అతిగా ఆశపడి, అతిగా ఆవేశపడిన ట్రంప్, అంతకంటే అతిగానే భంగపడ్డాడు. లేని పెత్తనాన్ని నెత్తికెత్తుకుని, ప్రపంచం మీదకు కర్ర పెత్తనానికి వెళితే, ఆ కర్ర విరిగి, పుర్రె పగిలినంత పనైంది. ఇప్పటికైనా ట్రంప్ కు బుద్ధి వస్తుందా? అంటే, కొన్ని బుద్ధులు పుర్రెలతోగానీ పోవు. ఇదీ అంతే. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారనేది సామెత. కానీ, ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బాగా అతికిపోతుంది. అడ్డగోలుగా సుంకాల టారిఫ్‌లు పెంచి ప్రపంచాన్ని లొంగదీసుకుందామనుకున్న ట్రంప్‌కు అనూహ్యంగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. అవి అమెరికాను ధిక్కరించేంతగా ఉండటమే అసలైన సవాల్! యుద్ధాలను ఉసిగొల్పుతూ, అవే యుద్ధాలను ఆపేశామన్న పోజు కొట్టి, శాంతి నోబెల్ ప్రైజ్ కొట్టేయాలన్న ట్రంటు తలంపు, ఇప్పుడాయనకు శాంతి లేకుండా చేస్తోంది. ట్రంపు సుంకాలను తొలుత చైనా గట్టిగానే ఎదిరించింది. ఎదురు సుంకాలు విధించింది. ఇప్పుడు భారత్ కూడా సరిగ్గా అలాగే చేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అడ్డం పెట్టుకుని మనల్ని లొంగదీసుకుని, ఏకాకిని చేయాలనుకున్న అమెరికా ఇప్పుడు ఏకాకి అయింది. షాంఘై సదస్సు తరవాత ట్రంప్‌లో అసహనం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. భారత్, చైనా, రష్యాలు ఏకమయ్యాయని, భారత్‌ను దూరం చేసుకున్నానని వలపోస్తున్నాడు. భారత్ మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా సమాధానం ఇస్తోంది.
భారత్ తలచుకుంటే అమెరికా దెబ్బతినడం ఖాయం. అక్కడ ఉన్న టెకీలు భారత్‌కు తిరిగివస్తే నష్టపోయేది అమెరికాయే. మొన్నటి ఎన్నికల్లో ఎన్నారైలు అంతా గంపగుత్తగా ట్రంప్‌కు ఓటేశారు. ఈ కృతజ్ఞత కూడా ట్రంప్‌కు లేకుండా పోయింది. టెకీలపై ఆంక్షలు విధిస్తున్నాడు. అచ్చోసిన ఆంబోతులా సుంకాల టారిఫ్ ల దాడికి దిగాడు. ఈ సమయంలోనే తియాన్‌జిన్ సమావేశం ట్రంప్ గాయంపై కారం చల్లినట్లైంది. అత్యధిక జనాభా కలిగిన భారత్, రష్యా, చైనా దేశాలు ఐక్యతను చాటాయి. ట్రంప్ టారిఫ్‌లపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా విరుచుకు పడ్డారు. చైనా, భారత్ లాంటి దేశాలను దూరం చేసుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
షాంఘై సదస్సు ఏం సాధించిందన్న దానికి ట్రంప్ అంతర్మథనమే అద్దం పడుతోంది. ఈ మార్పు నిస్సందేహంగా ఒక బహుళ ధృవ ప్రపంచం అవసరాన్ని తెరపైకి తీసుకుని వచ్చింది. తియాన్ జిన్ రేవు పట్టణం షాంఘై సహకార సమితి శిఖరాగ్ర సమావేశానికి ఘనంగా ఆతిథ్యమిచ్చింది. ఎస్.సి.వో తన పరిధిని విస్తరించుకుని ఆర్థిక సహకారం, సాంస్కృతిక సంబంధాలు, ఇంధన రంగాలను కూడా చేర్చుకుంది. 21వ శతాబ్ది సవాళ్లనూ అవకాశాలను ఎస్.సి.వో స్వీకరించింది.
ట్రంప్ ఉన్మాదపూరితంగా మాట్లాడుతున్నాడు. భారత ఆర్థిక వ్యవస్థ నిర్జీవంగా ఉందనీ, దాంతో వ్యాపారం చేయడమంటే కోరి వినాశనం కొని తెచ్చుకోవడమేననీ నోరు పారేసుకున్నాడు. పాక్ తో భారత్ సైనిక ఘర్షణల విరమణలో తన పాత్రకు తగిన గుర్తింపునివ్వలేదని కూడా ట్రంప్ కుదేలైపోయాడు. రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి భారతే కారణమనేంత వరకూ వెళ్లారు. భారత్‌ను లొంగదీసు కోవడమే ఇక్కడ అమెరికా ప్రధానోద్దేశం.
ఇక బహుళ ధృవ ప్రపంచ దృశ్యం, సామర్థ్యం, సత్తా ఏమిటో తియాన్‌జిన్ చూపెట్టింది. జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్, నరేంద్ర మోదీలు కలిసి పాల్గొనటం, సుస్థిర ప్రపంచ వ్యవస్థను నొక్కి చెప్పింది. ప్రాంతీయ, ప్రపంచ భద్రతపై ఎస్.సి.వో దృష్టిని కేంద్రీకరించింది. ఇజ్రాయిల్, అమెరికాల సైనిక దాడులను తీవ్రంగా ఖండించింది. అవి అంతర్జాతీయ చట్టాలనూ ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించేవిగా వున్నాయి. ఇరాన్ సార్వభౌమాధికారానికి తూట్లు పొడిచేవిగా జరిగాయని పేర్కొంది. తియాన్‌జిన్ సమావేశానికి ముందు మోదీ, జిన్‌పింగ్‌లు శిఖరాగ్ర సమావేశం జరిపినప్పుడే గాలి ఎటు వీస్తున్నదీ స్పష్టమైపోయింది. భారత్, చైనాలు భాగస్వాము లేగానీ విరోధులు కాదన్నది ఉమ్మడి స్ఫూర్తిగా వచ్చిన ప్రధాన సందేశం. బహుళ ధృవ ప్రపంచం, వాణిజ్య స్వేచ్ఛను ప్రముఖంగా చెబుతూ న్యాయమైన, సహేతుకమైన పరస్పర అంగీకార యోగ్యమైన పరిష్కారాలను కనుగొనాలని ఈ రెండు దేశాలు అవగాహనకు వచ్చాయి. విధానపరమైన స్వీయ నిర్ణయాధికారాన్ని ఇరు దేశాలు పాటిస్తాయి. ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకునే దిశలో బహుముఖ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని జిన్‌పింగ్ పేర్కాన్నారు. భారత్, చైనా సంబంధాలను సరిహద్దు సమస్యను బట్టి మాత్రమే నిర్ణయించరాదని కూడా ఆయన చెప్పారు. విశాల భౌగోళిక దృష్టితో భారతదేశ ప్రయోజనాలను ట్రంప్ చూడటం లేదని తేలిపోయింది. ఆసియాలో బలాబలాల సమతుల్యతకు సంబంధించి భారత దేశం విలువేమిటో ఆయనకు తెలియలేదని అర్థమై పోయింది. భారత అమెరికా సంబంధాలను గమనిస్తున్న వారికి మాత్రం ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించదు. ఇది ఎప్పుడో జరగవలసి వున్నదే.
ఆపరేషన్ సిందూర్ తర్వాత, కాల్పుల విరమణకు తానే కారణమంటూ ఉన్మాదంగా ట్రంప్ ఏకపక్షంగా చెప్పుకోవడం ట్రంప్ టెంపరితనాన్ని ప్రపంచానికి చాటింది. ఇండియా, పాక్ లను ఒకే గాటనకట్టి చూడటం ట్రంప్ సంకుంచితత్వానికి పరాకాష్ట. వాణిజ్యంలో అమెరికాపై ఆధారపడకపోతే కలిగే నష్టాలను తట్టుకోవడానికి భారత్ సిద్దం కావాలి. దీనికి స్వదేశీ నినాదమొక్కటే మార్గం.
అమెరికా పెత్తనానికి షాంఘై సదస్సు సవాల్!|EDITORIAL

