ఇప్పటి వరకు మీడియా ప్రభుత్వాలను శాసించడం, సంస్కరించడం, కట్టడి చేయడం, కూల్చేయడం వరకే తెలుసు. కానీ, సోషల్ మీడియా ఓ దేశ అత్యున్నత అధికారాన్ని జయించడం ఇప్పటి వరకు ఎక్కడైనా చూశామా!? లేదు. కానీ, నేపాల్ ప్రభుత్వానికి ‘పతనశాసనం’ రాసింది సోషల్ మీడియా.
అసలు నేపాల్ లో ఏం జరిగింది? ఎందుకు జరిగింది? ప్రభుత్వం ఎందుకు కూలింది? దానికి సోషల్ మీడియా ఏ విధంగా కారణమైంది? నేపాల్ లో చెలరేగిన ‘జెన్-జీ ఉద్యమం’, ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ లపై కన్నెకంటి వెంకట రమణ రాసిన ప్రత్యేక వ్యాసం నేపాల్ సర్కార్ కి ‘పతనశాసనం’ రాసిన సోషల్ మీడియా!‘
సోషల్ మీడియా… గత పదేళ్లుగా ప్రారంభమయిన ఈ విస్తృత మీడియా ప్రభావం ఎంతగావుందంటే, ఒక్క సారిగా సోషల్ మీడియాను నేపాల్ ప్రభుత్వం నిలిపి వేయడంతో కోపోద్రిక్తులైన నేపాల్ యువత ఆ దేశ పార్లమెంటును ఆక్రమించారు. దీనితో తప్పనిసరై నేపాల్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని నియంత్రించడానికి సైన్యాన్ని రంగంలోకి దించింది. పెద్ద ఎత్తున నిరసనలు, కాల్పులు, 19 మంది మరణం, 100 మందికి పైగా గాయాలు, ఫలితంగా సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేత, ముందుగా నేపాల్ హోం మంత్రి రాజీనామా, అనంతరం ప్రధాని ఓలి రాజీనామా… ఇవి నేపాల్ లో జరిగిన పరిణామాలు.
ఒకవిధంగా, ఇది ప్రపంచంలో మొట్టమొదటి సోషల్ మీడియా ప్రభావిత విప్లవం అని చెప్పవచ్చు.
తమ దేశ నిబంధనలు పాటించడంలేదనే ఆరోపణలతో ఎక్స్, ఫేస్ బుక్, వాట్సాప్ లతో సహా 26 సోషల్ మీడియా యాప్ లను నేపాల్ నిషేధించింది. ఇప్పటికే, జెన్-జీ అనే బ్యానర్ పై నేపాల్ రాజరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు, నేపాల్ ప్రభుత్వం చేసిన సోషల్ మీడియా బ్యాన్ ఒక ఊతంగా లభించింది. దీంతో వేలాదిగా యువత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు. ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, లాఠీచార్జీలు, మీడియా స్వేచ్చపై దాడులు వంటి చర్యలు కొనసాగాయి. యువత నిర్వహిస్తున్న ఆందోళన, ప్రదర్శనల కారణంగా ఖాట్మండు, విరాట్‌నగర్ తదితర ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు.
నేపాల్ ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ నేపథ్యం ఇదీ…
నేపాల్‌లో ‘జెన్-జీ ఉద్యమం’ ఇటీవల ఆ దేశ యువత ప్రారంభించిన అత్యంత శక్తివంతమైన ఉద్యమం. ప్రధానంగా 1997 తర్వాత జన్మించిన “జెన్-జీ” తరానికి చెందిన యువత ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ ఉద్యమం అవినీతిని, ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని, సోషల్ మీడియాపై నిషేధాన్ని, ప్రజాస్వామిక హక్కులపై విధించిన ఆంక్షలను ఈ యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మొత్తం ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను నేపాల్ ప్రభుత్వం ఒక్కసారిగా బ్యాన్ చేయడంతో, తమ దైనందిన జీవితంలో ఒకటిగా ఉన్న సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో ఒక్కసారిగా వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చారు. ఇప్పటికే, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలలో భాగస్వామ్యమైన ఈ ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ గ్రూప్ నకు, సోషల్ మీడియాపై నిషేధం వీరి ఉద్యమానికి మరింత ఊపునిచ్చాయి. సమాజంలో మార్పు కోరుతూ పెద్ద ఎత్తున ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఆందోళనల్లో వేల మంది యువత పాల్గొంటున్నారు. ‘జెన్ జెడ్ రెవెల్యూషన్’ అనే నినాదాలతో ర్యాలీలు, పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శనలు సాగిస్తున్నాయి. ఇది ఏ పార్టీ నాయకత్వం లేకుండా, స్వతంత్రంగా యువత ఆధ్వర్యంలో సాగుతున్న ఉద్యమం.
ప్రపంచంలో పలు దేశాలు గతంలో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాయి లేదా పరిమితం చేశాయి. చైనా, ఇరాన్, ఉత్తర కొరియాలలో కఠినంగా నిషేధంలో ఉన్నాయి. పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, టర్కీ, సూడాన్ తదితర దేశాలలో ఈ మీడియా ప్లాట్ ఫార్మ్ పాళీ పరిమితులున్నాయి. ఇక మన దేశంలో, జమ్మూ & కశ్మీర్, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో శాంతిభద్రతల కారణంగా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, టిక్ టాక్ వంటి వాటిని పలు సార్లు బ్లాక్ చేశారు. టిక్ టాక్, పీయుబీజీ మోబైల్ లాంటి చైనా యాప్‌లను కూడా నిషేధించారు. ఏది ఏమైనా, సోషల్ మీడియా ప్రజల దైనందిన జీవితంలో ప్రధాన భాగంగా మారిందనేది సుస్పష్టం.

-కన్నెకంటి వెంకట రమణ

