జీఎస్టీ పన్నుల సవరింపు ఆషాఢం మాసం సేల్ లాగా మారింది. డిమాండ్ తగ్గితే తగ్గించి, పెరిగితే పెంచి అమ్ముకోవడం లాగా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జీఎస్టీ ప్రకటంచినప్పుడు దేశంలో పన్నుల విధానంలో అతి పెద్ద సంస్కరణగా పేర్కొన్నారు. ఇప్పుడే అదే జీఎస్టీ తగ్గించి, శ్లాబులు మార్చి నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలని అంటున్నారు. ఇంతకాలం నెత్తీనోరు మొత్తుకున్నా జీఎస్టీ తగ్గించలేదు. చివరకు ఇన్సూరెన్స్ లపైనా జీఎస్టీని బాదారు. 11 ఏళ్ల తరవాత ఆ నెపాన్ని ప్రధాన ప్రతిపక్షంపై నెట్టేసి, కొత్త వడ్డనలను మొదలు పెట్టారు. ఒక్క జీఎస్టీ తగ్గింపులే కాదు, నిత్యావసరాలు, పెట్రో డీజీల్ ధరలు, నిరుద్యోగితలు తగ్గి, ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగాలి. వ్యవసాయం పండుగ కావాలి. యూరియా కొరతను రైతాంగం పట్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన మార్కెట్ సౌకర్యం కూడా కలగాలి. అన్నింటి కంటే ముందు ప్రజల ఆస్తులు తెగనమ్మి ఆదాయాన్ని సమకూర్చాలన్న భావన తొలగిపోవాలి.
రాజకీయ పెత్తనం తగ్గాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ జీతభత్యాలు తగ్గించుకోవాలి. నేతలకు డబుల్ పెన్షన్లు తొలగించాలి. కేంద్రం, రాష్ట్రాల్లో ఖర్చులు తగ్గించు కోవాలి. పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ప్రజల తిరుగుబాటుకు కారణాలు తెలుసుకుని మనదేశంలో అలాంటివి జరక్కుండా ముందు జాగ్రత్త పడాలి. చిన్న దేశాల్లో అస్థిరతకు విదేశీ హస్తం కూడా కారణం కావచ్చు. అయితే ప్రజల్లో అసంతృప్తి, అసహనం గూడుకట్టుకొని ఉండడం వల్లనే తిరుగుబాట్లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో విదేశీ శక్తి కూడా తోడవుతుండవచ్చు.
ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినప్పుడల్లా విదేశీ హస్తం అని నిందించేవారు. ఇప్పుడు మోదీ కూడా పదేపదే కాంగ్రెస్‌ను బూచిగా చూపి తప్పించుకో జూస్తున్నారు. ప్రభుత్వాలు, అధికార వ్యవస్థలలో అవినీతి పెరిగిపోవడం వల్లే మన దేశం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. రాజకీయ లాలూచీ, అవినీతి కారణంగా దేశం భ్రష్టు పట్టిపోతోంది. రాజ్యాంగబద్ధ సంస్థలలో కూడా అవినీతి చొరబడటం వల్ల సామాన్యులకు న్యాయం దొరకని దుస్థితి ఏర్పడింది.
కాళేశ్వరం, ఇ-కార్ రేసులో అవినీతిని నిగ్గు తేల్చడం లేదు. కేసులే అపరిష్కృతంగా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థపైన, ప్రభుత్వాలపైన ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందన్నది పాలకులు ఆలోచన చేయాలి. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం వల్ల మాత్రమే తిరుగబాటు రాలేదు. ప్రభుత్వంపై ప్రజల్లో అప్పటికే అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. ఇతర అనేక అంశాలు ఇందుకు సాకయ్యాయి.
బంగ్లాదేశ్ లో ఆ దేశ అధ్యక్షురాలి భవనంపై ప్రజలు దాడులు చేసి బెడ్ రూంలోనూ, స్నానాల తొట్టిలోనూ కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారంటే ప్రభుత్వంపై ఎంత విరక్తి చెందారో అర్థం చేసుకోవాలి. ఆ తిరుగుబాట్ల ఫలితంగా నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాలు మారినా ప్రజల జీవితాలు మాత్రం బాగుపడలేదు. గతంలో విప్లవాలన్నీ పాలకులు అవినీతి, అక్రమాలు, నిరంకుశంపైనే వచ్చాయి. కొంతకాలంగా శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలలో పెల్లుబికిన ప్రజల ధర్మాగ్రహం నుంచి మన పాలకులు, రాజ్యాంగ వ్యవస్థల అధిపతులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
మన దేశం భిన్న జాతులు, భిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషల సమాహారం కనుక, ఆ చిన్న దేశాలలో వలే తిరుగుబాట్లు జరగవని నమ్మరాదు. రైతుల ఉద్యమాన్ని తక్కువగా చూడరాదు. ఇందిరాగాంధీ వంటి శక్తిమంతమైన నేత కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు. కేంద్ర రాష్ట్రాల్లో అవినీతి విపరీతంగా పెరిగింది. లంచగొండి తనం వేళ్లూనుకుంది. పాలకులపై ప్రజలు విశ్వాసం కోల్పోతు న్నారు.
అధికారమే లక్ష్యంగా సంక్షేమం పేరిట హద్దుమీరి ప్రజా ధనాన్ని పంచి పెట్టడంపై పన్ను చెల్లింపుదారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను సోమరులుగా మార్చే పథకాలను ప్రవేశపెట్టే అధికారం రాజకీయ నాయకులకు లేదు. ప్రజాధనానికి కాపలాగా, కేర్ టేకర్‌గా పనిచేయాల్సిన వారు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. సామాన్యులకు న్యాయం ఎండమావిగా మారుతోంది. అధికార దుర్విని యోగం హద్దు మీరుతోంది.
ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత అటు పాలకులు, ఇటు రాజ్యాంగ వ్యవస్థల అధిపతులపై ఉంది. రాజకీయా నాయకులు తమ అతిని, అవినీతిని వదులుకుని ప్రజల కోసం, దేశం కోసం పనిచేయడం అలవాటు చేసుకోవాలి. లేకుంటే ప్రజాగ్రహం తప్పదు.

