కేసీఆర్ కుటుంబం అవినీతితో అంటకాగిందా? అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అందినకాడికల్లా దోచుకున్నారా? గొర్రెలు, బర్రెల పంపిణీ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ దందా, విద్యుత్ కొనుగోల్ మాల్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కార్ రేస్, హెచ్ సీఏ…ఇలా వెలుగు చూస్తున్న ప్రతి కుంభకోణంలోనూ అధికారులు వేల కోట్ల ఆస్తులతో అడ్డంగా బుక్ అవుతున్నారు. ఏసీబీ వెతికిన కొద్దీ అవినీతి కుంభకోణాలు, వాటికి కారణమైన తిమింగలాలు వెలికి ఉబికి వస్తున్నాయి. మరి ఆ అవినీతి బాగోతాల్లో కేసీఆర్ కుటుంబం పేర్లే ఎందకు బయటకు వస్తున్నాయి? ఆ కుటుంబాన్ని కావాలనే బయటకు లాగుతున్నారా? కాంగ్రెస్ పని గట్టుకుని ఇదంతా చేస్తోందా? లేక సీఎం రేవంత్ రెడ్డి కక్షగట్టి కావాలనే వాళ్ళని ఇరికిస్తున్నారా? అవన్నీ నిజమేనన్నట్లుగా ఆయా కుంభకోణాల్లో భాగం పంచుకున్న అధికారులు అక్రమ సంపాదన సాక్ష్యాలతో సహా నోట్ల కట్టలు, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఎకరాల కొద్దీ భూములతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. ఏసీబీ, సిట్ చేపట్టిన విచారణల్లో అవినీతి జరిగిందన్నది నిజమేనని తేలిపోతోంది. అవినీతి జరిగింది నిజమైనప్పుడు, అధికారులు పట్టబడుతున్నప్పుడు, ఇక తేలాల్సినవి పెద్ద తలకాయలే! అధికారులు తమంత తాముగా అవినీతికి పాల్పడటం వేరు. వారిని అందుకు పురికొల్పడం వేరు. ఆ పురికొల్పినది ఎవరు? అంటే అందరి వేళ్ళూ అప్పటి ప్రభుత్వం వైపే చూపుతున్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఏలిన వారినే ఎత్తిపడుతున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ కాలంలో కేసీఆర్ కుటుంబమే అంతా తామై అధికారాన్ని చెలాయించింది. మరైతే నిజంగానే కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందా? అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలన్నీ కూడా ప్రాథమిక స్థాయిలోనో లేక విచారణ స్థాయిలోనే ఉన్నాయి. విచారణ పూర్తై, నిజానిజాలు నిగ్గుతేలి, అవినీతి రుజువైతే తప్ప వారిని నేరస్తులుగా, అవినీతి పరులుగా భావించలేం. అప్పటి వరకు వారు ముద్దాయిలే! అనుమానితులే!!
కానీ, కేటీసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నదని పదే పదే అరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వాటిని నిరూపిస్తారా? లేక తాము అవినీతి పరులం కానే కాదని కేసీఆర్ కుటుంబం నిలబడుతుందా? రాజకీయ కేసుల నిలువవనే నానుడే మరోసారి రజువవుతుందా? చూద్దాం. కాలం సమాధానం చెప్పకపోతుందా?
అవినీతి రుజువయ్యేనా? శిక్షలు పడేనా!?
కేసీఆర్ కుటుంబం అవినీతితో అంటకాగిందా? అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అందినకాడికల్లా దోచుకున్నారా? గొర్రెలు, బర్రెల పంపిణీ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ దందా, విద్యుత్ కొనుగోల్ మాల్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ కార్ రేస్, హెచ్ సీఏ…ఇలా వెలుగు చూస్తున్న ప్రతి కుంభకోణంలోనూ అధికారులు వేల కోట్ల ఆస్తులతో అడ్డంగా బుక్ అవుతున్నారు. ఏసీబీ వెతికిన కొద్దీ అవినీతి కుంభకోణాలు, వాటికి కారణమైన తిమింగలాలు వెలికి ఉబికి వస్తున్నాయి. మరి ఆ అవినీతి బాగోతాల్లో కేసీఆర్ కుటుంబం పేర్లే ఎందకు బయటకు వస్తున్నాయి? ఆ కుటుంబాన్ని కావాలనే బయటకు లాగుతున్నారా? కాంగ్రెస్ పని గట్టుకుని ఇదంతా చేస్తోందా? లేక సీఎం రేవంత్ రెడ్డి కక్షగట్టి కావాలనే వాళ్ళని ఇరికిస్తున్నారా? అవన్నీ నిజమేనన్నట్లుగా ఆయా కుంభకోణాల్లో భాగం పంచుకున్న అధికారులు అక్రమ సంపాదన సాక్ష్యాలతో సహా నోట్ల కట్టలు, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఎకరాల కొద్దీ భూములతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతున్నారు. ఏసీబీ, సిట్ చేపట్టిన విచారణల్లో అవినీతి జరిగిందన్నది నిజమేనని తేలిపోతోంది. అవినీతి జరిగింది నిజమైనప్పుడు, అధికారులు పట్టబడుతున్నప్పుడు, ఇక తేలాల్సినవి పెద్ద తలకాయలే! అధికారులు తమంత తాముగా అవినీతికి పాల్పడటం వేరు. వారిని అందుకు పురికొల్పడం వేరు. ఆ పురికొల్పినది ఎవరు? అంటే అందరి వేళ్ళూ అప్పటి ప్రభుత్వం వైపే చూపుతున్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఏలిన వారినే ఎత్తిపడుతున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళ కాలంలో కేసీఆర్ కుటుంబమే అంతా తామై అధికారాన్ని చెలాయించింది. మరైతే నిజంగానే కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడిందా? అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలన్నీ కూడా ప్రాథమిక స్థాయిలోనో లేక విచారణ స్థాయిలోనే ఉన్నాయి. విచారణ పూర్తై, నిజానిజాలు నిగ్గుతేలి, అవినీతి రుజువైతే తప్ప వారిని నేరస్తులుగా, అవినీతి పరులుగా భావించలేం. అప్పటి వరకు వారు ముద్దాయిలే. అనుమానితులే.
దొంగతనం.. మరొకటి ఎంత దాచినా దాగవని అంటూంటారు. అలాంటిది దోపిడీ ఏ రూపంలో జరిగినా ఏదోనాడు బయటపడక మానదు. ఇప్పుడదే జరుగుతోందా? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కేసీఆర్, హరీశ్ రావులపై విచారణ జరుగుతోంది. ఈ కార్ రేస్ అవినీతిలో కేటీఆర్ పై విచారణ జరుగుతోంది. విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో కేసీఆర్, అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి మీద విచారణ జరుగుతున్నాయి.’ అన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కాంలో జైలుకు కూడా వెళ్ళి వచ్చిన కవితతోపాటు కేటీఆర్ మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అక్రమాల ఆరోపణలు చేసింది. కవితతోపాటు కేటీఆర్, ఆయన బావమరదిపైనా ఏసీబీకి, ఈడీకి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) రూ.600 కోట్ల బీసీసీఐ ఇచ్చిన నిధులతోపాటు, ఇతరత్రా వేలాది కోట్ల కుంభకోణం జరిగిందని ఫిర్యాదు చేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలోనే ఉంది. అనేక మంది అధికారులు బుక్కైయ్యారు. కొందరు జైలులో ఉన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు విలువే లక్ష కోట్ల పై మాటే! విద్యుత్ కొనుగోళ్ళు లక్షల కోట్లల్లోనే ఉంటాయి. మిగతా అవినీతి ఆరోపణల్లో చేతులు మారిన డబ్బులు లక్షల కోట్లే. ఇంకా భూములు ఇతరత్రా కలిస్తే లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది నిజమని భావించే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కొన్ని పిల్లర్లు కుంగిపోవడం, మేడిగడ్డ వద్ద బీటలు వారడం లాంటి వాటిపై, ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ను వేసింది. విచారణ పూర్తై, జూలై 31లోగా నివేదికను ఇవ్వనుంది. ఈలోగా ఇదే ప్రాజెక్టులో పని చేసిన అప్పటి ఇఎన్సీలు, సీఈల ఇళ్ళపై ఏసీబీ జరిపిన దాడుల్లో వేల కోట్ల అవినీతి సొమ్ము వెలుగు చూస్తున్నది. గొర్రెలు, బర్రెల పంపిణీ కుంభకోణంలో అప్పటి పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని దగ్గర పని చేసిన కీలక అధికారి అరెస్టయ్యారు. ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా పనిచేసిన పోలీసు అధికారులు అంతా జైలులోనే ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో బాధితులైన వివిధ పార్టీల రాజకీయ నాయకులు సిట్ కు తమ వాంగ్మూలాలను ఇస్తూనే ఉన్నారు. వేలాదిగా బాధితులు సిట్ ఆఫీసుకు క్యూ కట్టారు. తమ గోడును విన్నివించుకుంటున్నారు. భార్యాభర్తల ఫోన్లను కూడా దొంగచాటుగా విని, వారి సంసారాలను నాశనం చేశారని ఆరోపణలున్నాయి. వేలాది మంది ఫోన్ల ట్యాపింగ్ లోనూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుల పేర్లు వినిపించాయి. కేసీఆర్ ఒక సందర్భంలో ‘ఫోన్లు ట్యాపింగ్ తో మాకేం పని? అదంతా పోలీసు అధికారులు చూసుకుంటారు. సీఎంకు ఇంటలీజెన్స్ రిపోర్టు వస్తుంది. అది ఎలా తెస్తారన్నది పోలీసుల పని.’ అంటూ ట్యాపింగ్ జరగడం సహజమే కానీ, తమకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే, రోటీన్ గా జరిగే ఈ చర్యలకు భిన్నంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నదే కదా! అసలు సమస్య. దాన్ని పాక్షికంగానైనా కేసీఆర్ ఒప్పుకున్నట్లేనా? అన్నది చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ దందాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. నేరుగా ఆయన కేటీఆర్ నే టార్గెట్ చేశారు. ’డ్రగ్స్ టెస్టుకు రమ్మంటే కేటీఆర్ పారిపోయి, కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడని, పిరికి పంద’ అని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ ఫాం హౌస్ పై జరిగిన దాడుల్లోనూ డ్రగ్స్ దొరికాయన్న కలకలం దుమారం రేపింది. ఈ కార్ రేస్ లోనూ నేరుగా బ్రిటన్ కు చెందిన ఓ విదేశీ కంపెనీకి వారి ఖాతాకి నిధులు మళ్ళించిన అంశంలోనూ ఏసీబీ విచారణ జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కేటీఆర్ ఒప్పుకున్నారు. ‘మంత్రిగా తాను ఆదేశించాన’ని చెప్పుకున్నారు. అందులో ‘తప్పేలేదని’ వాదిస్తున్నారు. ‘దమ్ముంటే జైలులో పెట్టమని సీఎంకు సవాల్’ విసరుతున్నారు. మరోవైపు హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యవర్గం కలిసి వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా టీసీఏ ఏసీబీకీ, ఈడీకి ఫిర్యాదు చేసింది. బీసీసీఐ ఇచ్చిన నిధులతోపాటు, వందలాది కోట్ల రూపాయల అవినీతి ఆరోపణల్లో ఇప్పటికే హెచ్ సీఏ అధ్యక్షుడు జగన్ అరెస్టయ్యారు. కార్యదర్శి దేవరాజ్ పరారీలో ఉన్నారు. దేవరాజ్ కి సమాచారం లీక్ చేసిన విషయంలో ఓ సీఐ సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ విచారణ కూడా మొదలవుతోంది. విద్యుత్ కొనుగోల్ మాల్ పై విచారణ జరుగుతోంది. లక్షలాది కోట్ల మేర జరిగిన కొనుగోళ్ళల్లో అవినీతి జరిగిందని, తక్కువ రేట్ కు దొరికినా కాదని, ఎక్కువ రేట్లకు కోట్ చేసి, కమీషన్లు కొట్టేసి, ప్రజాధనాన్ని దోచుకున్నారన్న ఆరోపణలపై విచారణ నడుస్తోంది.
కొన్ని కేసుల్లో కోర్టులను ఆశ్రయించిన మాట కూడా మరవరాదు. ఇన్ని విచారణల మధ్య కేసీఆర్ మౌనం దాల్చగా, ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్ రావు, మధ్య మధ్య మరికొందరు మాత్రం ఎదురు దాడులకు దిగుతున్నారు. అప్పులు చేసి, ఆస్తులు పెంచామంటున్న వారే, దమ్ముంటే తమపై కేసులు, ఆరోపణలను రుజువు చేయాలని సవాళ్ళు విసురుతున్నారు. వాళ్ళని తప్పు పట్టలేం. బహుషా తాము తప్పే చేయలేదని, ఒకవేళ తప్పు జరిగినా, ఆ తప్పులో తమ తప్పే లేదన్న నమ్మకంతో కూడా ఇలా చేస్తుండవచ్చు. అయితే, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘తప్పులు చేయకపోతే ఈ రంకెలు ఎందుకు?’ ‘విలన్లు సినిమా చివరలోనే దెబ్బలు తింటారని, జైలుకు వెళతారని, అప్పటి దాకా ఓపిక పట్టాలని’ చమత్కరించారు.
రాజకీయ ఆరోపణలు ఎలా ఉన్నా, నేరం రుజువయ్యే వరకు ముద్దాయిలను నేరస్తులుగా భావించలేం. విచారణలు పూర్తై, అవినీతి నిరూపణ అయ్యే వరకు కేసీఆర్ కుటుంబాన్ని అనుమానించవచ్చునేమో కానీ, అవినీతి పరులని చెప్పలేం. కానీ, కేటీసీఆర్ కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నదని పదే పదే అరోపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వాటిని నిరూపిస్తారా? లేక తాము అవినీతి పరులం కానే కాదని కేసీఆర్ కుటుంబం నిలబడుతుందా? రాజకీయ కేసుల నిలువవనే నానుడే మరోసారి రజువవుతుందా? చూద్దాం. కాలం సమాధానం చెప్పకపోతుందా?

