రాజకీయ నాయకుల మాటలకు అర్థాలు వేరే ఉంటాయి. ప్రసంగాలు, మాటలు, విమర్శలకు వాడే భాషతోపాటు, అర్థాలు వేర్వేరుగా ఉంటాయి. వారి భాష హద్దు దాటుతోంది. హుందాగా ఉండాల్సిన నేతల ప్రవర్తనలు కూడా నీచంగా దిగజారుతున్నాయి. విమర్శల కోసం ఏది పడితే అది మాట్లాడుతున్నారు. తాము అధికారంలో ఉంటే ఓ తీరు. అది చేజారితే మరోతీరు. ఎవరినైనా ‘అధికారాంతమున చూడవలె’ అన్నట్లుగా ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు వారి ప్రవర్తనను గమనిస్తే, అధికారం పోయిన తర్వాత వారి నిజస్వరూపం బయటపడుతుంది. పదేళ్లు అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్ నేతలు, ఐదేళ్లు పవర్ లో ఉన్న వైకాపా నేతలు ఇప్పుడు ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. ఉన్నదున్నట్లు పత్రికలు రాస్తున్నాయి. ఛానళ్లు కూడా వీటిని యధాతథంగా ప్రసారం చేస్తున్నాయి. నాయకుల విమర్శల్లో నిజానిజాలను నిగ్గుతేల్చే సాహసాన్ని ప్రసార, ప్రచార సాధనాలు చేయడంలేదు. ఒకందుకు సామాజిక మాధ్యమాలే నయం. వాటి భాష, అతి, అబద్ధాలను పక్కనపెడితే, ఎంతోకొంత వాస్తవాలు వెలుగు చూస్తున్నవి. ఒకవైపు వారు వాడే భాషను, మరోవైపు వారు ఆడే అబద్ధాల ప్రచారాన్ని కట్టడి చేయలేమా? ఏది మాట్లాడినా చెల్లుతుందనే పద్ధతికి బ్రేకులు పడవా? అలా మాట్లాడేవాళ్లకు తగిన శిక్షలుంటాయన్న భయం లేకుండా వారి అబద్ధాలపై ఆంక్షలుండక్కరలేదా? కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని బీఆర్ఎస్ విమర్శిస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ విమర్శిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శిస్తుంది. మూడు పార్టీలు ఒకరినొకరు ఒక్కటే అంటే మరి వేరు పార్టీ ఏది? అయితే మూడు పార్టీలు ఒక్కటై అబద్ధాలు ఆడుతుండాలి. వారి మధ్య లేని వేర్పాటు ప్రజల మధ్య ఎందుకు? పైగా వారాడే అబద్ధాలని ఎంతకాలమని భరిస్తారు? ప్రజలు కూడా వేడుక చూస్తున్నారు. ఎంజాయ్ చేస్తున్నారని అనుకోవాలా? లేక వారి మాయలో పడి ఏది నిజమో? ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నారా?
తెలంగాణలో పదేళ్లు పాలన చేసిన కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యాసను, భాషను సాధనంగా వాడుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్ రావు, బిడ్డ కవితలతో పాటు ఇతర నేతలు కూడా హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారు. వీరి తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి అంతకంతకూ రెచ్చగొడుతున్నారు. ఏపీలో జగన్ ఆయన అనుచరులు కూడా ఇలాగే తెగించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అధికారం అనుభవించారు. వారి చుట్టాలు, పక్కాలు, కులమైతే చాలన్నట్లుగా పదవులను చేపట్టారు. ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలను, ఉద్యమకారులను కేసీఆర్ గడ్డి పరకల్లా తీసి అవతల పడేశారు. ప్రొపెసర్ కోదండరామ్ లాంటి వారిని కూడా కరివేపాకులా వాడి పడేశారు. జర్నలిస్టులనైతే, గంజిలో ఈగల్లాగా చూశారు. ప్రజల్ని ఓటర్లుగా మాత్రమే గుర్తించారు. ఓటర్లు వారిని ఓడిస్తే, తప్పు చేసినట్లుగా చిత్రీకరించారు. ఇప్పుడు అధికారం దూరమయ్యే సరికి వారి మాట, ప్రవర్తన పూర్తిగా మారిపోయాయి. ఉచ్ఛ నీచాలు మరచి విమర్శలు చేస్తున్నారు. పోలీసులు, ఇతర అవినీతి అధికారుల అండదండలతో ప్రజాధనాన్ని, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలాది ఎకరాల భూములను వారు, వారి కుటుంబ సభ్యులు కొల్లగొట్టారనడానికి అనేక అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చూస్తుంటే ఇంతగా తెగించారా? అన్న అనుమానాలు కలగకమానవు. ఏసీబీ దాడులు, ఇడి విచారణల్లో, కొనసాగుతున్న దర్యాప్తుల్లో వెలుగు చూస్తున్న నిజాలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. అధికారులే వందల, వేల కోట్లు వెనకేసుకుంటే, ఇక అసలు నాయకులు ఎంత వెనకేసుకున్నారో ఊహించవచ్చు. అంతెందుకు ఈ ఫార్మూలా కారు కేసులో ఆర్థికశాఖ అనుమతులు లేకుండా కేవలం మంత్రిగా డబ్బులు నేరుగా దేశం దాటించానని ఒప్పుకున్న కేటీఆర్ మాట్లాడుతున్న తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. ‘లొట్టపీసు కేసు, లొట్టపీసు సీఎం అని, ఏం పీక్కుంటారో పీక్కోండి’ అని అనడం వెనుక ధైర్యమేంటి? ఇది ఏ ప్రజాస్వామిక విలువలకు లోబడి మాట్లాడుతున్నట్లు?
ఏపీలో జగన్ కూడా ఇలాగే ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అని అంటున్నారు. ఇలా మంత్రులుగా, సీఎంగా పని చేసిన వ్యక్తులు మాట్లాడాల్సిన భాషేనా? బుకాయించే తీరు ఇదేనా? అని ప్రజలు విచిత్రపోతున్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై మీడియా సంస్థలపై ప్రతిపక్షాలపై నిఘా, నియంత్రణ, ఫోన్ ట్యాపింగ్, అణచివేత కొనసాగించిన విషయం కేటీఆర్ మర్చి పోయి ఉంటారా? అధికారం ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు పంపిణీ చేసి రాయలసీమను రతనాల సీమను చేస్తామని ప్రకటించారు. ఇప్పుడేమో తెలంగాణ హక్కులను చంద్రబాబు పాదాల వద్ద పెట్టారని విమర్శలు చేస్తున్నారు. మేడిగడ్డ మీద చర్చ పెడతామంటారు. సవాళ్లు విసరుతారు. రచ్చ తప్ప చర్చే ఉండదు. ఆనాటి ఏపీ సీఎం జగన్‌ని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి పిలవడం చూశాం. ఆయన ప్రమాణస్వీకారానికి అమరావతి వెళ్ళడాన్ని చూశాం. మంత్రి రోజా ఆహ్వానాన్ని అందుకొని నగరి సందర్శించి ఆతిథ్యం పుచ్చుకోవడం కూడా చూశాం. ఇవన్నీ అబద్ధాలైనట్లు కేటీఆర్, హరీష్ రావులు ఇప్పుడు ఇష్టానుసరాంగా మాట్లాడుతున్నారు.
ఇకనైనా చేసిన తప్పులు ఒప్పుకోండి. లేదా బుకాయించడమైనా మానండి. జగన్ కూడా తన తండ్రి వైఎస్ లాగా హుందాగా ఉండడం నేర్చుకోవాలి. ఇరు పార్టీల నేతలు హుందాగా ప్రతిపక్ష బాధ్యతలు నెరవేర్చాలి. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలి. ప్రజలకు మేలుచేసేలా చర్యలు ఉండాలి. ప్రతిపక్ష పాత్రను క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించినప్పుడే ప్రజలు ఆదరిస్తారని గుర్తించాలి.
…..

