రాజకీయాల్లో సచ్చీలత సాధ్యం కాదు. స్వచ్ఛంగానే, స్వచ్ఛందంగానే పని చేస్తున్నామని చెప్పుకోవడమే తప్ప అలా చేయడం కూడా దుస్సాధ్యం. నూటికో కోటికో ఒక్కరు అలా కనిపించినా, వారు ఇంకా బతికున్న నీతికి, నిజాయితీకి ఆఖరి గుర్తుగా మిగిలిపోతారు. రాజకీయాలను ‘రాజీ’కీయాలుగా కూడా భావించవచ్చు. ఇందులో ‘ఆత్మ స్థుతి, పర నిందే’ అధికం. రాను రాను నేరగాళ్ళు కూడా రాజకీయాల్లో చొచ్చుకురావడం, లేదా రాజకీయాల్లో ఉన్న వారే నేరాలకు పాల్పడటం రివాజుగా మారింది. అధికారం ఉన్నంత వరకు ఏదైనా చెల్లుతుంది కాబట్టి, ఇష్టానుసారంగా వ్యవహరించడం కూడా అలవాటుగా మారింది.
అధికారంతమున చూడవలె అయ్యవారల ఆగడముల్ అన్నట్లుగా పదవులు పోగానే, కొత్తగా కొలువుల్లో చేరిన వారు పాత వారి పని పట్టడం, కనీసం పట్టినట్లుగా కనిపించడం, అలా ప్రతిపక్షాలను అదికార పక్షాలు నిలువరించడం, నియంత్రించడం కూడా మామూలైపోయింది. ఈ ధోరణి కాస్తా విపరీతమైనప్పుడు శత్రు భావనలకు వెళ్ళినప్పుడు, శ్రీ కృష్ణ జన్మస్థానాలు కూడా వారికి వరంగా మారిపోవడం లేదా మార్చుకోవడం చూస్తున్నాం.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. గతంలో మాజీ సీఎం జగన్ పై పలు కేసులు, జైలుకెళ్ళిన నేపథ్యంలో నిరంతరం అతడిని దొంగా దొంగా అంటున్నందుకు ప్రతీకారంగానో, ప్రత్యక్షంగా అవినీతితో సంబంధం ఉన్న కారణంగానో చంద్రబాబును కూడా జైలుకు పంపిన విధానాన్ని చూశాం. గతంలో ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని అప్పట్లో అనేక కేసులు వేధించాయి. ఆయనపై 180 పై చిలుకు కేసులు ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక ఆయన సీఎం అయ్యాక, గత ప్రభుత్వ కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేసు వంటి అనేక కేసులు వెలుగు చూస్తున్నాయి. వాటిల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు లాంటి వాళ్ళు నిందితులుగా ఉండటం గమనించాలి. కల్వకుంట్ల కవిత కూడా లిక్కర్ కేసులో నిందితురాలిగా జైలు జీవితం గడిపి వచ్చారు. ఇక బీజేపీ అగ్రనేతలు బీఎల్ సంతోశ్ వంటి వారు, వారి మధ్యవర్తిత్వంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర పన్నారని నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ ఏకంగా నిన్న మొన్నటి దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆరు నెలలు కూడా నిలవదని పలికిన ప్రగల్బాలు దాదాపు ఇదే కోవలోకి వచ్చే వ్యవహారాలే.
ఇక, అధికార పక్ష, విపక్ష రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తుంటే అసహ్యంగానే అనిపిస్తుంది. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరనే సామెత వీరికి సరిపోతుంది. ఐదేళ్ల పాటు జగన్, పదేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం చేసిందేంటి? ఈ రెండు కుటుంబాలు, వీరిని నమ్ముకున్న వారి సామాజిక వర్గానికి చెందిన మరికొందరు మాత్రమే బాగు పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాళ్ళ అవినీతి దోపిడీ రుజువవుతాయో లేదో కానీ, వారి పాలనలో రెండు రాష్ట్రాలు మాత్రం దివాళా తీసాయి.
ఇప్పుడా కేసులు, విచారణలు జరుగుతుండటంతో ఎదుటి పార్టీలపై రంకెలు వేస్తున్న వైనం ప్రజలకు కంపుకొడుతున్నది. మళ్లీ తమదే అధికారం మాదే ధీమా, రాజకీయాల్లో ప్రజలకు ప్రత్యామ్నాయ లోపాలను ఎత్తి చూపుతున్నది. కాంగ్రెస్ విఫలమైతే, బీజేపీకి ప్రజల్లో బలం లేదు కాబట్టి తమను ఎన్నుకోవడం తప్ప ప్రజలకు వేరే ప్రత్యామ్నాయమే లేదని బీఆర్ఎస్ దీమా. బీఆర్ఎస్ పనైపోతే, కాంగ్రెస్ ను విఫలం చేసైనా అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పన్నాగం. ఇక ఆ రెండు పార్టీలకు దీటుగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అధికారం నిలుపుకోవాలన్న ఉబలాటం కాంగ్రెస్ ది. అలాగే ఏపీలో కూడా కూటమి విఫలమైతే తమదే అధికారం అన్న దీమాలో వైసీపీ ఉన్నది. కాంగ్రెస్ ఎలాగూ బలంగా లేదు కాబట్టి, జగన్ ను నిలువరిస్తే తమదే అధికారం, హవా అన్న దీమాలో అధికార కూటమి ఉంది. ఇక్కడా ప్రజలకు కూటమి, వైసీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు.
ఈ ప్రజలకు ప్రత్యమ్నాయం లేని పరిస్థితులను కల్పించి మరీ, తమ అధికార దాహం తీర్చుకోవడానికి, అన్ని పార్టీలు అవే ఎత్తుగడల్లో ఉన్నాయి. అయితే ఈలోగా, ఆయా పార్టీలు అధికారం కోసం అర్రులు చాస్తూ చేసుకుంటున్న ఆరోపణలే అసహ్యంగా ఉన్నాయి. జుగుప్సాకరంగా ప్రజలకు ఏవగింపు కలిగిస్తున్నాయి. దొంగలే దొంగా దొంగా అని అరచినట్లు, తమ తప్పులేవీ ప్రజలకు తెలియవని, తెలిసినా, ఎదురుదాడులతో జనం సానుభూతి పొంది, ప్రజల్ని మోసం చేయొచ్చనే పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు వారి వారి సొంత మీడియాల్లో చేస్తున్న ప్రచారం హేయంగా కనిపిస్తోంది. కొందరు తామే అధికారంలో ఉన్నట్లుగా, మరికొందరు తమకు తప్ప పాలించే అర్హత మరెవ్వరికీ లేనట్లుగా నీచంగా మాట్లాడుతున్నారు. హద్దుపద్దు లేకుండా సోషల్ మీడియాని వాడుకుంటున్నారు.
ఇలాంటి సుద్దపూసలు సుద్దులు చెబుతున్నారు. ఆత్మ పరిశీలన ఆవగింజంతైనా ప్రదర్శించకుండా ప్రజలపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. అబద్దాలను అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. అధికారాన్ని నిలుపుకోవడానికి పార్టీ ఫిరాయింపులను బరితెగించి ప్రోత్సహిస్తున్నారు. అధికారం తమకు పేటెంట్ అయినట్లుగా వ్యవహరిస్తున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే. ఏ పార్టీని ద్వేషించడమో, సమర్థించడమో కాదు కానీ, రాజకీయాల్లో కొంచెమైనా నీతి, నిజాయితీ, నిబద్ధత అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. లేదంటే నేపాల్ పరిస్థితే ఎదురవుతుంది.

