వంద మంది దోషులు తప్పించుకున్నా సరే, ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడవద్దన్నది న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం. కానీ, న్యాయస్థానాలకు వెళ్లాల్సి వచ్చిన వాళ్ళంతా దాన్నో శిక్షగానే భావిస్తున్నారు!? ఎస్. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అంటే ఆలస్యపు న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క. అనేక మంది సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి న్యాయాన్ని చూడకుండానే జీవితం ముగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య న్యాయ మూల సూత్రాలకే విరుద్ధం.
2025 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, మన దేశంలో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 70 వేలకు పైగా, హైకోర్టులలో 60 లక్షలకు పైగా, లోయర్ కోర్టులలో నాలుగున్నర కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు క్రిమినల్ లేదా సివిల్ కేసులు మాత్రమే కాకుండా, అత్యంత కీలకమైన రాజ్యాంగ పరమైన, రాజకీయ, సామాజిక కేసులు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కేసులు 10 ఏళ్లకు పైగా విచారణ కోసం నిరీక్షిస్తున్నాయి.
మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగానే నడవాలా? న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో కూడా సంస్కరణలు రావాలి కదా!? కోర్టులు కూడా తమకుతాము కాల పరిమితి విధించుకోల్సిన సమయం ఆసన్నమైంది. ఏ కేసైనా నిర్ణీత గడువులో విచారణ పూర్తి కావాలి. ఇందుకు ఏం చేయాలి? ఏ విధమైన సంస్కరణలు చేపట్టాలి?
స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాపాలు సాగాలి. స్థానిక భాషల్లోనే చర్చించేలా, తీర్పులు వెలువడేలా చట్టం చేసుకోవాలి. అనేక సంస్కరణలకు పూనుకుంటున్న ప్రధాని మోదీ, న్యాయ వ్యవస్థ సంస్కరణపై పున: సమీక్షించగలరా? పూనుకోగలరా?
‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ ‘సత్వర న్యాయానికి–తక్షణ సంస్కరణలు!’
సత్వర న్యాయానికి – తక్షణ సంస్కరణలు!
భారత ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలాగే న్యాయవ్యవస్థ కూడా ప్రపంచంలోనే అతిపెద్దది. సుప్రీం కోర్టు, హైకోర్టులు, జిల్లా, ఉపకోర్టులుగా విస్తరించి ఉంది. ఇంత పెద్ద ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సత్వర న్యాయం. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అంటే ఆలస్యపు న్యాయం అన్యాయం కిందే లెక్క. అనేక మంది సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి న్యాయాన్ని చూడకుండానే జీవితం ముగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య న్యాయ మూల సూత్రాలకే విరుద్ధం.
2025 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, మన దేశంలో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 70 వేలకు పైగా, హైకోర్టులలో 60 లక్షలకు పైగా, లోయర్ కోర్టులలో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు క్రిమినల్ లేదా సివిల్ కేసులు మాత్రమే కాకుండా, అత్యంత కీలకమైన రాజ్యాంగ పరమైన, రాజకీయ, సామాజిక కేసులు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కేసులు 10 ఏళ్లకు పైగా విచారణ కోసం నిరీక్షిస్తున్నాయి. అయితే ఈ కేసులు ఆలస్యం అవడానికి ప్రధాన కారణాలు: న్యాయమూర్తుల కొరత, అధిక కేసుల భారం, పాత చట్టాలు, జఠిలమైన న్యాయ ప్రక్రియలు, ప్రాసిక్యూషన్ వ్యవస్థ బలహీనత, తరచూ వాయిదాలు. ఇక ఈ పిండింగ్ కేసుల వల్ల కోర్టుల పట్ల పౌరుల నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఏళ్ళ తరబడి కేసులు నడవడం వల్ల కక్షిదారులకు కాలాతీతం, ఆర్థిక భారం సంభవిస్తున్నాయి. కొందరు న్యాయాన్ని చూడకముందే మరణిస్తున్నారు.
మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగానే సాగుతోంది. న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో కూడా సంస్కరణలు రావాల్సివుంది. కోర్టులు కూడా తమకుతాము కాల పరిమితి విధించుకోల్సిన సమయం ఆసన్నమైంది. ఏ కేసైనా నిర్ణీత గడువులో విచారణ పూర్తి కావాలి. సీబీఐ, ఈడీ దాడుల కేసుల్లో కూడా సత్వర విచారణ జరగడం లేదు. ఏపీలో వివేకా హత్య కేసు ఏళ్ళుగా ఎటూ తేలకుండా మిగిలిపోయింది. దోషులూ తేలలేదు, శిక్షలూ పడలేదు. ఈ లోగా ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళు పదవులు నిర్వర్తిస్తున్నారు. అనేక ఆరోపణలున్న జగన్ ఐదేళ్లు బెయిల్ మీదే పాలన చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేసులో పరస్పర విరుద్థ తీర్పులు ఇవ్వడమే గాకుండా 17 ఏళ్లుగా కోర్టులో నానింది. చివరకు జర్నలిస్టులు మరణిస్తున్నారే తప్ప ఇంచు జాగా, ఇండ్లు సంపాదించింది లేదు. రాజకీయ నాయకుల కేసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటి సాగదీత వల్ల ప్రజల్లో భయం లేకుండా పోతున్నది.
ఇదే సందర్భంగా పెండింగ్ కేసులు సమస్యగా మారాయి. ఏళ్ళ తరబడి పెండింగులోని కేసులు అలాగే ఉండగా, కొత్త కేసులో ఆ జాబితాలో చేరుతున్నాయి. అవి గుట్టల్లా పేరుకుపోతున్నాయి. దీంతో భారత న్యాయ వ్యవస్థ సాధారణ ప్రజలకు దూరమవుతోంది. తమకు న్యాయం జరగదని భావిస్తున్న వారూ కోర్టులకు వెళ్లడం లేదు. కోర్టులకు వెళ్ళిన వారిలో చాలా మంది తమ జీవిత కాలంలో ఆ న్యాయాన్ని చూడలేకపోతున్నారు. తీర్పులు వచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు.
నేటికీ ఎందరో చేయని నేరాలకు జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారిని ఎలా బయటకు తీసకుని వస్తారన్నది కూడా ముఖ్యం. పార్టీ ఫిరాయింపుల కేసులో మూడు నెలల్లో తేల్చాలని సుప్రీం ఆదేశించింది. పెద్దగా ప్రగతి లేదు. చివరకు ఎన్నికల ముందు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా చేయగలిగేది ఏమీ లేదు. చెన్నమనేని రమేశ్ కేసు ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాపాలు సాగాలి. స్థానిక భాషల్లో చర్చించేలా, తీర్పులు వెలువడేలా చట్టం చేసుకోవాలి. గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తిం చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు దీని గురించి ఆలోచించాలి. పార్లమెంట్ వేదికగా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి.
నిజానికి కోర్టులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రజలను కోర్టులకు చేరువ చేయడం రాజ్యాంగ విధి కావాలి. న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించి, విశ్వాసం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఈ-కోర్టుల వ్యవస్థను బలోపేతం చేయాలి. అత్యవసర న్యాయ సదస్సులు నిర్వహించాలి. జడ్జీలు, సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి.
చిన్నపాటి వివాదాలు కోర్టుల దాకా రాకుండా, గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధానాలను ప్రోత్సహించాలి. అవసరం లేని చట్టాలను తొలగించి , చట్టాలను సరళీకరించాలి. ప్రాసిక్యూషన్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు మరింత సమర్థంగా పని చేయడానికి శిక్షణ, వనరుల కల్పన అవసరం. ఇలా పలు అంశాలపై అవసరమై అధ్యయనాలు జరిపి, ప్రజలు న్యాయ వ్యవస్థను చేరువ చేయాలి. సత్వరమే న్యాయం అందేలా చట్టాలు రూపొందించి, న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

