ఏదో ఒక రోజు బాధిత దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాపై దండయాత్ర చేసే అవకాశం ఎవరూ కాదనలేని వాస్తవం. అమెరికా ఆశించినట్లు దానికి ఎదురే లేకుండా అన్ని దేశాలూ యుద్ధాల వల్లో, సుంకాల వల్లో మరే కారణాల వల్లో నిర్వీర్యం అయ్యాయనుకుందాం. అప్పుడు చుట్టూ జీవంలేని దేశాలు, ప్రజలతో ఆ దేశం ఎలా మనగలుతుంది? ఈ మాత్రం ఇంగితం లేక అనుకోలేం కానీ, ట్రంప్ లాగే, ఎవరికైనా సాగుతున్నంత కాలం సాగించుకోవాలనే ఉంటుంది. అందుకే మనం ముందుగా స్వదేశీ స్వావలంబనను, స్వయం సమృద్ధిని సాధించాలి. లాడెన్ ఉగ్రచర్యలను ట్రంప్ మరచిపోయారు. పాక్‌ను దువ్వి పాలు పోస్తున్నారు. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. పాక్ కూడా అమెరికా అండతో భారత్‌పై మరింత కాలుదువ్వే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రచర్యలను ప్రేరేపించవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. ‘మార్గం అడుగు’ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
‘ట్రంప్ తన క్లోజ్ ఫ్రెండ్ కు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు.’ అని అమెరికా అధ్యక్షుడు హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచినప్పుడు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాని మోదీని ఎద్దేవా చేశారు. ఇందులో వ్యంగ్యాన్ని పక్కన పెడితే, ట్రంప్ ఎవరికీ నమ్మకైన ఫ్రెండ్ కాదనేది సారాంశం. అధ్యక్షుడిగా ట్రంపే కాదు, దేశంగా అమెరికా కూడా నమ్మకమైన నేస్తం కాదు. అత్యంత స్వార్థపూరిత, నిరంకుశ, నిరపేక్షమైన దేశంగా ఇటీవలి ఆ దేశ విధి విధానాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచం పట్ల ఆ దేశం ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తిస్తున్న తీరు హేయంగా కనిపిస్తోంది. తన లాంటి ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని సైతం ప్రశ్నించేలా జోక్యం చేసుకోవడం, లేని పెత్తనానికి పూనుకోవడం, సర్వసత్తాక దేశాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులకు, యుద్ధాలకు పురికొల్పడం, దిగడం వంటి ఏకపక్ష విపరీత ధోరణులు ఆ దేశ ఔన్నత్యాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. విషయమేదైనా సరే, అది తనకు ఉపయోపడుతుందా? అన్నదే ఆ దేశ లక్ష్యాలుగా ఉన్నాయి. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా అమెరికా ప్రపంచ దేశాల పట్ల వ్యవహరిస్తున్న పద్ధతులున్నాయి. తన బాధిత దేశాలపై అమెరికా దాష్టీకం కొంత కాలం నడవొచ్చు. కానీ, ఏదో ఒక రోజు ఆ బాధిత దేశాలతోపాటు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆ దేశంపై దండయాత్ర చేసే అవకాశం ఎవరూ కాదనలేని వాస్తవం.
అమెరికా ఆశించినట్లు దానికి ఎదురే లేకుండా అన్ని దేశాలూ యుద్ధాల వల్లో, సుంకాల వల్లో మరే కారణాల వల్లో నిర్వీర్యం అయ్యాయనుకుందాం. అప్పుడు చుట్టూ జీవంలేని దేశాలు, ప్రజలతో ఆ దేశం ఎలా మనగలుతుంది? ఈ మాత్రం ఇంగితం లేక అనుకోలేం కానీ, ఎవరికైనా సాగుతున్నంత కాలం ట్రంప్ లాగే, సాగించుకోవాలనే ఉంటుంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట భారత్ పై పాక్ ఉగ్రదాడిలో జోక్యం చేసుకున్నారు. పాక్ తోకముడిచి కాళ్ళ బేరానికి వస్తే, ఆ యుద్ధాన్ని ఇరుదేశాలతో మాట్లాడి తామే నిలిపేశామని, తనను నోబెల్ శాంతి బహుమతికి సిఫారసు చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఆ పాచిక పారకపోవడంతో తమ దేశ అన్ని ఎగుమతులపై సుంకాలు విధించారు. భారత్ పై కూడా ముందుగా 25శాతం, ఆ తర్వాత దాన్ని 50శాతానికి పెంచి, తిరిగి 25శాతం దగ్గర నిలిపారు. చమురును రష్యా నుంచి కొనుగోలు చేయడం ద్వారా భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి సహకరిస్తున్నదని నిందారోపణ చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపేయాలని హూంకరించారు. ఆ తర్వాత వీసాల్లోని లోపాల కారణంతో అమెరికాలోని ఎన్ఆర్ఐలపై వెంటాడి, వేటాడి బేడీలు వేసి, అరెస్టు చేసి నానా యాగి చేసింది. భారత్ కు స్నేహహస్తం సాచినట్లే సాచి, హెచ్-1బీ వీసాల ఫీజును లక్ష డాలర్లకు పెంచారు. అమెరికా జనాభాలో రెండో అత్యధిక జనాభాగా 15శాతం ఉన్న భారతీయ టెకీలపై, టెక్నాలజీలో 70శాతానికి పైగా వాటా ఉన్న మన వాళ్ళపై, కొత్తగా ఆ దేశానికి వెళ్ళాలనుకునే వాళ్ళపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. హెచ్-1బీపై అమెరికాలో ఉన్న లక్ష మంది భారతీయులపై ఆ ప్రభావం పడింది. చివరకు ఆ పెరిగిన రుసుం ప్రతి ఏటా చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకసారి చెల్లిస్తే చాలని ముక్తాయించింది.
సుంకాలపై ఎదురు సుంకాలు విధించి చైనా, అమెరికాను గట్టిగానే ఎదురించింది. భారత ప్రధాని మోదీ సైలెంట్ గా షాంఘై సదస్సులో చైనా, అమెరికా అధ్యక్షులతో అరమరికలు లేకుండా వ్యవహరించి అమెరికా వెన్నులో వణుకు పుట్టించారు. అయితే తోలు మందమైన ట్రంప్ కు, బరితెగించిన అమెరికాకు ఈ టిట్ ఫర్ టాట్ సరిపోలేదనిపిస్తోంది.
భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అధిక జనాభాతోపాటు, వనరులు, మధో సంపత్తి సుసంపన్నగా కలిగిన దేశంగా భారత్ అత్యధిక మార్కెట్ కలిగిన దేశం కూడా. అందువల్ల ప్రపంచ దేశాల దిగ్గజ కంపెనీలన్నీ భారత్ వైపే చూస్తున్నాయి. చివరకు అమెరికా కన్ను కూడా భారత్ పైనే ఉంది. భారత్ ఆర్థిక మూలాలలను దెబ్బతీయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తున్నది. అమెరికాకు భారత్ మోకరిల్లాలనే ఆధిపత్య ధోరణి ట్రంప్‌లో కనిపిస్తోంది. ఓట్ల కోసం భారత్‌ను, ఎన్నారైల కాళ్ళా, వేళ్ళా పడి, మోదీతో చెలిమిని నటించిన ట్రంప్, గెలిచాక గేర్ మార్చడం వెనక సొంత ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.
భారత్ ఆర్థికంగా ఎదిగితే తమకు పోటీ అవుతుందన్న బెంగ ప్రధానంగా ఉంది. సైనికంగా స్వయం సమృద్ధిని సాధించడాన్ని కూడా ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. ఆపరేషన్ సిందూర్ తరవాత అమెరికా పాక్ కు అందించిన తుపాస్ ఆయుధాలు తుస్సు మనడంతో ఆయనలో అవమానం, అసహనం పెరిగింది. భారత్ సైనిక సత్తా చాటి, స్వదేశీ ఆయుధాలతోనే పాక్ పీచమణిచింది. పాక్‌లో తన స్థావరం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న అమెరికాకు ఇది గిట్టడం లేదు. పాక్ ఆర్మీ చీఫ్‌ను పిలిపించుకుని, చంకనెత్తుకుని, పాక్‌తో వాణిజ్యం కూడా మొదలు పెట్టారు. తాజాగా అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనేలా భారత్ పై ఒత్తిడి తెస్తున్నారు. మొత్తంగా భారత్ మార్కెట్‌ను దెబ్బతీసే కుట్ర కూడా ఇందులో దాగివుంది.
అందుకే, భారత ప్రధాని మొన్న ప్రజలకు ఓ బహిరంగ లేఖ విడుదుల చేశారు. విదేశీ తంత్రానికి స్వదేశీ మంత్రమే బెటరని ఉద్బోధించారు. మనం ముందుగా స్వదేశీ స్వావలంబనను సాధించాలి. మన దగ్గరే ఉద్యోగావకాశాలు పెంచాలి. ఒసామాబిన్ లాడెన్ ఉగ్రచర్యలను ట్రంప్ మరచిపోయారు. పాక్‌ను దువ్వి పాలు పోస్తున్నారు. దీనికి అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. పాక్ కూడా అమెరికా అండతో భారత్‌పై మరింత కాలుదువ్వే అవకాశాలు ఉన్నాయి. ఉగ్రచర్యలను ప్రేరేపించవచ్చు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.

