కవితను బయటకు పంపడం ఒక ఎత్తుగడ కావచ్చు. మరి కవిత వ్యాఖ్యలు కూడా ఎత్తుగడేనా? హరీశ్ రావు, సంతోశ్ రావులే అవినీతికి పాల్పడ్డారని కవిత తన నాన్న, అన్నలను వెనుకేసుకొస్తోంది. వాళ్ళకా పాప పంకిలం అంటకుండా జాగ్రత్తగా మాట్లాడుతోంది. సరే, మరి అవినీతికి పాల్పడిన వారంతా కేసీఆర్ కుటుంబ సభ్యులే కదా? ప్రభుత్వంలో, పదవుల్లో భాగస్వాములు, బాధ్యులు, కేసీఆర్ వెన్నంటే ఉన్నవారే కదా? కేసీఆర్ కు బాధ్యత లేకుండా పోతుందా? స్థిరత్వం, లక్ష్యశుద్ధి, ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ దగ్గర లేకపోవడం కూడా కనిపిస్తోంది. ప్రజలు అధికారం ఇస్తే దోచేస్తాం. దాచుకుంటాం. ఇవ్వకపోతే నిద్రపోతామనే విచిత్ర వితండ తార్కిక ధోరణి కేసీఆర్‌లో కనిపిస్తున్నది. నాడు ఉద్యమంలోనూ కేసీఆర్ ఇదే ధోరణిని అవలంబించారు. జయశంకర్‌ను అవమానించారు. కోదండరాం వంటి అనేక మంది ఉద్యమకారులను మెడపట్టి గెంటేశారు. అసోంలో అస్సాం గణపరిషత్ కూడా ఇలాగే పతనమైంది. అయితే ఇప్పుడు కవిత, బీఆర్ఎస్ కు ఊపిరిపోస్తున్నారా!? తీస్తున్నారా??
‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్
పతనావస్థలో బీఆర్ఎస్!
అవినీతితో అంటకాగి, అధికారానికి దూరమై, మళ్ళీ అధికారం కోసం అర్రులు చాస్తున్న బీఆర్ఎస్ ఆగమాగం అవుతోంది. కుటుంబ సమస్యలను చక్కదిద్దుకోలేని కేసీఆర్, పార్టీని, రాష్ట్రాన్ని, ప్రజల్ని ఏ మేరకు నడపగలరు? కాపాడగలుగుతారు? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసుని ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, కవితను పార్టీ సస్పెండ్ చేయగా, ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలే వారి అవినీతిని బహిర్గతం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లో అధికారాన్ని అడ్డంపెట్టుకుని బాగా సంపాదించారని కవిత వ్యాఖ్యల వల్ల తేటతెల్లమైంది. హరీశ్ రావు, సంతోశ్ రావులు, కేటీఆర్ క్లాస్ మేట్ నని ప్రచారం చేసుకున్న సంతోశ్ క్లాస్ మేట్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు బాగా సంపాదించారని కవితే స్వయంగా ఆరోపిస్తున్నారు. కేటీఆర్ సోషల్ మీడియాను, హరీశ్ మీడియాను మేనేజ్ చేస్తున్నారని కూడా చెప్పారు. కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడమే వారి లక్ష్యమని ఆరోపించారు.
ఇదంతా కేసీఆర్ కుటుంబ అంతర్గత సమస్య. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితమవడం, అధికారం పోగానే ప్రజల్లోకి రాకపోవడం వల్ల పార్టీ పతనానికి చేరువైంది. అధికారం ఉండగా అవినీతిలో మునిగితేలారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాశారు. అధికారం, డబ్బుతో విర్రవీగారు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. తాను కట్టిన కాళేశ్వరం సకల సమస్యలకు సమాధానమని చెప్పిన నేత, దాని నిర్మాణ పర్యవసనాలను ఎదుర్కోవడం కాదు కదా, కుటుంబాన్ని కూడా గాడీలో పెట్టలేకపోతున్నారు. చివరకు పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే దశకు చేరుకోవడానికి కేవలం కేసీఆర్ స్వయంకృతమే తప్ప మరే కారణం కనిపించడం లేదు.
నడిపించే వాడే నాయకుడు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి. గెలుపోటములన సమానంగా తీసుకోవాలి. ఓడినప్పుడే మరింత కష్టపడాలి. అధికారం ఉంటే అనుభవించమే కాదు, సవాళ్ళకు ఎదురొడ్డాలి. ధైర్యంగా ఎదుర్కోవాలి. కేసీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కవిత సస్పెన్షన్ వ్యవహారం కేసీఆర్ కుటుంబ అవినీతిని పతాక స్థాయిలో చూపించడమేగాక, బీఆర్‌ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
వయసులో కేసీఆర్ కంటే పెద్దవాడు, అనేక దఫాలుగా సీఎంగా పని చేస్తున్న చంద్రబాబు ఇంకా అదే ఉత్సాహంతో పని చేస్తున్నారు. జైలులో వేసినా వెనుకడుగు వేయలేదు. పార్టీ శ్రేణులలకు ధైర్యం ఇచ్చాడు. తిరిగి అధికారంలోకి వచ్చే వరకు విశ్రమించలేదు. చంద్రబాబు, కరుణానిధి, మమతా బెనర్జీ, జయలలిత కూడా అటు బీజేపీతో, ఇటు కాంగ్రెస్ తోనూ పని చేసినప్పటికీ, వారు తమ అస్తిత్వాన్ని కోల్పోలేదు. నిరంతరం ప్రజల్లో ఉంటూనే రాజకీయం చేశారు. ఓటమిని అంగీకరించి, మళ్ళీ గెలిచే వరకు సర్వశక్తులు ఒడ్డేవారు. ఆ తెగువ కేసీఆర్‌లో కనిపించడం లేదు. తమను ఓడించడం ప్రజలు చేసిన తప్పని, అవసరమనుకుంటే, వారే ఓటేస్తారని భావిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన అసెంబ్లీకి కూడా రావడం లేదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి, లక్ష్యాలకు, ఆశయాలకూ దూరం కావడంతో పాటు, కేసీఆర్ ఏకపక్ష విధానాల వల్లే పార్టీ ఈ దుస్థితిని ఎదుర్కొంటుందన్నది ముమ్మాటికి నిజం.
కవితను బయటకు పంపడం ఒక ఎత్తుగడ కావచ్చు. మరి కవిత వ్యాఖ్యలు కూడా ఎత్తుగడేనా? హరీశ్ రావు, సంతోశ్ రావులే అవినీతికి పాల్పడ్డారని కవిత తన నాన్న, అన్నలను వెనుకేసుకొస్తోంది. వాళ్ళకా పాప పంకిలం అంటకుండా జాగ్రత్తగా మాట్లాడుతోంది. సరే, మరి అవినీతికి పాల్పడిన వారంతా కేసీఆర్ కుటుంబ సభ్యులే కదా? ప్రభుత్వంలో, పదవుల్లో భాగస్వాములు, బాధ్యులు, కేసీఆర్ వెన్నంటే ఉన్నవారే కదా? కేసీఆర్ కు బాధ్యత లేకుండా పోతుందా? స్థిరత్వం, లక్ష్యశుద్ధి, ప్రజాస్వామ్య స్ఫూర్తి కేసీఆర్ దగ్గర లేకపోవడం కూడా కనిపిస్తోంది. ప్రజలు అధికారం ఇస్తే దోచేస్తాం. దాచుకుంటాం. ఇవ్వకపోతే నిద్రపోతామనే విచిత్ర వితండ తార్కిక ధోరణి కేసీఆర్‌లో కనిపిస్తున్నది. నాడు ఉద్యమంలోనూ కేసీఆర్ ఇదే ధోరణిని అవలంబించారు. జయశంకర్‌ను అవమానించారు. కోదండరాం వంటి అనేక మంది ఉద్యమకారులను మెడపట్టి గెంటేశారు. అసోంలో అస్సాం గణపరిషత్ కూడా ఇలాగే పతనమైంది. వారసులు ఉండడం, తండ్రి తరవాత వారు పెత్తనం చేయడం సహజం. మమతా బెనర్జీకి కూడా మేనల్లుడు వారసుడిలా వెన్నంటి ఉన్నారు. కాని ఆ పార్టీలేవీ వారసుల మూలంగా అంతర్గత సంక్షోభంలో చిక్కుకోలేదు. ములాయం, లాలూప్రసాద్, కరుణానిధి, శిబూ సోరెన్‌ల వారసులే ఆ తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. పైగా వారి బంధువులు కూడా పార్టీల్లో, పదవుల్లో కీలక స్థానాలు పోషించారు. జయలలిత ఉన్నప్పుడు నెచ్చెలి శశికళ పెత్తనం చేశారు. కానీ పార్టీని దెబ్బతీయలేదు. కాంగ్రెస్‌లో కూడా రాహుల్, ప్రియాంక కలిసి, ఎవరి బాధ్యతలు వారు నెరవేరుస్తూ, అధికారం కోసం చెమటోడుస్తున్నారు. అయితే ఇప్పుడు కవిత, బీఆర్ఎస్ కు ఊపిరిపోస్తున్నారా? తీస్తున్నారా?
కానీ కేసీఆర్ ఫ్యామిలీలా కాదు. పార్టీని గాలికి వదిలేయడం, ప్రజల్లోకి రాకపోవడం, కోటరీల ప్రభావానికి లోను కావడం వల్ల కవితను దూరం చేసుకోవడంతో పాటు, ఇంటిగుట్టును రోడ్డున పడేసుకున్నారు. కేసీఆర్ విషయాన్ని గ్రహించరు, ఎవరు చెప్పినా వినరు. రాను రాను చెప్పేవారే లేకుండా పోయి, పార్టీ అవసాన దశకు చేరినట్లుగా కనిపిస్తింది.

