రిజర్వేషన్లు కేవలం వర్గ ఆధారితం మాత్రమే కాదు, వాటి లోపల అసమానతలను కూడా పరిగణించాలి. అయితే, ఇప్పుడు జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు, ‘ఎస్సీల్లో అంతర్గతంగా సామాజిక-ఆర్థిక సామరస్యాన్ని’ ఎలా సాధించాలనే ప్రశ్నలను మళ్ళీ తెరమీదకు తెచ్చాయి. మరి ప్రభుత్వాలు, పార్లమెంట్ ఎస్సీల్లో ‘క్రీమీ లేయర్’ సమస్యను చర్చిస్తాయా? పరిష్కరిస్తాయా? లేక ఈ తేనె తుట్టెను కదల్చడం మనకెందుకులే? అని ఊరకుంటాయా?
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
భారతదేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, అవకాశాల సమాన పంపిణీ వంటి విలువలు రాజ్యాంగ ఆదేశాలు. శతాబ్దాలుగా దళితులు ఎదుర్కొన్న దోపిడీ, అణచివేత, అంటరానితనం, అవమానం, విద్య–ఉద్యోగాల్లో వెనుకబాటును సరిదిద్దడానికి ‘అంగీకారాత్మక చర్య’ రూపంలో ‘రిజర్వేషన్’ వ్యవస్థను మొదట నిర్ణీత కాలానికి అమలు చేశారు. ఆతర్వాత వాటిని కొనసాగిస్తన్నారు. అయితే ఇటీవలి కాలంలో, ఎస్సీ వర్గాల్లో వర్గీకరణ ఉద్యమాల నేపథ్యంలో, కుల ఆధారిత రిజర్వేషన్లలో అత్యంత కీలకమైన క్రీమీ లేయర్ అంశం తెరమీదకు వచ్చింది. దీనిపై భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తన పదవీ విరమణకు ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఎస్సీ, ఎస్టీలలో ఉప వర్గీకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులో జస్టిస్ గవాయ్ భాగస్వామిగా ఉన్నారు. దేశంలో అత్యున్నత న్యాయపీఠాన్ని అధిరోహించిన రెండో దళిత న్యాయమూర్తి ఆయన. ‘ఇప్పటికే ఉన్నత స్థానాలకు చేరిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఇంకా రిజర్వేషన్లు పొందుతున్నాయని, దీనివల్ల ఆయా వర్గాల్లోని నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోంద’ని పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో ‘తదుపరి చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఓబీసీలకు అమలవుతోన్న ‘క్రీమీ లేయర్’ ను ఇక ఇప్పుడు ఎస్సీల్లోనూ ప్రవేశపెట్టాలా? వద్దా? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. కొన్ని వర్గాలు ఈ అంశాన్ని సామాజిక న్యాయానికి అనుకూలంగా భావించగా, మరికొన్ని వర్గాలు దీన్ని దళితుల ఎదుగుదలకు అడ్డంకిగా చూస్తున్నాయి. 2011 జనగణన ప్రకారం, దేశంలో ఎస్సీల జనాభా 20,13,78,372 మంది. ఇది మొత్తం దేశ జనాభాలో 16.6శాతంగా ఎస్సీలున్నారు. తెలంగాణలో 2024-2025 రాష్ట్ర సామాజిక-ఆర్థిక-సర్వే ప్రకారం, ఎస్సీల జనాభా 61,84,319 మంది. ఇది తెలంగాణ మొత్తం జనాభాలో 17.43శాతం. ఎస్సీల వెనుకబాటుకు కారణం ఆర్థికమేగాక, అంటరానితనం, అట్టడుగు స్థాయి జీవన పరిస్థితులు, కులాధారిత వివక్ష. ఇక క్రీమీ లేయర్ అంటే? ఆర్థిక, సామాజిక సూచికలతో ఆర్థికంగా, విద్య–ఉద్యోగాల్లో ఇప్పటికే మెరుగైన స్థితికి చేరిన వర్గాలను రిజర్వేషన్ ప్రయోజనాల నుండి వేరు చేయడం.
గత 75 ఏళ్లుగా ఎస్సీల్లో కొందరే ఉద్యోగ, రాజకీయ లబ్ది పొందుతూ వస్తున్నారు. అలాంటి వారు ఆర్థిక, సామాజిక ఉన్నతస్థానం చేరుకున్నాక, వారిని క్రీమీ లేయర్‌గా గుర్తించాలి. అలా జరగకపోవడం వల్ల దళితుల్లో అసమానతలు మరింత పెరిగి, వెనకబడిన వారి మధ్య మరింత వెనకబడిన పరిస్థితులను సృష్టిస్తున్నాయి. అత్యంత వెనకబడిన, అణగారిన వర్గాలకు ప్రాధాన్యతలతో కూడిన ప్రాతినిధ్య న్యాయం కల్పించడానికి ఇప్పుడు సంపన్న శ్రేణి వర్గాలు ప్రగతిశీల దృక్పథంతో క్రీమీ లేయర్ అమలును స్వాగతించడంపై మేధోమథనం జరుగుతోంది. ఇప్పుడీ అంశంపై దళితుల్లోనే చైతన్యం రావాల్సి ఉంది. వారే వారి హక్కుల కోసం పోరాడాలి. దళితుడైన జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. వర్గీకరణ పేరుతో ఎస్సీల్లో ఉపకులాల రిజర్వేషన్ల కోసం ఉద్యమించినట్లుగానే, ‘క్రీమీ లేయర్’ కోసం కూడా మరో ఉద్యమం అనివార్యమవుతుందా?
సహజంగానే రిజర్వేషన్ల ద్వారా అత్యధికంగా లబ్దిపొందిన ఎస్సీలు క్రీమీ లేయర్ ను వ్యతిరేకిస్తున్నారు. ఆధిపత్య కులాల సంపదలకు పరిమితులు లేనప్పుడు, అవి తమకు మాత్రం ఎందుకు వర్తింపజేయాలని ప్రశ్నిస్తున్నారు. కోర్టులు, ప్రభుత్వాలు కూడా తమకు వ్యతిరేకంగా ఆలోచించడం అన్యాయమని వాదిస్తున్నారు. అయితే ఎస్సీలది కేవలం ఆర్థిక సమస్య కాదు, సామాజిక సమస్య. అందుకే జస్టిస్ గవాయ్, ‘ఒక ఐఏఎస్ అధికారి, ఒక పేద వ్యవసాయ కూలీ దళిత కుటుంబాలను సమానంగా చూడలేమన్నారు.
నిజానికి రిజర్వేషన్లతో ఉన్నత సామాజిక, ఆర్థిక స్థాయికి చేరిన ఎస్సీలు మిగతా ఎస్సీలను పట్టించుకోవడం లేదన్న భావన ఒకటి ఉంది. రిజర్వేషన్లు కేవలం వర్గ ఆధారితం మాత్రమే కాదు, వాటి లోపల అసమానతలను కూడా పరిగణించాలి. అయితే, ఈ దృక్పథాన్ని అమలు చేయడంలో రాజకీయ, సాంఘికమైన సమస్యలున్నాయని కూడా అనేక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు, ‘ఎస్సీల్లో అంతర్గతంగా సామాజిక-ఆర్థిక సామరస్యాన్ని’ ఎలా సాధించాలనే ప్రశ్నలను మళ్ళీ తెరమీదకు తెచ్చాయి. మరి ప్రభుత్వాలు, పార్లమెంట్ ఎస్సీల్లో ‘క్రీమీ లేయర్’ సమస్యను చర్చిస్తాయా? పరిష్కరిస్తాయా? లేక ఈ తేనె తుట్టెను కదల్చడం మనకెందుకులే? అని ఊరకుంటాయా?

