జీఎస్టీ సంక్లిష్టలతో ఏళ్ల తరబడి ప్రజలను పీల్చి పిప్పి చేసి, ఇప్పుడు అట్టహాసంగా తగ్గించడం ముమ్మాటికీ రాజకీయమే. భారీ మొత్తంలో పన్నులు తగ్గాయని, సామాన్యులు పండగ చేసుకోవంటున్న ప్రగల్బాల ఫలితాలు సామాన్యులకు అందడం లేదు. దసరా, దీపావళి పండగ సీజన్‌ను ‘జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్’గా ప్రధాని అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం మోదీని అభినందిస్తూ అసెంబ్లీ ఉభయ సభల్లోనూ తీర్మానాలు చేసింది. జీఎస్టీని ప్రతిపక్షాలు గతంలోనే ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’ గా అభివర్ణించాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.55 లక్షల కోట్లు గత ఏడు సంవత్సరాల్లో జీఎస్టీ ద్వారా మోదీ ప్రజల మూలుగలు పీల్చారు. ప్రజల ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ల కోసం, దేశీయ మార్కెట్‌ను పెంచడం కోసం మాత్రమే జీఎస్టీని తగ్గించక తప్పనిస్థితి ఏర్పడింది. దీనికితోడు చుట్టుపక్కల దేశాల్లో ప్రజల్లో పెల్లుబికిన తిరుగుబాట్లు గమనించిన ఏలినవారికి వెన్నులో వణుకు పుట్టింది. చివరకు కార్పోరేట్లు సూచనల మేరకే తగ్గింపులు జరిగాయన్నదీ, తమపై ప్రేమతో కాదనీ ప్రజలకు అర్థం కావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ‘మార్గం అడుగు’ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
పెంచిన పన్నులు తగ్గిస్తే అవి సంస్కరణలు అవుతాయా? తనకు తానే ఏకపక్షంగా పన్నులు పెంచి, మళ్ళీ వాటిని తగ్గించి సంస్కరణలుగా ప్రచారం చేసుకోవడం కేంద్రంలోని ఏన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీకే చెల్లింది. నిజానికి అది పన్నుల సవరింపు మాత్రమే! ఇప్పటికే ఉన్న వ్యవస్థ లేదా ప్రక్రియలో తప్పులు, అవకతవకలు లేదా అసంతృప్తికరమైన అంశాలను మెరుగుపరచడం లేదా సవరించడాన్ని సంస్కరణ అనవచ్చు. జీఎస్టీ మార్పులు సంస్కరణ అంటే అంతకుముందు జీఎస్టీని పెంచడాన్ని తప్పుగా అంగీకరించినట్లవుతుంది. సంస్కరణగా పేర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం తప్పును ఒప్పుకున్నట్లేనా? లేక ఆ తప్పులను సంస్కరించుకున్నట్లేనా? బీజేపీ తేల్చుకోవాలి.
8ఏళ్ల క్రితం ఒకే దేశం, ఒకే పన్నుగా పేర్కొంటూ, జీఎస్టీని తెచ్చారు. ఆ పన్నులతో దేశాన్ని ప్రజల్ని పీల్చి పిప్పి చేసి, దోచి పడేశారు. ఆ డబ్బుతో చేసిన ప్రగతిని తమ ప్రతిభగా చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. హెల్త్ స్కీమ్‌లు, ఇన్సూరెన్స్ ల పైన వేసిన జీఎస్టీని తగ్గించమని పార్లమెంట్ వేదికగా కోరితే, నిర్ద్వందంగా తిరస్కరించిన ఘనత మన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ది. కనీసం ఆలోచిస్తామని కూడా చెప్పలేదు. స్వయంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కోరినా నో చెప్పారు. అలాంటి వారు ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న, బీహార్ లాంటి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జీఎస్టీ స్లాబులను తగ్గించారు. ఇది కేవలం పెంచిన దాన్ని తగ్గించడం మాత్రమే. మోదీని సమర్థిస్తూ, నిత్యం కీర్తిస్తున్న చంద్రబాబు సైతం గొప్ప ఆర్థిక సంస్కరణగా చెప్పుకోవడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం విడ్డూరమే.
ఏళ్ల తరబడి ప్రజలను పీల్చి పిప్పి చేసిన అనంతరం వస్తు సేవల పన్ను విధానంలో కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకువచ్చిన మార్పుల తీరు చూస్తుంటే ఎంతగా రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ చర్యతో భారీ మొత్తంలో పన్నులు తగ్గాయని, సామాన్యులు పండగ చేసుకోవచ్చని పాలకులు చెబుతున్నప్పటికీ వాటి ఫలితాలు సామాన్యులకు అందడంపై సందేహాలు నెలకొన్నాయి.
ఈ నెల 22వ తేదీ నుండి నూతన జీఎస్టీ విధానం అమలులోకి రాగా, ఒక రోజు ముందు దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దసరా, దీపావళి పండగ సీజన్‌ను ’జీఎస్టీ సేవింగ్స్ ఫెస్టివల్’గా అభివర్ణించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందిస్తూ అసెంబ్లీ ఉభయ సభల్లోనూ తీర్మానాలు చేసింది. జీఎస్టీ 2.0 వల్ల కలిగే ప్రయోజనాలపై చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే, మోదీగానీ, చంద్రబాబు గానీ ఇన్ని ఏళ్ళ పాటు ప్రజలపై మోపిన భారాన్ని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. నిజానికి, ఏ వస్తువుపై ఎంత ధర తగ్గుతుందన్న నిర్దిష్టమైన వివరాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడించలేదు. ఇప్పటికీ షాపుల వారు మాత్రం పాత ధరలకే అమ్ముతున్నారు. టీవీ, కార్ల షోరూమ్‌లలో మాత్రం కొంత హడావుడి కనిపిస్తోంది.
ఏకీకృత పన్ను విధానం పేరుతో కార్పొరేట్ల ప్రయోజనాల కోసం జీఎస్టీని 2017లో దేశంపై బీజేపీ ప్రభుత్వం రుద్దింది. దశాబ్దాలుగా అనుసరించిన ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా సామాన్యుడి కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గింది. జీఎస్టీలో ఉన్న సంక్లిష్టత, అపరిమిత శ్లాబుల కారణంగా నిత్యావసర ధరలు భారీగా పెరిగి దేశ వ్యాప్తంగా గగ్గోలు చెరేగింది. ప్రతిపక్షాలు దీనిని ‘గబ్బర్‌సింగ్ ట్యాక్స్’ గా అభివర్ణించాయి. మరోవైపు చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతపడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా తగ్గాయి. అదే సమయంలో ట్రంప్ టారిఫ్‌ల ప్రభావమూ పడింది. దీంతో ప్రజల ప్రయోజనాలు ఎలా ఉన్నప్పటికీ కార్పొరేట్ల కోసమైనా దేశీయ మార్కెట్‌ను పెంచడం కోసం జీఎస్టీని తగ్గించక తప్పనిస్థితి ఏర్పడింది. వారికి లాభం చేకూర్చాలంటే జీఎస్టీ తగ్గించాలన్న పరిస్థితి ఎదురయ్యింది. దీనికితోడు చుట్టుపక్కల దేశాల్లో ప్రజల్లో అసహనం పెల్లుబికింది. ఇవన్నీ గమనించిన ఏలినవారు జిఎస్టీ తగ్గించడం తప్పదని గుర్తించారు. కార్పోరేట్లు కూడా ధరల తగ్గింపు గురించి ఇచ్చిన సూచనలు పాటించారని అర్థం అవుతోంది. జీఎస్టీ తగ్గింపు ప్రజలపై ప్రేమతో మాత్రం కానేకాదు.
అదే సమయంలో ధరలను నేరుగా తగ్గించే అవకాశాలను మాత్రం పరిశీలించడం లేదు. స్టీలు, సిమెంట్, ఔషధాల ధరలను తగ్గించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 55 లక్షల కోట్ల రూపాయలను గత ఏడు సంవత్సరాల్లో జీఎస్టీ ద్వారా మోదీ ప్రజల మూలుగలు పీల్చారు. దేశంలో కోట్లాది మందికి ఉపాధి కల్పించే చేనేత రంగానికి అవసరమయ్యే ముడి సరుకులను అదే శ్లాబులో ఉంచారు. కొన్ని రకాల ఔషధాలను జీరో శ్లాబులో ఉంచినట్లు చెబుతున్నప్పటికి, వాటి తయారీకవసరమైన ముడి పదార్ధాలపై పన్ను విధించారు.
జీఎస్టీ అమలులోకి వచ్చినా ధరలు తగ్గలేదు. పాత స్టాక్‌కు తగ్గింపు వర్తించదని అంటున్నారు. పలు సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను కొద్ది రోజుల కిందటే పెంచాయి. వీటిపై జీఎస్టీ తగ్గినా, పెద్దగా ఫలితం కనిపిందు. సామాన్యుడికి ప్రయోజనం కలిగించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే తగ్గిన జీఎస్టీ రేట్లను నిర్దిష్టంగా సరుకుల వారీగా ప్రకటించాలి. కరోనా తరవాత పెంచిన ఔషధాల ధరలను తగ్గించాలి.

