బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ‘ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామ’ని అమెరికా ఇంటిలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్ ఆ మధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.
మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
దేశాలతో ఆటలాడుకోవడం అమెరికాకు అలవాటుగా మారింది. ఆంక్షలు, సుంకాలు విధించడం, బెదిరించడం పరిపాటిగా మారింది. తాజాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే, 500 శాతం పన్నులు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ తన కనుసన్నల్లో ఉండాలన్నది అమెరికా కోరిక. అందుకు అవసరమైన అన్ని కుయుక్తులు పన్నుతోంది. దేశాల అంతర్గత విషయాల్లో వేలుపెడుతూ వాటిని కంట్రోల్ చేస్తోంది. ఇజ్రాయిల్‌ను అడ్డం పెట్టుకుని పాలస్తీనాపై దాడికి తెగించింది. ఇరాన్, ఖతార్‌లపైనా విరుచుకు పడింది. ఏకంగా రాజకీయంగా దేశాల పాలకులనే మార్చేస్తోంది. ఒక్క భారత్‌లోనే అది సాధ్యం కాలేదు. చైనాలో సాధ్యం కాదు. విభిన్న మతాలు, కులాల సమాహారమైన భారత్, అతి పెద్ద ప్రజాస్వామ్యం కావడంతో ఇక్కడ దాని పప్పులు ఉడకడం లేదు.
బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అమెరికా పరోక్ష పాత్ర ఉంది. పాక్‌ను దువ్వుతున్నది. నేపాల్‌లో గొడవలు సృష్టించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది. వీసాలపై కఠిన నిబంధలను పెట్టింది. బంగ్లాదేశ్ అంతర్గత అలజడుల వెనక అమెరికా హస్తం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇతర దేశాల్లో వేలు పెట్టడం వల్ల తాము చాలా నష్టపోయామని అమెరికా ఇంటిలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్ ఆమధ్య అంగీకరించడం, అమెరికా వైఖరిని స్పష్టం చేస్తున్నది.
బంగాదేశ్‌లో హసీనాను గద్దె దించడం, యూనస్‌ను గద్దెనెక్కించడం చకచకా జరిగి పోయాయి. ఇప్పుడు హసీనాకు ఉరిశిక్షను కూడా విధించారు. రెండు దశాబ్దాల క్రితం రసాయన ఆయుధాల పేరుతో ఇరాక్‌పై దాడిచేసి అక్కడ సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని అమెరికా గద్దె దింపింది. సద్దాంను బంధించి, ఉరితీసే వరకు నిద్రపోలేదు. సరిగ్గా ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న తీరు కూడా ఇరాక్‌ను పోలివుంది. హసీనా భారత్‌కు అనుకూలంగా ఉండడాన్ని అమెరికా జీర్ణించుకోలేదని అర్థం అవుతోంది. అయితే, పదవీచ్యుతురాలయ్యాక, హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు. ఇప్పుడామె మరణశిక్షకు అర్హురాలని అక్కడి ట్రిబ్యునల్ నిర్ణయించింది. ముగ్గురు సభ్యుల ఈ ట్రిబ్యునల్ హసీనా ఎన్నో దుర్మార్గాలకు పాల్పడిందని ఏకరువు పెట్టింది. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నవారిని కాల్చిపారేయమని ఆదేశించారని, డ్రోన్లు, హెలికాప్టర్లు ఉపయోగించి మరీ నిరసనకారులపై మారణాయుధాలతో విరుచుకుపడమని భద్రతాబలగాలను ఒత్తిడి చేశారని న్యాయమూర్తులు తేల్చారు. అధికారంలో కొనసాగడానికి అత్యంత అమానుషంగా ప్రవర్తించారంటూ, తీవ్రంగా గాయపడిన నిరసనకారులను సకాలంలో ఆస్పత్రికి తరలించడానికి కూడా భద్రతాదళాలు నిరాకరించాయని న్యాయమూర్తులు ప్రకటించారు. తీర్పు ఇవ్వడంలో జాప్యం జరిగినందుకు క్షమించమని కూడా ఒక న్యాయమూర్తి అన్నారు. తీర్పు వెలువడగానే, యూనిస్ ప్రభుత్వం హసీనాను తమకు అప్పగించమని డిమాండ్ చేశారు.
సరిగ్గా యాభైయేళ్ళక్రితం జరిగిన సైనిక కుట్రలో తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులను కోల్పోయి, ఆరేళ్ళపాటు భారత్‌లో ఇందిర నీడన తలదాచుకొని, తిరిగి స్వదేశంలో కాలూని అధికారాన్ని చేజిక్కించుకున్న హసీనా గతం ఇప్పుడు అందరికీ గుర్తుకువస్తోంది. జియావుర్ రహ్మాన్ భార్య ఖలీదా జియా మీద అలుపెరగని, సాహసోపేత పోరాటాలు చేశారు. ఆధిపత్య పోరాటంలో ముజబూర్ రహ్మాన్ కుమార్తె హసీనా పైచేయి సాధించారు. ఖలీదా సహా బీఎన్పీ అధినాయకుల నిర్బంధాలు, ఆ పార్టీకి అండగా ఉన్న జమాతే వంటే ఇస్లామిక్ ఛాందసశక్తులను అధికారికంగానూ, అనధికారికగానూ హసీనా చీల్చిచెండాడారు. హసీనా పాలనలో బంగ్లాదేశ్ వేగంగా వృద్ధి చెందింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి, పేదరిక నిర్మూలనలోనూ మంచిపేరు తెచ్చుకుంది. తనకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమంపట్ల హసీనా నిర్దయగా వ్యవహరించారన్నదీ వాస్తవమే. ఆ తరువాత ఆమె దిగివచ్చినా, అప్పటికే పరిస్థితి చేజారింది. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించుకున్న తరువాత నిజానికి చల్లారినా, స్వల్పకాలంలోనే తిరిగి రాజుకోవడం వెనుక జమాత్ ఇస్లావిూ, బీఎన్పీ ఉండటంతో ఆమె కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని అంటారు.
పాక్ ఒత్తిడి కారణంగా అమెరికా, దాని మిత్రదేశాలు కొన్ని ఆమెకు పూర్తి వ్యతిరేకంగా వ్యహరించాయి. ఆమె పారిపోయి భారత్ కు వచ్చిన తరువాత, బంగ్లాదేశ్‌లో సాగిన పరిణామాలన్నీ ఆమె పట్ల ఏయే శక్తులు ఏ లక్ష్యాల కోసం కత్తికట్టాయో తేటతెల్లం చేస్తున్నాయి. గృహనిర్బంధంలో ఉన్న ఖలీదా విదేశీ చికిత్సతో ఎన్నికలకు సిద్ధపడటం, వేలాదిమంది జమాత్ యోధులు జైళ్ళ నుంచి బయటకు రావడం, ముజబూర్ రహ్మాన్ విగ్రహాలను మాత్రమే కాదు, ఆయన ఆధ్వర్యంలో సాగిన విముక్తి పోరాటాన్ని సైతం చరిత్ర నుంచి చెరిపేయడం, అప్పట్లో ఊచకోత కోసిన పాకిస్తాన్‌ను ఘనంగా కీర్తిస్తూ. ఊరేగించడం చూస్తూనే ఉన్నాం.
పాక్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను, బంగ్లాదేశ్‌ను ఎగదోయడం వెనక అమెరికానే ఉన్నదన్నది సుస్పష్టం. ఇప్పటికే హసీనాను అప్పగించాలని యూనిస్ ప్రభుత్వం పలు మార్లు కోరుతూ వచ్చింది. ఇప్పుడు ఉరిశిక్ష విధించారు. కనుక భారత్ మీద ఒత్తిడి పెంచేందుకు మరో ఆయుధం అందివచ్చింది. ఇదంతా అమెరికా ఆడిస్తున్న నాటకమని తెలుసుకోవడానికి పెద్దగా తెలివి తేటలు అక్కర్లేదు.

