చెరిపేస్తే చెరిగిపోనిది, మసకేస్తే మాసిపోనిది చరిత్ర. దాన్ని ఎవరూ చెరిపేయలేరు. మసిపూసి మారేడుకాయ చేసినా, కాలం పేజీలోంచి తీసేయలేరు. ఎవరి మనోభావాలను కించపరుస్తుందనో, దెబ్బ తీస్తుందనో, మరెవరి స్వప్రయోజనాలు, ఓట్ల బ్యాంకు కోసమో తాత్కాలికంగా వక్రీకరింప చూసినా, అది నిక్కచ్చిగా నిలబడి, కచ్చితంగా నిలదీసి, నిగ్గదీస్తుంది. నాడు నిజాం నుంచి విముక్తి కోసం ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. ఆత్మ బలిదానాలు చేశారు. దీన్ని తెలంగాణ విమోచనోద్యమంగానే పిలుస్తారు. దీన్నే ఒకరు విలీన దినంగా, మరొకరు జాతీయ సమైక్య దినోత్సవంగా, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతున్నారు. అంతా కలిసి ఓ చారిత్రాత్మక సత్యానికి విద్రోహం చేస్తున్నారు.
స్వాతంత్రానంతరం దేశంలోని 540కి పైగా సంస్థానాలన్నీ భారత దేశంలో విలీనమైనప్పటికీ, హైదరాబాద్ స్టేట్, కశ్మీర్, జునాగఢ్ లు నిరాకరించాయి. దీంతో, జనరల్ చౌదరి నేతృత్వంలోని భారత బలగాలు ‘ఆపరేషన్ పోలో’ను 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించాయి. భారత్ సైన్యం హైదరాబాద్ కు 115 కిలోమీటర్ల దూరంలోని జహీరాబాద్ కు చేరుకోవడంతో, ఇక తప్పని పరిస్థితిలో నిజాం లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న, నిజాం తన రేడియో కేంద్రానికి వెళ్లి భారత యూనియన్ లో హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు. సెప్టెంబర్ 18న, అధికారికంగా విలీన ప్రక్రియ పూర్తైంది.
విమోచన దినోత్సవం జరపడం అంటే ఆనాటి దాష్టీకాలను ఎండగట్టడం, త్యాగాలను సర్మించుకోవడం మాత్రమే. నాటి అరాచాకాలను గుర్తు చేసుకుంటూ, ఆనాటి ఘటనల్లో మరణించిన ప్రజలకు నివాళి అర్పించడం. ప్రపంచ చరిత్రలో పోరాటాలన్నీ నిరంకుశత్వం మీద జరిగినవే. వాటిని స్వాతంత్య్ర దినాలుగానే జరుపుకుంటున్నారు. తెలంగాణ విముక్తం కూడా ఒక స్వాతంత్య్ర దినోత్సవమే.
తెలంగాణలో రజాకార్లు చేసిన ఘాతుకాలు రక్తచరిత్రకు తార్కాణాలు. నిజాంకాలంలో భూస్వామ్యం పడగలెత్తి, గ్రామాలను దోపిడీ చేసి పీడిస్తున్నందున ప్రజలు తిరగబడ్డారు. పోరాడారు. భూములు ఆక్రమించుకుని పంచుకున్నారు, మరోవైపు నిజాంను కీలుబొమ్మ చేసుకున్న రజాకార్లు కమ్యూనిస్టులపై, కొన్ని చోట్ల కాంగ్రెస్ వారిపై, ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఉంటే అక్కడ దౌర్జన్యాలు చేశారు. భూస్వాముల గడీల్లో ఆశ్రయం పొందుతూ వారి తరఫున దాడులు చేశారు. పెద్ద ఎత్తున రక్తపాతం జరిగింది. పరకాలలో నరమేథం మరో జలియన్ బాగ్ లాగా సాగింది. బైరాన్‌పల్లిలో ఆడవాళ్లను నగ్నంగా బతుకమ్మ ఆడించారు. ధాన్యాన్ని తరలించారు. క్రూరంగా హింసించారు. దేశ చరిత్రలో ఇంతటి దారుణాలు జరిగినా, స్వాతంత్య్ర పోరాటం కారణంగా అవన్నీ మరుగున పడిపోయాయి. మరోవైపు నిజాం, భారత, పాకిస్థాన్ దేశాలు రెంటితోనూ తాను కలవబోనని, స్వతంత్రంగా ఉంటానని ప్రకటించాడు. ఓ దశలో పాక్‌లో కలవడానికి కూడా సంసిద్ధత ప్రకటించాడు. భారత ప్రభుత్వంతో ఆ విషయమై చర్చలు, వాదాలు సాగుతూ ఉండగానే, మరో వైపు కమ్యూనిస్టుల పోరాటం సాగుతూ ఉన్న దశలోనే, భారత ప్రభుత్వం సైనికచర్య జరిపింది. నిజాం లొంగిపోయాడు. నిజాం లొంగుబాటు సాజావుగా సాగలేదు. ఆనాటి హోంమంత్రి వల్లభాయ్ పటేల్ సైనిక చర్య తీసుకుని ఉండకపోతే హైదారాబాద్ సంస్థానం చరిత్ర కశ్మీర్ లా ఉండేది.
గాంధీతో సహా కాంగ్రెస్ ఆనాడు ఇక్కడి ప్రజల గురించి పట్టించు కోలేదు. ఇక కమ్యూనిస్టులు చేసింది భూస్వామ్యానికి వ్యతిరేకంగా భూమికోసం విముక్తి పోరాటం మాత్రమే. అయితే రజాకార్ల దాష్టీకంపై ప్రజలు సాయుధులై సమాయత్తం అయినప్పుడు అంతా కలసి కదిలారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి జరిగిన విముక్తి పోరాటం కావడంతో ప్రజల్లో సహజంగానే ఆనందం వెల్లి విరిసింది. బానిస సంకెళ్లు తెగినందుకు సంతోషించారు.
అయితే ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ, రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా భారత ప్రభుత్వానికి సహకరించాడు. రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించినా హైదరాబాద్ న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్‌టన్‌ని కొనసాగించడమే ఇందుకు నిదర్శనం. ఇక రజాకార్లలోనూ ముస్లింలతో పాటు శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో ముస్లింలుగా మారిన దళితులు, దొరలు, భూస్వాములు వారి అనుచరగణం కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గాన్ని తప్పుపడతారు? అప్పటి పరిస్థితులను బట్టి సాగిన చరిత్ర అది. అంతే! దాన్ని వక్రీకరించే అర్హత, హక్కు ఎవరికీ లేదు.
పార్టీలు, ప్రభుత్వాలు, తెలంగాణ విమోచన అనగానే ఉలిక్కిపడుతున్నారు. ఏదో పేరు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోవడానికి జంకుతున్న నేతలు ఉన్నందుకు మనం సిగ్గుపడాలి. మనిషన్నాక, పాలన అన్నాక మంచీ, చెడూ ఉంటుంది. నిజాం చేసిన మంచిని కీర్తించినట్లే, చెడును కూడా చీల్చి చెండాడాల్సిందే. ఒక్క హైదరాబాద్ నగరానికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ జలాశయాలు, యూనివర్సిటీ, హాస్పిటల్స్ ఇలా ఆయన చేసిన మంచిని ఎవరూ కాదనలేరు. ఆనాడు నిజాం నిరంకుశాలను, రజాకార్ల ఆగడాలను ఎదరించడానికి జరిగిన సాయుధ పోరాటం ముమ్మాటికి తిరుగబాటు చరిత్రే. చైనా సాంస్కృతిక, రష్యా బోల్షివిక్ పోరాటలకు ఇది ఏమాత్రం తక్కువ కాదు.
తెలంగాణకు విముక్తి జరిగిన సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆకాంక్షలను గత ప్రభుత్వాలతో పాటు, ప్రస్తుత ప్రభుత్వం కూడా విస్మరించడం ద్వారా చరిత్రను అపహాస్యం చేస్తూ వస్తున్నారు. తెలంగాణ విమోచన దినం అన్నింటికీ అతీతంగా మనమంతా కలిసి జరుపుకోవాల్సిన స్వాతంత్ర్యదినోత్సవం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. గర్వకారణం. చారిత్రక వాస్తవం. మన చరిత్రను మన భవిష్యత్తు తరాలకు చదువు, పాఠ్యాంశాలు, బోధనలు, పుస్తకాలు వంటి ప్రక్రియల ద్వారా అందించడం మనందరి బాధ్యత.
విలీనమా? విమోచనమా? విద్రోహమా?|EDITORIAL

