప్రాయాలకు వేదికగా మలచుకుంటున్నారు. సభా నిబంధనలను తమకనుగుణంగా, అనుకూలంగా వాడుకుంటున్నారు. నిజానికి చట్టసభల్లో ప్రజా సమస్యలను చర్చించేందుకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలి. వారు సమస్యలను ప్రస్తావిస్తే చర్చించాలి. చర్చల ద్వారా ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే చట్టసభలకు విలువ ఉంటుంది. గతంలో ఎప్పుడూ చర్చలకు ప్రాధాన్యం ఉండేది. సమస్యలపై తక్షణ చర్చలు చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చట్టసభల గౌరవం ఇనుమడించేలా అధికార విపక్షాలు పని చేయాలి. చట్టసభలను పాలకులే ఎక్కువగా గౌరవించాలి. ప్రజల సమస్యలపై చర్చించడం అలవాటు చేసుకోవాలి. పార్లమెంట్‌ను నడిపించేందుకు రాజనీతిజ్ఞత అవసరం. మనం ఉన్నదే ప్రజల కోసం అన్న కోణంలో అధికార పక్షం ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి. ఇలా నిరంకుశంగా వెళితే ఎంతటి వారికైనా ప్రజలు శిక్ష వేయక మానరు. మళ్లీ మాదే అధికారం అన్న అహంకార ధోరణి పనికిరాదు. పదేళ్లపాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ అదే రీతిలో ప్రవర్తించి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. బీజేపీ కూడా ఇదే ధోరణితో సాగితే ప్రజలు కాంగ్రెస్ కు పట్టిన గతినే పట్టిస్తారని గుర్తించాలి. అధికార ప్రతిపక్షాలు బాధ్యతతో వ్యవహరించాలి.

