పట్టు విడుపులు లేని అధికార, ప్రతిపక్ష పార్టీల పంతాల మధ్య ప్రజా సమస్యలు గాలికిపోతున్నాయి. అసలు ఆయా సమస్యలు చర్చకు రాకుండా పోవడమే కాకుండా, విలువైన సభా సమయం, ప్రజాధనం వృథా అవుతున్నాయి. దీంతో మన సమస్యలను చర్చించండి, పరిష్కారాలు కనుక్కోండని దేశ అత్యుతన్నత సభలకు పంపిస్తే, ఆ సభల్లో మన ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరు జుగప్సాకరంగా మారుతున్నది. ప్రజాసమస్యల పరిష్కారానికి అత్యుత్తమ వేదిక పార్లమెంటు. దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాలపై చర్చకు విపక్షం పట్టుపడుతుంటే, ఆ చర్చకు తావులేకుండా అధికార పార్టీ పావులు కదుపుతోంది. అయితే, ఆ సమస్యలపై ఎలా చర్చించాలన్న వ్యూహం ప్రతిపక్షం దగ్గర కనబడడం లేదు. వాయిదా తీర్మానాలు ఇస్తే చర్చ జరగాల్సిందే అన్న ధోరణిలో విపక్షాలు ఉన్నాయి. వాటిని తిరస్కరిస్తూ, చర్చ జరగకుండా అధికార పక్షం జాగ్రత్త పడుతోంది.
గత ఐదురోజులుగా పార్లమెంట్ ఎలాంటి కార్యలాపాలు లేకుండా సాగుతోంది. అనేక అంశాలు చర్చించాల్సి ఉంది. ప్రతిపక్షాలు చర్చకు పట్టుపడుతున్న బీహార్ ఓటర్ల జాబితాయే గాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. వాటిని ఎలా చర్చించాలన్న ప్రణాళిక ప్రతిపక్షం దగ్గర కనిపించడం లేదు. అలా చేయడంలో విపక్ష పార్టీలు విఫలం అవుతున్నాయి. కేవలం వాయిదా తీర్మానాలు ఇవ్వడం, సభను అడ్డుకోవడం, బయటకు వచ్చి మీడియాతో మాట్లాటం వరకే పరిమితం అవుతున్నారు.
నిజానికి బీసీలకు రిజర్వేషన్లు, జాతీయ జలవిధానం, నదుల అనుసంధానం, రైతుల సమస్యలు, దేశ భద్రత, ఆపరేషన్ సింధూర్, పదేపదే భారత – పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటున్న ట్రంపు మాటలు, అధిక ధరలు, వేధిస్తున్న పన్నులు, పేరుకుపోతున్న నిరుద్యోగిత, ఉపాధి…ఇలా లెక్కకు మించిన సమస్యలు చర్చించడానికి సమయం కావాలి. ఈ ప్రజా సమస్యలను పట్టించుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఏటా రుణ మాఫీలు అవసరం లేని విధంగా రైతులు స్వయం సమృద్ధిగా ఎదిగేలా చేయాలి. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వంటివన్నీ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. రైతుల సమస్యలు రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రాలుగా మాత్రమే మిగిలిపోయాయి. పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా రైతుల సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో సిద్ధంగా లేవు. దిగుబడులు అడుగంటి, గిట్టుబాటు ధరలు లేక రైతులు భిక్కచస్తున్నా, మొసలి కన్నీరు కార్చడమే తప్ప రాజకీయ పార్టీలు చేస్తున్నదేమీ లేదు. పైగా సమస్యలు అలా ఉంటేనే తమకు మనుగడ అన్నట్లుగా పార్టీల వ్యవహారం ఉంటున్నది.
కాలం కాక, అధిక కాలంతో దిక్కుతోచని పరిస్థితి రైతులది. ప్రస్తుతం భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నేటికీ వరదలను నివారించి, నీటిని నిల్వ చేసుకునే పద్దతలను అవలంబించలేని దుస్థితిలో దేశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో మళ్లీ నీళ్ళు సముద్రం పాలవుతున్నాయి. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో నీటి యాజమాన్యం సరిగా లేదని ఏటా కురుస్తున్న వర్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీనికితోడు అనేక జలాశయాల్లో పూడిక పేరుకుని పోతోంది. ఏటేటా వర్షాలతో ఒండ్రు చేరుతోందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాదిలో అనేక నదులు ఉప్పొంగాయి. చివరకు మళ్లీ నీరు సముద్రానికి చేరింది. ఇప్పటికైనా పాలకులు జాతీయ జలవిధానం రూపొందించాల్సి ఉంది. అయితే, పార్లమెంటులో ఇలాంటి సమస్యలు చర్చకు రావడం లేదు. ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలే పార్టీలకు ముఖ్యమైపోయాయి. అలాగే వ్యవసాయం పై కూడా జాతీయ విధానంతో ముందుకు సాగాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేసేలా, మన రైతులను ప్రోత్సహిచేలా చూసుకోవాలి. వివిధ రాష్టాల్ల్రో చెరువులను మింగిన పాపానికి ఇటీవల కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీట మునిగాయి. ఇదంతా పాలకుల పాపమే!
ఈ క్రమంలో తెలంగాణలాంటి రాష్ట్రాల్లో గొలుసుకట్టు చెరువులను రక్షించు కోవాలి. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని కనీసం ఇప్పటి నుంచైనా నీటి అవసరాలను గుర్తించి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. నిరుద్యోగం పెరిగడంతో ప్రజలు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. వారిని వ్యవసాయం వైపు మళ్లించేలా పథకాలు చేపట్టాలి. తక్షణ ఉపాధికి ఇదొక్కటే ప్రత్యామ్నాయం కాగలదు. అందుకు తగ్గట్లుగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దాలి. దీంతో ఆహార ఉత్పత్తులు కూడా పెరగ గలవు. ఇవేవీ లేక కరువులు వచ్చినా, అధికంగా వర్షాలు కురిసినా రైతుల దుర్భర పరిస్థితులలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. మరోవైపు ప్రతి సంవత్సరం వేలాది మంది రైతులు పట్టణాలకు వలస వెళ్ళి దినసరి కూలీలుగా మారుతున్నారు.
గత కొంత కాలంగా పార్లమెంటులో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చ జరగడం లేదు. ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థకే కాదు, దేశానికి, దేశ ప్రజలకు కూడా మంచిది కాదు. చర్చ ఎవరు చేసినా, ఆ చర్చల్లో ఎవరు గెలిచినా, ఓడినా, ఇక్కడ గెలుపోటములు ముఖ్యం కాదు. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులంతా ప్రజల్ని గెలిపించాలి. అంటే చట్టసభల్లో ఆరోగ్యకరమైన వాతావరణంలో అర్థవంతమైన చర్చలు అన్ని అంశాల మీద జరగాలి. దేశ, ప్రజల సౌభాగ్యానికి అవసరమైన చట్టాలు, పథకాలు, విధానాలను రూపొందించి అమలు చేయాలి. ఇందుకు ప్రజాస్వామ్యంలో ప్రజాసమస్యలు చర్చించడానికి సరైన వేదిక పార్లమెంటు. పార్లమెంటులో చర్చించే అంశాలు ఆయా సమస్యలకు పరిష్కారం చూపే దిశగా సాగాలి. ఇప్పటికైనా అధికార ప్రతిపక్ష పార్టీలు దేశ ప్రజల ప్రయోజనాలు, దేశంలో ప్రజలందరి ప్రగతి దిశగా అవసరమైన చర్చలు జరపడానికి సిద్ధపడాలి.

