పంచాయతీ ఎన్నికలకు నగారా మోగడంతో గ్రామాల్లో మళ్ళీ రాజకీయ హడావుడి మొదలైంది. పార్టీ రహితంగానే ఎన్నికలు జరగనున్నప్పటికీ పార్టీలు స్థానికంగా పట్టు సాధించాలంటే సర్పంచ్ పదవులను గెల్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని విధాలుగా సర్వశక్తులు ఒడ్డడానికి పార్టీలు సంసిద్ధంగా ఉన్నాయి. దీంతో గ్రామాలు ఇప్పుడు రాజకీయ రణక్షేత్రాలు కానున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తరవాత నిర్వహించాలని నిర్ణయించడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగబోతున్నాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. మూడు వారాల్లోనే మొత్తం ఎన్నికల పక్రియ ముగియనుంది. 27తో తొలి దశ ఎన్నికల పక్రియ మొదలై, డిసెంబర్ 17తో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి. పోలింగ్ రోజే, ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడించనున్నారు. డిసెంబర్ 11న తొలిదశ, డిసెంబర్ 14న రెండో దశ, డిసెంబర్ 17న మూడో దశ పోలింగ్ జరగనుంది.
ఎన్నికల నిబంధనల మేరకు, ఐదు వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.5 లక్షలు, వార్డు అభ్యర్థి రూ.50వేలు ఖర్చు చేయాలి. ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.5 లక్షలు, వార్డు అభ్యర్థి రూ.30వేల లోపు ఖర్చు చేయాలి. అయితే ఆచరణలో జరిగే ఖర్చులకు, ఎన్నికల సంఘం పెట్టిన నిబంధనలకు పొంతన ఉండదన్న విషయం తెలిసిందే.
పంచాయతీ ఎన్నికల ప్రకటనకు ముందే, ప్రభుత్వం పందేరాలను ప్రారంభించింది. నియోజకవర్గానికి 3వేల చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. హడావుడిగా ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించింది. మరోవైపు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు కూడా పంపిణీ చేశారు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనులను ఆయా అభ్యర్థులు పడ్డారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో, పోటీ పడే అవకాశం రాని నేతలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు. కొన్ని చోట్ల పోటీ చేసే భర్తలకు విడాకులిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు ఆలస్యమవడం, ప్రభుత్వ వద్ద డబ్బుల్లేకపోవడం, ఇప్పటికే గ్రామాల్లో కొంత పురోగతి జరిగి ఉండటం, వచ్చే టర్మ్ లో నిధుల కొరత, పనుల లేమీ కచ్చితంగా ఉంటుందన్న అంచనాతో పలువురు పోటీకి విముఖుత కూడా చూపుతున్నారు. ఏదో ఒక ప్రోటోకాల్ పదవి ఉంటుంది. గ్రామానికి మొదటి గౌరవం సర్పంచ్ కే కాబట్టి, పోటీ చేద్దాంలే అని మరికొందరు ఆలోచిస్తున్నారు. ఇక ఆయా పార్టీల పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా పోటీలో నిలిచేందుకు యత్నిస్తున్నారు. ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ఇదే తడవుగా ఎమ్మెల్యేలు సర్పంచ్ అభ్యర్థుల నుండి డిపాజిట్లు ఆశిస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ కావాలనుకునే అభ్యర్థి తమ వద్ద పెద్ద గ్రామ పంచాయతీకి రూ.కోటి, చిన్న గ్రామ పంచాయతీకి రూ.5లక్షల నుంచి రూ.50లక్షల వరకు డిపాజిట్ చేస్తే టికెట్లిస్తామంటున్నారట. తమ ఎన్నికలకు పెట్టిన ఖర్చుకే దిక్కులేదని, స్థానిక ఎన్నికల ఖర్చు తాము పెట్టలేమని, అభ్యర్థులే పెట్టుకోవాలని షరతులు విధిస్తున్నారు. దీంతో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఖర్చుపై ఆందోళనలు మొదలయ్యాయి.
అభ్యర్థులు తమ ఖర్చుపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. ముందుగా డిపాజిట్ చేస్తేనే టికెట్లు. ఆ తర్వాత రోజువారీగా చేసే ఖర్చు, ఓటుకిచ్చే నోటు? అదెంతివ్వాలి? ఎంత మంది ఓటర్లకివ్వాలి? ఆ డబ్బు ఎక్కడి నుండి తేవాలి? అనేది అభ్యర్థులకు సమస్యలుగా పరిణమించాయి. రియల్ దందా కుదేలుతో ప్లాట్లు, భూములు అమ్ముకోలేకపోతున్నారు. కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అప్పో సప్పో తెచ్చి పెడదామంటే, పెరిగిపోతున్న ఖర్చు, ఓటర్ల మనోగతం లాటరీగా మారడం, గెలిచినా, పెట్టిన ఖర్చు తిరిగి వచ్చే దారులే లేకపోవడం వంటి అంశాలు అభ్యర్థులను గందరగోళ పరుస్తున్నాయి.
ఇక తొలి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులకు కేవలం రెండు వారాలు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. రెండో విడతలో పోటీ చేసే అభ్యర్థులకు అదనంగా మూడు రోజులు కలిసి వస్తోంది. తుది విడతలో పోటీ చేసే వారికి దాదాపుగా మూడు వారాల సమయం దక్కుతోంది. ప్రచారానికి సమయం తక్కువ ఉండటం ఖర్చు తక్కువవడానికి ఆస్కారముంది. కానీ, కనీస నిధులు సమకూర్చుకోవడమే కష్టంగా మారింది. అయినప్పటికీ ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అవుతుందనే ఆవేదన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. అయితే ఎన్నికలు ఓటర్లకు పండుగ తెస్తున్నాయి.

